కరోనాతో ఏపీలో గ్రూప్-1 పరీక్షలపై సందిగ్ధత!

కరోనా మహమ్మారితో సర్వత్రా బంద్ వాతావరణం నెలకొన్న దృష్ట్యా ఏప్రిల్ 7 నుండి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రధాన పరీక్షపై సందిగ్ధత నెలకొంది. ఒకవైపు ప్రాథమిక (ప్రిలిమ్స్‌) ప్రశ్నపత్రంపై హైకోర్టులో కేసు నడుస్తుండగా.. మరోవైపు కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో పరీక్ష జరుగుతుందా లేదా అనే సందిగ్ధం అభ్యర్థుల్లో నెలకొంది. 2018 డిసెంబర్‌ 31న గ్రూప్‌-1కు నోటిఫికేషన్‌ ఇచ్చిన కమిషన్‌ 2019 మే 26న ప్రాథమిక పరీక్షను నిర్వహించింది. 59,200 […]

Written By: Neelambaram, Updated On : March 22, 2020 1:11 pm
Follow us on

కరోనా మహమ్మారితో సర్వత్రా బంద్ వాతావరణం నెలకొన్న దృష్ట్యా ఏప్రిల్ 7 నుండి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రధాన పరీక్షపై సందిగ్ధత నెలకొంది. ఒకవైపు ప్రాథమిక (ప్రిలిమ్స్‌) ప్రశ్నపత్రంపై హైకోర్టులో కేసు నడుస్తుండగా.. మరోవైపు కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో పరీక్ష జరుగుతుందా లేదా అనే సందిగ్ధం అభ్యర్థుల్లో నెలకొంది.

2018 డిసెంబర్‌ 31న గ్రూప్‌-1కు నోటిఫికేషన్‌ ఇచ్చిన కమిషన్‌ 2019 మే 26న ప్రాథమిక పరీక్షను నిర్వహించింది. 59,200 మంది రాసిన ఈ పరీక్షలో 1:50 ద్వారా 8,351 మందిని ప్రధాన పరీక్షకు ఎంపిక చేసింది. అయితే ప్రధాన పరీక్షను ఇప్పటికే ఎపిపిఎస్‌సి పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది. చివరికి ఏప్రిల్‌ 7 నుంచి 19 వరకు పరీక్షలు జరపాలని ఇటీవల షెడ్యూల్‌ కూడా విడుదల చేసింది.

ఇలా ఉండగా, ప్రాథమిక పరీక్షలో తప్పులు వచ్చాయంటూ కొంతమంది అభ్యర్ధులు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. 120 ప్రశ్నల్లో 51 తప్పులున్నాయంటూ మూడు రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో పరీక్షల ప్రక్రియ ముందుకు సాగ కుండా ఉండేలా హైకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై ఏప్రిల్‌ 1న విచారణ చేపట్టనుంది. ప్రశ్నపత్రంపై కమిషన్‌కు అనుకూలంగా తీర్పు వస్తేనే పరీక్షల నిర్వహణ ప్రక్రయ కొనసాగుతుంది. లేకుంటే మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది.

మరోవైపు గ్రూప్‌-1 పరీక్షపై కరోనా ప్రభావం పడుతుందని కొంతమంది అభ్యర్ధులు ఎపిపిఎస్‌సికి వినతిపత్రం అందజేశారు. ఢిల్లీ, బెంగుళూరు, ముంబాయి వంటి నగరాల నుంచి అభ్యర్ధులు ఎపికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్‌, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు పరీక్షల కోసం ఆయా నగరాల్లో కనీసం 12 రోజులపాటు ఉండాల్సి వస్తుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా, కమిషన్‌ ముందుగా ప్రకటించిన క్యాలెండర్‌ ప్రకారం ఒక్క పరీక్ష కూడా నిర్వహించలేకపోతుందని నిరుద్యోగ యువత మండిపడుతున్నది. షెడ్యూల్‌కు కట్టుబడి ఎపిపిఎస్‌సి ఉండాలని సూచిస్తున్నారు.