Telangana Congress: ఆ పార్టీలో అందరూ సీఎం అభ్యర్థులే

తెలంగాణ రాష్ట్రంలో గత పది ఏళ్ళుగా భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. సహజంగానే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది.

Written By: Bhaskar, Updated On : October 14, 2023 10:23 am

Telangana Congress

Follow us on

Telangana Congress: ఆ పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. దేశ స్వాతంత్ర పోరాటంలో కీలకపాత్ర పోషించింది. దేశ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాల్లో ఆ పార్టీ భాగస్వామ్యం ఉంది. అక్కడిదాకా ఎందుకు దశాబ్దాల కలగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్లే సాకారం అయింది.. అంతటి పార్టీ, ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ.. గత దశాబ్ద కాలంగా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉంది. అధికారంతోపాటు కీలకమైన ప్రతిపక్ష బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తించలేకపోయింది. గెలిచిన ఎమ్మెల్యేలలో మెజారిటీ ప్రజాప్రతినిధులు భారత రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఉన్నవారిలో ఎవరు కేసీఆర్ కోవర్టులో, ఎవరు పార్టీకి వీర విధేయులో తెలియని పరిస్థితి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో సానుకూల పవనాలు వీస్తున్నప్పటికీ వాటిని తన వైపు పూర్తిగా మలచుకోలేని పరిస్థితి ఆ పార్టీది. ఇప్పటికీ అభ్యర్థులు ప్రకటన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి రాలేదు. సీడబ్ల్యూసీ సమావేషాల పేరుతో కాలయాపన చేస్తోంది. ఓ వైపు భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు ప్రకటించి, బీ ఫారాలు కూడా అందించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో గత పది ఏళ్ళుగా భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. సహజంగానే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు సామంత రాజులుగా వ్యవహరిస్తుండటంతో సహజంగానే ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ప్రభుత్వ పథకాల్లో కూడా గులాబీ కార్యకర్తలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుండడంతో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. పైగా అవినీతి అనేది తారస్థాయికి చేరడంతో జనాలు మార్పును కోరుకుంటున్నారు. అధికారులు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వత్తాసు పలుకుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజల అభిమానాన్ని చూరగొనడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విఫలమవుతున్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండడంతో నేతలు ఇష్టాను సారంగా మాట్లాడుతున్నారు. టికెట్ల కేటాయింపు విషయంలోనూ బెట్టు వీడటం లేదు. పైగా ఉదయపూర్ తీర్మానానికి వ్యతిరేకంగా నేతలు మంకుపట్లు పడుతున్నారు. తమతో పాటు కుటుంబ సభ్యులకు కూడా టికెట్లు ఇవ్వాలని నేతలు కోరుతుండడం అధిష్టానానికి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది.

పైగా సీనియర్ నాయకులంతా ఎవరికివారు తమకు తామే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికలే కాలేదు, అధికారమే దక్కలేదు..కానీ ముఖ్యమంత్రి పీఠం మీద ఖర్చీప్ లు వేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులకే చెల్లింది. 10 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రజల్లో కొంత సానుకూల వాతావరణం వ్యక్తమవుతున్న నేపథ్యంలో దానిని ఓటు బ్యాంకుగా మలచునే సోయి లేకుండా నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడం కాంగ్రెస్ పార్టీని ఎన్నికల ముంగిట దెబ్బతీస్తున్నది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సభలో సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలసికట్టుగా ఉండాలని హిత బోధ చేశారు. అధికారం దక్కేమంగిట తలతిక్క వేషాలు వేయద్దని వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ నేతలు తమ తీరు మార్చుకోవడం లేదు. అంతేకాదు తమకు తామే సీఎం అభ్యర్థులమని ప్రకటించుకుంటున్నారు. ఇది అంతిమంగా భారత రాష్ట్ర సమితికి లాభం చేకూర్చుతోంది.. కాంగ్రెస్ నేతల తీరువల్ల భారత రాష్ట్ర సమితిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కొంత కొంత తగ్గుతున్నది. మరి దీనిని కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా సెట్ రైట్ చేస్తుందో చూడాల్సి ఉంది.