Amara Raja Batteries Telangana: బావ కళ్ళల్లో ఆనందం కోసం బామ్మర్ది ఏమైనా చేస్తాడు.. బావ బాగుకోసం బామ్మర్ది ఎంతకైనా తెగిస్తాడు. ఈ సామెతలన్నింటినీ మహేష్ బాబు నిజం చేశాడు. గల్లా జయదేవ్ కళ్ళల్లో ఆనందం చూశాడు. అక్క పద్మావతి ముఖంలో చిరునవ్వులు విరబూయించాడు.. మొత్తానికి అమర రాజా బ్యాటరీస్ కంపెనీ తెలంగాణలో ఏర్పాటయ్యేందుకు తెర వెనుక మహేష్ బాబు చక్రం తిప్పాడు. ఫలితంగా తెలంగాణకు 9,500 కోట్ల పెట్టుబడి లభించింది. 4,500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది.

ఏపీతో చికాకులు
ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత పారిశ్రామిక విధానం ఒక దిశ దశ లేకుండా సాగుతున్నది. ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా ఇప్పటివరకు 1,73, 167 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇందులో అదాని డేటా సెంటర్, స్టార్టప్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, కాగితపు పరిశ్రమ, రిలయన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్, అమరరాజా బ్యాటరీస్, లులూ గ్రూప్, ట్రైటాన్ బ్యాటరీస్, ప్రాంక్లిన్ టెంపుల్టన్, జాకీ వంటి కంపెనీలు ఉన్నాయి. ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక, ముడుపులు చెల్లించుకోలేక వెనక్కి వెళ్ళిపోయాయి. ఇదే సమయంలో మెజారిటీ కంపెనీలు తెలంగాణ గడప తొక్కాయి. దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి సుమారు లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎంత లేదూ అనుకున్నా 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మహేష్ బాబు ఎందుకు రంగంలోకి దిగారంటే
మహేష్ బాబు పెద్దక్కని గల్లా జయదేవ్ కు ఇచ్చారు. వీరికి అమర రాజా పేరుతో బ్యాటరీలు నిర్వహించే పరిశ్రమలు ఉన్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు వీరి పరిశ్రమకు వచ్చిన ఇబ్బంది లేదు. పైగా జయదేవ్ గుంటూరు ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే చిత్తూరు జిల్లాలో వీరి పరిశ్రమ కాలుష్య ఉద్గారాలను విడుదల చేస్తోందని ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇచ్చింది.. తక్షణమే ఉద్గారాలు తగ్గించుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఒత్తిళ్ళు పెరగడంతో కర్మగారాన్ని మూసివేసింది. ఇదే క్రమంలో పలు దఫాలుగా కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలతో చర్చలు జరిపినప్పటికీ గల్లా జయదేవ్ అంత సంతృప్తి చెందలేదు. దీంతో ఈ విషయం మహేష్ బాబు వద్దకు వెళ్ళింది. ఈ క్రమంలో తనకు కేటీఆర్ అత్యంత సన్నిహితుడు కావడంతో తన బావ సమస్యను చెప్పాడు. తర్వాత ఒకరోజు ముగ్గురు కలిసి ఒక ప్రైవేటు మీటింగ్ లో మాట్లాడుకున్నారు. ఈలోపు ఇందిరా దేవి మరణం, కృష్ణ మరణం విషాద ఘటనలు జరగడంతో అమర రాజా తెలంగాణకు రావడం లో కొంచెం బ్రేక్ పడింది. కృష్ణ దశమకర్మ తర్వాత కర్మాగారం ఏర్పాటుకు శుక్రవారం బీజం పడింది.

మరి కొన్ని కంపెనీలు అదే బాటలో
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సుడి బాగున్నట్టు కనిపించడం లేదు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు మూసుకుపోతున్నాయి. పరిశ్రమలు ప్రభుత్వ వేధింపుల వల్ల వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ప్రభుత్వానికి పారిశ్రామిక విధానంపై ఒక అవగాహన లేకపోవడంతో అది తెలంగాణ రాష్ట్రానికి లాభం చేకూర్చుతోంది. జగన్ ప్రభుత్వం వదులుకున్న లక్షల కోట్ల ప్రాజెక్టుల్లో సింహభాగం తెలంగాణ రాష్ట్రం దక్కించుకుంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్ళు సాధిస్తోంది అంటే దానికి కారణం విస్తారంగా ఏర్పాటైన కర్మగారాలే. ప్రభుత్వపరంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కువగా లేనప్పటికీ… యువతకు ఆ కర్మాగారాలే ఉపాధి చూపిస్తున్నాయి.. తాజాగా ఏర్పాటైన అమరరాజా బ్యాటరీస్ లోనూ వేలాది మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి రెండు విషాదాల తర్వాత మహేష్ కుటుంబంలో ఆనందం వెల్లి విరుస్తోంది. అది కూడా తన స్వరాష్ట్రం నుంచి తెలంగాణలో అమరరాజా బ్యాటరీస్ ఏర్పాటు ద్వారా.. ఇంత జరుగుతున్నప్పటికీ ఆ బటన్ ముఖ్యమంత్రి ఒక మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.