Air India Sale: అసలే కరోనా కాలం.. చేతిలో చిల్లి గవ్వ లేదు.. రూపాయి రూపాయికి అప్పొసొప్పో చేసి బతుకీడుస్తున్నా కాలం.. ప్రభుత్వాలకైనా.. సామాన్యుల కైనా ఇదే పరిస్థితి. కరోనా కల్లోలం మొత్తం షేక్ అయిన మోడీ సర్కార్ కూడా ఇందుకు మినహాయింపు కాదు.. అందుకే ప్రభుత్వ రంగ సంస్థలను పప్పు బెల్లంలా అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటుంది.. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా వదిలించుకుంటోంది..

ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోంది. ఇందులో భాగంగా ఎయిరిండియాను సైతం అమ్మేసింది. దీంతో టాటా సన్స్ సంస్థ ఎయిరిండియాను సొంతం చేసుకుంది. ఇకపై దాని ఆధీనంలోనే సంస్థ కొనసాగనుంది. ఈమేరకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థలను కాపాడే బదులు ప్రైవేటీకరణ చేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికే విశాఖలోని ఉక్క కార్మాగారాన్ని సైతం ప్రైవేకరించేందుకు పావులు కదుపుతున్న కేంద్రం పలు సంస్థలను విక్రయించాలని భావిస్తోంది. దీంతో ప్రజాగ్రహం పెల్లుబికుతున్నా పట్టించుకోవడం లేదు. జీవితబీమా సంస్థను సైతం ప్రైవేటు పరం చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో కేంద్రం నిర్ణయాలను తప్పుబడుతున్నా తమకేమి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది.
ఈమేరకు కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఏం-దీపమ్) కార్యదర్శి తుమిన్ కాంత పాండే శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు. టాటా బిడ్స్ దాఖలు చేసిన బిడ్ అన్నింటికంటే ఆకర్షణీయంగా ఉండడంతో ఎయిరిండియాను దానికి కట్టబెడుతున్నట్లు చెప్పింది. 68 ఏళ్ల తరువాత ఎయిరిండియా తిరిగి టాటా చేతుల్లోకి వెళుతోంది.
1932లో టాటా ఎయిర్ లైన్స్ పేరుతో విమానయాన సంస్థను ప్రారంభించింది టాటానే. 1953లో జాతీయీకరణలో భాగంగా ప్రభుత్వం సొంతం చేసుకుంది. 1977 వరకు టాటాయే సంస్థను నడిపించింది. తిరిగి మళ్లీ దాని చేతుల్లోకే వెళ్లడం గమనార్హం. దీంతో ఎయిరిండియా యజమాని టాటా సన్స్ కానుంది. ప్రభుత్వ రంగ సంస్థల మనుగడ ప్రశ్నార్థకంలో పడుతోంది. నిర్వహణ భారంతో సంస్థలను అమ్ముకుంటూ పోతే ఎలాగని ప్రతిపక్షాలు సైతం గోల చేస్తున్నాయి.