AP Maoist Encounter Vijayawada: సాధారణంగా మావోయిస్టులు అంటే అడవుల్లో ఉంటారు. నగరాల్లో అస్సలు కనిపించరు. అటువంటిది ఏపీ వ్యాప్తంగా నగరాల్లో మావోయిస్టులు కనిపించడం విశేషం. చత్తీస్గడ్ కు చెందిన 27 మంది మావోయిస్టులు విజయవాడ నగర శివారులోని కానూరు, ఆటోనగర్ ప్రాంతాల్లో పట్టుబడ్డారు. కాకినాడ ప్రాంతంలోనూ పెద్ద సంఖ్యలో మావోయిస్టులను అరెస్టు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. విజయవాడలో 27 మంది పట్టుబడగా అందులో 12 మంది మహిళలు ఉన్నారు. కూలి పనుల కోసం నగరానికి వచ్చినట్లు నమ్మించి వీరంతా ఒకే భవనంలో నివాసం ఉంటున్నారు. కేంద్ర బలగాలతో పాటు ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలు కలిపి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో వీరంతా పట్టుబడ్డారు.
Also Read: ఆపరేషన్ కగార్: హిడ్మా కు ఏమైంది? ఏపీ అడవుల్లో ఏం జరిగింది?
విజయవాడలో సంచలనం..
ఏపీ,తెలంగాణ సరిహద్దులో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయారు. ఇంటలిజెన్స్ సమాచారం మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోకి వచ్చిన హిడ్మా తో పాటు ఆరుగురు ఎన్కౌంటర్ అయ్యారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేశారు. విజయవాడతోపాటు కాకినాడలో సైతం పెద్ద ఎత్తున మావోయిస్టులు అరెస్టయ్యారు. అయితే ఈ హఠాత్ పరిణామంతో విజయవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమ చుట్టూ ఇంత పెద్ద స్థాయిలో మావోయిస్టులు, వారి ఆయుధాలు ఉండడంతో ఎవరిని నమ్మాలో.. ఎవరిని అనుమానించాలో తెలియని స్థితిలో ఉన్నారు విజయవాడ నగరవాసులు.
ఆపరేషన్ కాగర్ లో భాగంగా..
గత కొంతకాలంగా కేంద్ర బలగాలు జరుపుతున్న ఆపరేషన్ కాగర్ లో భాగంగా చేపట్టిన ఈ కూంబింగ్ లో ఏపీలో పెద్ద ఎత్తున మావోయిస్టులు పట్టుబడ్డారు. అయితే నిన్నటి ఎన్కౌంటర్ ఘటన మరువకముందే ఈరోజు మరో ఘటన జరిగింది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. బుధవారం తెల్లవారుజామున భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరంతా చత్తీస్గడ్ కు చెందిన వారిగా తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత దేవ్ జి సైతం ఉన్నట్లు సమాచారం.
Also Read: హిడ్మా తీసుకున్న ఆ నిర్ణయమే ప్రాణాలు తీసిందా?
కొనసాగుతున్న కూంబింగ్..
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. అయితే గత కొద్ది రోజులుగా ఏపీలో మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గాయి. చత్తీస్గడ్ లో తీవ్ర ఒత్తిడి పెరగడంతో మావోయిస్టులు ఏపీని సేఫ్ జోన్ గా ఎంచుకోవడం ప్రారంభించారు. అందులో భాగంగానే హిడ్మా ఏపీ వైపు రాగా భద్రతా బలగాలు ముట్టడించాయి. ఈరోజు మరో ఏడుగురు మృతి మరో ఏడుగురు మృతి చెందినట్లు ఏపీ ఇంటలిజెన్స్ డిజి మహేష్ చంద్ర లడ్డ ధ్రువీకరించారు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో 50 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు కూడా చెప్పారు.