Telangana BJP: తెలంగాణలో పొలిటికల్ హీట్ పతాక స్థాయికి చేరుకుంది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తుండడంతో అసంతృప్తులు, అలకలు పెరుగుతున్నాయి. టికెట్ దక్కని వారు పక్క చూపులు చూస్తున్నారు. మరికొందరు అదును చూసి పక్క పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. అన్ని పార్టీలకు రెబల్స్ బెడద ఉంది. తాజాగా భారతీయ జనతా పార్టీని చాలామంది నేతలు వీడుతున్నారు. మరికొందరు షాక్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. తాజాగా పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని నియోజకవర్గాలను కేటాయించాల్సి ఉంది. అటువంటి చోట ఆశావహులు పునరాలోచనలో పడుతున్నారు. పక్క పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో బీజేపీ హై కమాండ్ కలవర పడుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఒకానొక దశలో అధికారంలోకి వచ్చేటంత పరిస్థితి తెచ్చుకుంది. కానీ బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి మార్చడంతో ఒక్కసారిగా సీన్ మారింది. కనీసం రెండో స్థానంలో నిలుస్తుందా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది. బలమైన శక్తిగా ఉన్న బిఆర్ఎస్ను, వేగంగా పుంజుకుంటున్న కాంగ్రెస్ ను ఢీ కొట్టాలంటే జనసేన అవసరం బిజెపికి అనివార్యంగా మారింది. దీంతో బీజేపీకి మద్దతు తెలపాలని కోరుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలిశారు. అయితే మద్దతు కంటే పొత్తుకు ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే జనసేన 33 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అవన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంత నియోజకవర్గాలే. ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించింది. పొత్తు కుదిరితే ఆయా నియోజకవర్గాల కోసం పట్టు పట్టే అవకాశం ఉంది. అదే జరిగితే అక్కడ తమ పరిస్థితి ఏమిటని బిజెపి ఆశావాహులు భయపడుతున్నారు.
ప్రస్తుతం జనసేన ఏపీకే పరిమితమైంది. అక్కడే బలమైన ఉనికిని చాటుకుంటూ వస్తోంది. అయితే యువతలో పవన్ కళ్యాణ్ అభిమానులు అధికం. ఎన్నికల్లో యువతను టార్గెట్ చేయాలంటే జనసేన అవసరం. అందుకే జనసేనతో పొత్తు పెట్టుకోవాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది. ఈ పొత్తు చర్చలు విజయవంతం అయితే సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుందోనన్న చర్చ తెరపైకి వస్తోంది. ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలపై జనసేన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అయితే ఇక్కడ కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను బిజెపి ప్రకటించింది. కుత్బుల్లాపురం అభ్యర్థిగా కూన శ్రీశైలం ను ఖరారు చేసింది. కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, మేడ్చల్ స్థానాలను పెండింగ్లో పెట్టింది. ఇందులో కూకట్పల్లి, మల్కాజ్గిరి స్థానాలను జనసేన పొట్టుబట్టే అవకాశం ఉంది. ప్రధానంగా కూకట్పల్లి టిక్కెట్ను జనసేన రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ కేటాయించాలని పవన్ కోరినట్లు సమాచారం. అదే జరిగితే పార్టీని వీడుతానని బిజెపి జిల్లా అధ్యక్షుడు పొన్నాల హరీష్ రెడ్డి సంకేతాలు ఇస్తున్నారు.
అలాగే మల్కాజ్గిరి సీటును మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, జాతీయ కోశాధికారి పీఎం సాయిప్రసాద్లో ఆశిస్తున్నారు. అయితే మల్కాజ్గిరి తమకు కేటాయించాలని జనసేన బలంగా కోరుతోంది. దీంతో బీజేపీ జనసేనల మధ్య పొత్తు ఎవరి సీట్లకు ఎసరు పెడుతుందోనన్న ఆందోళన ఆశావహుల్లో బలంగా ఉంది. జనసేనతో పొత్తు తమ చావుకు వచ్చిందని నేతలు నిట్టూరుస్తున్నారు. కొందరైతే పక్క పార్టీల్లో కర్చీఫ్ వేస్తున్నారు. అయితే పొత్తు ప్రాథమిక దశలోనే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని బిజెపి నాయకత్వం చెబుతోంది. జనసేనతో పొత్తు కుదిరితే టిక్కెట్లు దక్కని చాలామంది బిజెపి నాయకులు తమ దారి తాము చూసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.