MIM Akbaruddin: చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే.. ఎంఐఎం ప్రస్తుత శాసన సభా పక్షనేత, తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ 2012లో నిర్మల్, నిజామాబాద్‌లో హిందువులపై చేసిన విద్వేశ పూరిత వ్యాఖ్యల కేసులో నాంపల్లి సెషన్స్ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. తీర్పు సందర్భంగా న్యాయమూర్తి తెలంగాణ పోలీసులపై చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కేసు వీగిపోవడంతో పదేళ్లయినా అక్బర్ ప్రసంగం ఆయనదే అని నిరూపించలేకపోయారా?.. నిరూపించకుండా ఎవరైనా చేశారా అని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ముఖ్య నేత, చంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి భారీ ఊరట లభించింది. విద్వేష వ్యాఖ్యల కేసుల్లో ఆయనను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఒవైసీపై దాఖలైన కేసులను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. 2012 డిసెంబర్‌లో హిందువులను ఉద్దేశించి అక్బర్ తీవ్ర వ్యాఖ్యలుచేశారు. నిజామాబాద్, నిర్మల్‌లో చేసిన వ్యాఖ్యలపై ఒక వర్గం తీవ్రంగా స్పందించింది. ఆయన పై కేసులు నమోదయ్యాయి. అక్బరుద్దీన్ పై రెండు కేసులనూ నాంపల్లి సెషన్స్ కోర్టు బుధవారం నాడు కొట్టివేసింది.
అక్బరుద్దీన్ ఒవైసీ విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు పోలీసులు ఆధారాలు చూపించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుల్లో నిర్దోషిగా తేలినంత మాత్రాన సంబురాలు చేసుకోరాదని, భవిష్యత్తులో వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని అక్బరుద్దీన్ ను హెచ్చరించింది. దేశ సార్వభౌమత్వం దృష్ట్యా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని న్యాయస్థానం మందలించింది.
-అసలేం జరిగింది..
2012, డిసెంబర్ 8న నిజామాబాద్‌లో, అదే నెల 22న నిర్మల్‌లో హిందువులను ఉద్దేశించి విద్వేషపూరిత ప్రసంగం చేశారని అక్బరుద్దీ¯Œ పై కేసు నమోదైంది. దీనిపై 2013, జనవరి 2న నిర్మల్, నిజామాబాద్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జనవరి 8న అక్బర్‌ను అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు తరలించారు. జనవరి 9న అక్బర్‌ను నిర్మల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు 40 రోజుల పాటు అక్బరుద్దీన్ జైల్లోనే ఉన్నారు. ఫిబ్రవరి 16న బెయిల్‌పై విడుదలయ్యారు.
-అసలేం జరుగుతోంది?
ఇదే అంశానికి సంబంధించి అక్బరుద్దీ¯Œ పై నిజామాబాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం పీఎస్, ఢిల్లీ పీఎస్‌లలో నమోదైన కేసులను 2013 జనవరి 1న అప్పటి ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. నిర్మల్ కేసును మాత్రం స్థానిక పోలీసులే దర్యాప్తు చేశారు. విచారణలో భాగంగా నిజామాబాద్ కేసులో 41 మందిని, నిర్మల్ కేసుకు సంబంధించి 33 మంది సాక్షులను పోలీసులు విచారించారు.
-నాలుగేళ్లకు చార్జిషీట్..
2012లో నిజామాద్, నిర్మల్‌లో అక్బరుద్దీన్ చేసిన విద్వేషపూర్తి వ్యాఖ్యలపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయడానికి నాలుగేళ్లు పట్టింది. 2016లో సీఐడీ, నిర్మల్ పోలీసులు చార్జిషీట్లు దాఖలు చేశారు. చార్జ్‌షీట్‌లో ఏ–1గా అక్బరుద్దీన్, ఏ–2గా యాయాఖా¯Œ ను చేర్చారు.
-ఆ వ్యాఖ్యలు అక్బరుద్దీన్‌వే అని తేల్చిన సీఎఫ్‌ఎస్‌ఎల్..
అక్బరుద్దీన్ విద్వేషపూరితంగా మాట్లాడినట్లు తెలిపే వీడియో ఫుటేజ్‌ను కోర్టు ఆదేశాలతో సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. సుదీర్ఘ పరిశీలన తర్వాత ఆ వ్యాఖ్యలు అక్బరుద్దీన్ చేసినవే అని సీఎఫ్‌ఎస్‌ఎల్ కూడా నివేదిక ఇచ్చింది. అక్బరుద్దీన్ ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని ఎక్కడా ప్రకటించలేదు. అసదుద్దీన్ కూడా తన సోదరుడి విద్వేస పూరిత వ్యాఖ్యలను కూడా ఖండించలేదు. వందలాది ఆధారాలు.. వీడియోలు కూడా ఉన్నాయి. ఇంతకన్నా ఇంకా ఏ ఆధారం అవసరంం లేదని ఈ కేసులో అక్బరుద్దీన్‌కు శిక్ష తప్పక పడుతుందని ఆశించారు. మంగళవారమే తీర్పు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అక్బర్ దోషిగా నిర్ధారణ అయినందునే బుధవారానికి కోర్టు వాయిదా వేసినట్లు భావించారు. కానీ బుధవారం న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. తెలంగాణ పోలీసులు సరైన ఆధారాలు సమర్పించలేక పోయారని కోర్టు అభిప్రాయపడింది.
-పోలీసులు నిజంగా విఫలమయ్యారా?
అక్బరుద్దీన్ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలను నిరూపించడంలో తెలంగాణ పోలీసులు నిజంగా విఫలమయ్యారా అన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్న సమయంలోనే అక్బరుద్దీన్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను నాడు అందరూ తీవ్రంగా ఖండించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంతో ధైర్యంగా కేసు కూడా నమోదు చేయించారు. అయితే ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడంతో కోర్టులో చార్జిషీట్ వేయడానికి పోలీసులు నాలుగేళ్లు సమయం తీసుకున్నారు. అయితే ఇంత సమయం తీసుకున్నా.. సరైన సాక్షాధారాలు ఎందుకు చూపలేకపోయారి బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక ఎవరైనా ఉన్నారా… కావాలనే ఆధారాలను పోలీసులు దాచి దోషిని తప్పించే ప్రయత్నం చేసి ఉంటారని అభిప్రాయ పడుతున్నారు.