Alcohol Prohibition In AP: ఏపీలో అన్ని పార్టీలు యాక్టివ్ అయ్యాయి. తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై అధికార పక్షం, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక పాలనపై విపక్షాలు ఫోకస్ పెంచాయి. పరస్పర ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని హీటెక్కిస్తున్నాయి. ఏ చిన్న అంశాన్ని వదలడం లేదు. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ ప్రకటనలు ఇప్పుడు ప్రజల్లోకి బలంగా దూసుకెళుతున్నాయి. సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబుకు ఉన్నంతగా పవన్ కు మీడియా సపోర్టు లేదు. వారిద్దరి పల్లకి మోసే మీడియా సంస్థలు తెలుగునాట ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. అందుకే పవన్ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సెటైరికల్ డోసు పెంచారు. మాటల కంటే చేతల ద్వారానే వైసీపీ పెద్దలకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని నేరుగా ప్రభుత్వ పెద్దలకే సవాల్ విసురుతున్నారు.

రహదారుల సమస్యపై…
ముఖ్యంగా జగన్ సర్కారుకు కార్టూన్ల రూపంలో గట్టిగానే బదులిస్తున్నారు. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల సమస్యను గట్టిగానే ప్రశ్నించారు. ప్రజల మధ్యకు సమస్యను తీసుకెళ్లారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడంలో సఫలీకృతులయ్యారు. ఇందుకుగాను సెటైరికల్ కార్డున్లు జోడించి సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు. దీనిని జన సైనికులు తెగ ట్రోల్ చేశారు. ప్రజల ఆలోచన సరళిలో మార్పు వచ్చేలా ప్రయత్నించారు. ఇప్పుడు మద్యం ధరలు పెంపు, బార్లు తెరవడం, మద్య నిషేధాన్ని వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కడాన్ని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా తనపై ఒంటి కాలితో లేచే పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు గట్టి కౌంటర్ ఇచ్చి నోరు మూయించారు. కార్నర్ చేసి అటు ప్రజల్లో ఇటు సొంత పార్టీల్లో చులకనయ్యేలా చేశారు. దీంతో జన సైనికులు తెగ సంతోషపడుతున్నారు.
మాట తప్పిన వైసీపీ సర్కారు..

నవతర్నాల్లో భాగంగా వైసీపీ తన మేనిఫెస్టోలో సంపూర్ణ మద్య నిషేధం అమలుచేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏడాదికి 25 శాతం నిషేధం అమలుచేసి.. నాలుగేళ్లలో సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులేస్తామని ప్రకటించారు. కానీ షాపుల తగ్గింపు అనేది తొలి ఏడాదికే పరిమితమైంది. తరువాత ఆ మాటే మరిచిపోయారు. దీనికితోడు ఎక్కడికక్కడే ప్రైవేటు బార్లు తెరిచారు. తిరిగి ప్రైవేటు విధానంలో మద్యం విక్రయించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు, మునిసిపాల్టీలు, నగర పంచాయతీల్లో బార్లు ఏర్పాటు చేసేందుకు వేలం వేశారు. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రభుత్వంపై వకల్తా పుచ్చుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ మద్య నిషేధంపై మడత పేచీ వేసి మాట్లాడారు. తాము అసలు మేనిఫెస్టోలో మద్య నిషేధం అన్నది చేర్చలేదని తేల్చిచెప్పారు. కేవలం మద్యం ధరలు పెంచి మందుబాబులకు మద్యం నుంచి దూరం చేస్తామని మాత్రమే చెప్పామని ప్రకటించారు. అంతటితో ఆగకుండా తాము మద్య నిషేధాన్ని మెనిఫెస్టోలో పెట్టినట్టు చూపాలని సవాల్ విసిరారు. దీంతో విపక్షాలు భగ్గుమన్నాయి. సోషల్ మీడియాలో సైతం విమర్శలు వ్యక్తమయ్యాయి. నెటిజెన్లు అమర్నాథ్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మేనిఫెస్టోను సైతం పోస్టు చేశారు. మూడు దశాల్లో మద్యం నిషేధిస్తామన్న హామీని హైలెట్ చేసి ట్రోల్ చేశారు. దీంతో అమర్నాథ్ అడ్డంగా బుక్కయ్యారు. లేనిపోని వివాదాలను తెచ్చిన ఆయనపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. గట్టి క్లాసే తీసుకున్నట్టు తెలుస్తోంది.
అడ్డంగా బుక్కయిన అమర్నాథ్..
అయితే అయినదానికి కానిదానికి జనసేనాని, జనసైనికులపై అంత ఎత్తున నిలిచే అమర్నాథ్ ను పవన్ కల్యాణ్ కార్నర్ చేశారు. సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. సెటైరికల్ పోస్టుతో దిమ్మదిరిగేలా చేశారు. దానికి కార్డూన్ జోడించారు. ‘తాగడానికి.. తాగొద్దనడానికి మనమెవరం? అంతా వాడి ఇష్టం’ అన్న క్యాప్షన్ తో పోస్టు చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. క్షణాల్లో వైరల్ అయ్యింది. జనసైనికులు, అభిమానులు పోస్టుకు లైకులు, షేర్లు చేసి మరింత విస్తరింపజేశారు. దీంతో మద్యం విషయంలో ప్రభుత్వ చర్యలు విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే జనవాణి, గుడ్ మార్నింగ్ సీఎం కార్యక్రమాలతో పవన్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కార్డూన్లతో సెటైరికల్ క్యాప్షన్లతో దీటుగానే బదులిస్తున్నారు.