Air India Express: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో అగ్నిప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి కొచ్చికి బయల్దేరిన విమానం శనివారం రాత్రి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు పైలెట్ గుర్తించారు. ఈ సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్‌కావడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. కొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి.
టేకాఫ్ అయిన కొద్ది సేపటికే..
బెంగళూరు విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సిబ్బంది ఇంజిన్‌లో మంటలను గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఎయిర్ పోర్టులో అత్యవసర ఏర్పాట్లు చేశారు. రాత్రి 11:12 గంటల సమయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. మంటను చూసిన ప్రయాణికులు ఆందోళన చెందారు. ఎలాంటి ప్రమాదం లేదని సిబ్బంది ప్రయాణికులకు చెబుతూనే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. రన్‌వేపై క్రాష్ ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులు ఓపెన్ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. అయితే ఎవరికీ ఏమీ జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఫైరింజన్లు, అంబులెన్స్‌లు రెడీ…
విమానం ఇంజిన్‌లో మంటలు వచ్చినట్లు తెలియగానే ఎయిర్ పోర్టు సిబ్బంది ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేశారు. ఫైరింజన్లు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. విమానం ఆగిన వెంటనే మంటలు ఆర్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ప్రయాణికులను రన్‌వే నుంచి ఎయిర్‌పోర్టు లోపలికి తరలించారు.
విచారం వ్యక్తం చేసిన ఎయిర్ ఇండియా…
ఇదిలా ఉండగా విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విచారం వ్యక్తం చేసింది. నియంత్రణ సంస్థలతో కలిసి దర్యాప్తు చేస్తామని ప్రకటించింది. మంటలకు కారణాలు తెలుసుకుంటామని వెల్లడించింది. ఇదిలా ఉండగా, శుక్రవాం ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరిన విమానం ఏసీలో మంటలు వచ్చాయి. దీంతో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. మరుసటి రోజే బెంగళూరు విమానం ఇంజిన్‌లో మంటలు వచ్చాయి.