https://oktelugu.com/

BRS Manifesto 2023: హ్యాట్రిక్ పై బీఆర్ఎస్ గురి..ఎన్నికల మేనిఫెస్టో లో వరాలే వరాలు.. వర్కవుట్ అవుతుందా?

సంక్షేమ పథకాలను ఉచితాలు అంటే ఒప్పుకోనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పేదలను ఆదుకునేందుకు ప్రత్యేక పథకాలు కావాలన్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : October 14, 2023 / 10:13 AM IST

    BRS Manifesto 2023

    Follow us on

    BRS Manifesto 2023: అత్యంత కీలకమైన ఎన్నికలకు వరాల మూటలాంటి మేనిఫెస్టోతో అధికార బీఆర్‌ఎస్‌ ప్రజల ముందుకురానుంది. అందులో అన్ని వర్గాలకూ చోటు కల్పించనుంది. ఈ మేరకు ఆదివారం (ఈ నెల 15) మేనిఫెస్టోను విడుదల చేయనుంది. అది చాలా ఆసక్తికరంగా ఉండబోతోందని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. రైతుబంధును పెంపు, దళితబంధు మరింత ముందుకు, మహిళలకు వరాలు, బీసీలు, మైనారిటీ, మధ్య తరగతి వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామని భారత రాష్ట్ర సమితి వర్గాలు చెబుతున్నాయి.

    శుక్రవారం మీడియాతో భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మేనిఫెస్టోకు సంబంధించి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మేనిఫెస్టోకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. “మహిళలకు ద్వితీయ ప్రాధాన్యం ఇస్తాం.. వారి గురించి ప్రత్యేక కార్యాచరణ ఉంది. వ్యవసాయ రంగం, రైతులను మరింత బలోపేతం చేసే దిశగా మేనిఫెస్టోలో పెద్దపీట వేస్తున్నాం. మధ్య తరగతి కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాం. సీనియర్‌ సిటిజన్లకు భద్రత కల్పించేలా మేనిఫెస్టో ఉంటుంది. ఈ వర్గాలతో పాటు జర్నలిస్టులకూ పింఛన్‌ అందించడంపైనా ఆలోచన చేస్తున్నాం. ఇలా మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు స్థానం కల్పిస్తాం’’ అని కేటీఆర్‌ వివరించారు. మేనిఫెస్టోకు సంబంధించి అన్ని లెక్కలు వేసుకుంటున్నామని, ఇతర పార్టీలు అధికారంలోకి రాలేవు కాబట్టే ఏదో ఒకటి చెబుతున్నాయని పేర్కొన్నారు. సాధ్యాసాధ్యాలను చూసే పథకాలను ప్రకటించబోతున్నామని, సంక్షోభం వచ్చినా సంక్షేమం ఆగకూడదన్న లక్ష్యంగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.

    మేనిఫెస్టోపై చెప్పాల్సింది ఈసీ కాదు

    సంక్షేమ పథకాలను ఉచితాలు అంటే ఒప్పుకోనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పేదలను ఆదుకునేందుకు ప్రత్యేక పథకాలు కావాలన్నారు. సంక్షేమ పథకాలను ఉచితాలన్న మోదీవి మూర్ఖపు మాటలుగా అభివర్ణించారు. ‘కార్పొరేట్లకు రూ.12.5 లక్షల కోట్లు మాఫీ చేయొచ్చు. రైతులకు అందించే విద్యుత్తు ఉచితం ఎందుకు అవుతుంది. ఎన్నికల నిర్వహణే ఎన్నికల సంఘం (ఈసీ) విధి. మేనిఫెస్టోలో ఏమి ఉండాలో చెప్పాల్సింది వారు కాదు. దానిని పార్టీలు చూసుకుంటాయి. రాష్ట్ర బడ్జెట్‌ సాధ్యాసాధ్యాలు ఆర్థికవేత్తలు చెబుతారు. ఈసీ కాదు. కాబట్టి వారి పని వారు చేసుకోవాలి. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, పార్లమెంటు ఎవరూ కూడా మేనిఫెస్టోల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు., కేవలం చర్చ మాత్రమే జరిగింది’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ వంద వరకు సభల్లో పాల్గొంటారని కేటీఆర్‌ చెప్పారు. ప్రస్తుత షెడ్యూల్‌ ప్రకారం సీఎం సభలు 41 వరకు ఖరారయ్యాయని, ప్రచారం పూర్తయ్యేనాటికి దాదాపు 100 సభలకు హాజరవుతారని తెలిపారు. జీహెచ్‌ఎంసీతో పాటు కామారెడ్డి జిల్లా బాధ్యతలను తాను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోసం పార్టీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా సిద్ధమవుతోందని కేటీఆర్‌ చెప్పారు.

    కాగా, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు వరాల పై పెదవి విరిస్తున్న భారత రాష్ట్ర సమితి వర్గాలు.. తాము మాత్రం ఇష్టానుసారంగా పథకాలు ప్రకటించడం పట్ల రాజకీయ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.” తెలంగాణ మీద కేవలం బీఆర్ఎస్ కు మాత్రమే పేటెంట్ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అది సరయింది కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. అధికారంలోకి వచ్చేందుకు దాని ప్రయత్నాలు ఏదో చేస్తున్నది. దానిని గుర్తించకుండా అధికార భారత రాష్ట్ర సమితి ఇష్టానుసారంగా విమర్శలు చేస్తోంది.. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది కాబట్టే అడ్డగోలుగా వరాలు ప్రకటిస్తోంది.. కానీ ఇవి అంతగా వర్క్ అవుట్ కావని” రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.