రాజధాని అమరావతి ప్రాంతంలో 96 రోజులుగా దీక్షలు చేస్తున్న గ్రామ ప్రజలు, రైతులు జనతా కర్ఫ్యూ రోజున మాత్రం తమ దీక్షలకు విరామం ఇచ్చారు. దీక్షలు ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా జనసంచారం లేకూండా పోయింది. స్వచ్ఛంద కర్ఫ్యూలో రైతులందరూ భాగస్వాములయ్యారు.
జనతా కర్ఫ్యూ సందర్భంగా ఇవాళ ఉదయం 6 గంటల వరకు నిరసన శిబిరాల్లో ఉన్న రైతులు.. తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. బాధ్యతాయుతమైన పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించామని.. మళ్లీ రేపు నిరసనలను కొనసాగిస్తామని రైతులు తెలిపారు. ప్రస్తుతం దీక్షా శిబిరాలు ఖాళీగా కనపడుతున్నాయి.
మరోవంక పోలీస్ బలగాలను ఉపయోగించి ఈ దీక్షా శిబిరాలను ఖాళీ చేయించివాలని తొలుత విఫల ప్రయత్నాలు చేసి, హై కోర్ట్ చేత మొట్టికాయలు తిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు కరోనా వైరస్ బూచి చూపించి ఖాళీ చేయించడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఈ సారి పోలీసులు కాకుండా, తాజాగా ముందస్తు జాగ్రత చర్యల్లో భాగంగా దీక్షా శిబిరాలను ఖాళీ చేయమని కోరుతూ వైద్య శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. రైతుల జేఏసీ పేరుతో జరుగుతున్న ఎర్రపాలెం, కృష్ణాయపాలెం, మందడం, రాయపూడి, వెలగపూడి పెదపరిమి, తుళ్లూరు దీక్షా శిబిరాలను ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఖాళీ చేయాలని నోటీసుల్లో సూచించారు.
అయితే కరోనా వైరస్ సోకకుండా దీక్షా శిబిరాలలో ఒకరికొక్కరు దూరంగా ఉంటూ, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకొంటూ దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.