Homeఆంధ్రప్రదేశ్‌TDP Tickets : వారిందరికీ టిక్కెట్లు డౌటే.. షాకిచ్చేందుకు టీడీపీ రెడీ

TDP Tickets : వారిందరికీ టిక్కెట్లు డౌటే.. షాకిచ్చేందుకు టీడీపీ రెడీ

TDP Tickets : వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు చావో రేవోగా పరిణమించాయి. అధికార పార్టీని ఎలా ఢీకొట్టాలో అని అన్నిరకాల దారులు వెతుక్కుంటున్నారు. చివరకు పవన్ కళ్యాణ్ ను దారిలో తెచ్చుకున్నా.. బీజేపీ విషయంలో మాత్రం వర్కవుట్ కాలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తునే ఉన్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో గట్టి పోరాటం చేయాలని ఆయన తెలుగు తమ్ముళ్లను కోరుతున్నారు. అయితే అధికార పక్షంతో తలపడకుండా టీడీపీ నాయకులు తమలో తామే కలహించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు తమకంటే తమకు అంటూ వీధి పోరాటాలకు దిగుతున్నారు. తమకు టిక్కెట్ రాకుంటే ప్రత్యర్థితో చేతులు కలిపి చావుదెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అందుకే ఇటువంటి వారి విషయంలో గట్టి నిర్ణయాలు తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధపడుతున్నారు. వ్యూహకర్త రాబిన్ శర్మ ఒక నివేదిక ఇవ్వడంతో చంద్రబాబు నేతలకు గట్టి హెచ్చరిక పంపారు. ఇటువంటి నాయకులకు టిక్కెట్లు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు.

ఇప్పటికే చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 166 నియోజకవర్గల రివ్యూలను పూర్తిచేశారు. కానీ ఎక్కడా టిక్కెట్లు కన్ఫర్మ్ చేయలేదు. పరిస్థితి బాగుంటే బాగుంది అని చెబుతున్నారు. లేకుంటే మెరుగుపరచుకోవాలని సూచిస్తున్నారు. వివాదాలు లేని, ప్రత్యమ్నాయ నాయకత్వం లేని నియోజకవర్గాల్లో మాత్రం పనిచేసుకోవాలని భుజం తడుతున్నారు. అయితే ఉత్తరాంధ్రలో జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆయనకు మింగుడు పడడం లేదు. విపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా కొందరు నేతలు నోరు అదుపు చేసుకోవడం లేదు. ఎన్నికల వ్యూహంలో భాగంగా గంటా శ్రీనివాసరావు విషయంలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఒక ఆలోచనకు వచ్చారు. దీనిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గరంగరం అయ్యారు. ఇన్నాళ్లు బొక్కలో ఉన్నవారు బయటకు వస్తున్నారని.. ఎవడండీ ఈ గంటా..ఆయనేమైనా ప్రధానా అంటూ కామెంట్స్ చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తుంది.. నేను హోంమంత్రిని అవుతా?.. అప్పుడు తన తడాఖా ఏంటో చూపిస్తా అంటూ అయ్యన్న కామెంట్స్ చేయడం జనాలకు తప్పుడు సంకేతం వెళుతుందని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఏదైనా లోపాలు ఉంటే అంతర్గతంగా వచ్చి మాట్లాడే అవకాశం ఉన్నా.. బహిరంగ వ్యాఖ్యానాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడుతున్నారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావు వర్గాలుగా విడిపోయారు. ఒకరినొకరు నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తమ సొంత ముద్ర కోసం పరితపిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో తమ సొంత నేతలకు టిక్కెట్లకు భరోసా ఇస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ పనిచేస్తున్న నేతల్లో నిరాశ, నిర్లిప్తత చోటుచేసుకుంటోంది. మరోవైపు జనసేనకు పొత్తుల్లో ఏ నియోజకవర్గాలు కేటాయిస్తారో స్పష్టత లేదు. అందుకే ఎందుకొచ్చింది గొడవ అంటూ కొంతమంది ఇన్ చార్జిలు పెద్దగా పనిచేసేందుకు ఇష్టపడడం లేదు. రాజాంలో ఇన్ చార్జిగా కోండ్రు మురళీమోహన్ ఉన్నారు. ఆయనంటే కళాకు గిట్టదు. అందుకే తొడగొట్టి ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మను ఎగదోశారు. ఇప్పుడు ఆమె టిక్కెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అటు అచ్చెన్నాయుడు సైతం ఎచ్చెర్లలో కళాను చెక్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. జడ్పీ మాజీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడును రంగంలోకి దించారు. వారిద్దరూ కళాకు కొరకరాని కొయ్యగా మారారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి వ్యతిరేకంగా గొండు శంకర్ ను, పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తికి పోటీగా మామిడి గోవిందరావును తెరపైకి తేవడం వెనుక అచ్చెన్నాయుడు ఉన్నారన్న టాక్ నడుస్తోంది. ఇలా ఉమ్మడి జిల్లాలో అచ్చెన్నాయుడు, కళా శిబిరాలు పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి.

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తానని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ అచ్చెన్నాయుడు చంద్రబాబు ద్వారా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో సైతం అశోక్ గజపతిరాజు, సుజయ్ కృష్ణరంగారావు వ్యూహాత్మకంగా మౌనం పాటి్ంచారు. అక్కడి సైతం అచ్చెన్నాయుడు, కళా వెంకటరావులు ఎంటరై లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతున్నట్టు చంద్రబాబుకు ఫిర్యాదులు అందుతున్నాయి. మరోవైపు రాబిన్ శర్మ సైతం ఇదే నివేదికలు ఇచ్చారు. దీంతో చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగారు. టిక్కెట్ల కేటాయింపులో లోకల్ నాయకత్వాలకు ప్రాధన్యత ఇవ్వబోమని తేల్చేశారు. నివేదికల ఆధారంగా టిక్కెట్లు కేటాయిస్తామని చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీకి బలంపెరిగినా నాయకుల వ్యవహార శైలి నష్టం తెస్తోందని చంద్రబాబు బాధపడుతున్నారు. అందుకే కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular