దేశంలో అయిదు స్టేట్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే అందరి దృష్టి పడుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతుతున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీలకు జరిగే ఎన్నికలను మినీ సార్వత్రిక ఎన్నికలుగా పరిగణిస్తున్నాయి. దీంతో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతున్నాయి. ఐదు స్టేట్లలో జాతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లలో బీజేపీ, పంజాబ్ లో కాంగ్రెస్ చక్రం తిప్పుతున్నాయి.
దేశంలో అత్యధిక పార్లమెంట్ సీట్లు కలిగిన ఉత్తరప్రదేశ్ గుండెకాయ వంటిది. ఇక్కడ అధికారం చేజిక్కించుకోవాలని అన్ని పార్టీలు తలపిస్తున్నాయి. అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ఎత్తులు, పైఎత్తులు, వ్యూహరచన దిశగా పావులు కదుపుతున్నాయి. ఏ అవకాశాన్ని వదులుకోవడనికి తయారుగా లేవు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యూపీలో బీజేపీ అధికారంలో ఉంది. యోగీ ఆదిత్యనాథ్ సీఎంగా కొనసాగుతున్నారు. అయితే ఆయనపై అసమ్మతి రాగమేవినిపిస్తోంది. ప్రధాని మోడీ, అమిత్ షా సైతం ఆయన నాయకత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో యూపీలో మార్పు అనివార్యమనే ఉద్దేశంలో కేంద్ర నాయకత్వం ఉందనే విషయం అందరికి తెలిసిందే.
ఇటీవల యోగి ఆదిత్యనాథ్ ను ఢిల్లీకి పిలిపించుకుని తలంటారని వార్తలు వెలువడుతున్నాయి. 2017 ఎన్నికల్లో బీజేపీ312 సీట్లు గెలుచుకుని తిరుగులేని పార్టీగా అవతరించింది. కానీ ప్రస్తుతం బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంపై విశ్వాసం లేకుండా పోతోంది. దీనికి తాజా ఉదాహరణ గతంలో జరిగిన స్థానిక ఎన్నికలే. ఇందులో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ మొదటిస్థానంలోకి దూసుకెళ్లింది. దీంతో జాతీయ పార్టీ నాయకులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.
ఉత్తరప్రదేశ్ ను విడగొట్టి ఉత్తరాఖండ్ రాష్ర్టం 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 2017 ఎన్నికల్లో 70 సీట్లకు గాను కమలం పార్టీ 57, కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకున్నాయి. అంతర్గత కలహాల కారణంగా నాలుగేళ్లలో ముగ్గురు సీఎంలను మార్చారు. గోవాలో తగిన బలం లేకున్నా జిమ్మిక్కులతో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. 2017లో మనోహర్ పారికర్ ఉండగా ప్రస్తుతం ప్రమోద్ సావంత్ సీఎంగా కొనసాగుతున్నారు. 60 సీట్లు గల గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలవగా 13 సీట్లు గెలిచిన బీజేపీ అధికారం చేపట్టింది.
మణిపూర్ అసెంబ్లీలో 60 సీట్లకు గాను బీజేపీ21 సీట్లు సాధించింది. కాంగ్రెస్ 28 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. అయితే బీజేపీ మాయాజాలంతో బిరేన్ సింగ్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. పంజాబ్ లో బీజేపీకి దాదాపు ఉనికే లేదు. గత ఎన్నికల్లో అకాలీదళ్ తో పొత్తు పెట్టకున్నా మూడు సీట్లలోనే విజయం సాధించింది. దీంతో అధికారం అందనంత దూరంలో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసి అధికారం చేజిక్కించుకోవాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.