Homeజాతీయ వార్తలుKCR Promises: ఎన్నికలవేళ.. కారుకు కేసీఆర్ హామీల గేరు

KCR Promises: ఎన్నికలవేళ.. కారుకు కేసీఆర్ హామీల గేరు

KCR Promises: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకుంది. బిజెపి కూడా వేగంగానే అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చిన భారత రాష్ట్ర సమితికి క్షేత్రస్థాయిలో ప్రస్తుతం పరిస్థితి ఒకింత ప్రతి బంధకంగానే ఉంది. ఈ క్రమంలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో గత రెండు పర్యాయాల ఎన్నికల సమయంలో ప్రకటించి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి.. ఈసారి లబ్ధిని మరింత పెంచేలా కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు.. బలమైన కౌంటర్ ఇచ్చే విధంగా కేసీఆర్ మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తారని, ఇప్పుడు అమలవుతున్న పథకాల్లో లబ్ధిని మరికొంత పెంచేలా కసరత్తు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు అందిస్తున్నదానికంటే కొంత అదనంగా కలిపి అందించాలని.. మేనిఫెస్టో కమిటీ నిర్ణయించినట్టు సమాచారం. సీఎం కేసీఆర్‌కు ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ.. మేనిఫెస్టో రూపకల్పన, కొత్త పథకాలు, తదితర అంశాలపై పార్టీలోని పలువురు కీలకవ్యక్తులతో పాటు, తన ఆంతరంగీకులతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో జనంలోకి చొచ్చుకువెళ్లేందుకు ఏయే పథకాలను తీసుకురావాలి? వాటితో ఎంతమేర ఓటర్లను ఆకర్షించవచ్చనే అంశంపై చర్చించారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు ఇస్తున్న సొమ్మును పెంచడంతోపాటు.. ప్రస్తుతం ఆసరా పింఛన్ల కింద అందిస్తున్న ఆర్థిక సాయాన్ని కూడా రూ.1000 మేర పెంచాల్సిందిగా కేసీఆర్‌ సూచించినట్టు తెలుస్తోంది. అలాగే.. కేసీఆర్‌ కిట్లకూ నగదు సాయాన్ని పెంచాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. వీటితో పాటు అందరికీ ఆరోగ్య బీమా కింద రూ.10 లక్షలతో హెల్త్‌కార్డు, మహిళలకు ఆర్థిక సాయంతో పాటు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి పథకం అమలు.. ఇలా పలు నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. వీటన్నిటితో పాటు బీసీ, మైనారిటీలకు ప్రస్తుతం అందించే రూ.లక్ష సాయం పథకంలోనూ పలు మార్పులు చేయాలనే భావనలో ఉన్నట్టు పార్టీలోని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.

15 వేలకు పెంపు..

ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల వెల్లడించిన ‘ఆరు గ్యారెంటీ’ల్లో… రైతు భరోసా కింద ఏడాదికి రూ. 15 వేల ఆర్థికసాయం చెల్లిస్తామని.. కౌలు రైతులకు కూడా ఆ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ కూలీలకు కూడా రూ. 12 వేలు చెల్లిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించడంతో కేసీఆర్‌ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం రైతుబంధు పథకం కిందఎకరానికి ఏడాదికి ఇస్తున్న రూ.10 వేల మొత్తాన్ని రూ. 15 వేలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని ప్రకటించిన కేసీఆర్‌ సర్కారు.. ఎకరానికి, ఒక పంటకు రూ. 4 వేల చొప్పున ఏడాదికి రూ. 8 వేలు చెల్లించింది. 2018- 19 యాసంగి రైతుబంధును నవంబరు నెలలో పోలింగ్‌ సమయంలో ఖాతాల్లో జమచేయటంతో అప్పటి టీఆర్‌ఎస్ కు ఓట్ల పంట పండింది. రైతుబంధు, రైతుబీమా పథకాలతోనే కేసీఆర్‌ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చినట్లు చర్చ జరిగింది. రెండోసారి కేసీఆర్‌ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రైతుబంధు ఆర్థికసాయాన్ని మరో రూ.2 వేలు పెంచారు. ఒక పంటకు ఎకరానికి రూ.5 వేల చొప్పున… ఏడాదికి రూ.10 వేలు పంపిణీ చేస్తున్నారు. గత బడ్జెట్‌(2023- 24)లో ఎకరానికి వేయి పెంచి… ప్రతి పంటకూ ఎకరానికి రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.12 వేలు పంపిణీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ బడ్జెట్‌లో ఆ ఊసెత్తలేదు. తాజాగా ఎన్నికలు సమీపిస్తుండటం, ప్రతిపక్ష పార్టీల మేనిఫెస్టోలు రైతులను లక్ష్యంగా చేసుకొని రూపుదిద్దుకుంటుండటంతో… బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఈ అంశంపై దృష్టిపెట్టింది. ఒక పంటకు ఎకరానికి రూ.7,500 చొప్పున ఏడాదికి రూ.15 వేలు పంపిణీ చేస్తామని మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65-67 లక్షల మంది పట్టాదారులకు ఈ పథకం కింద ఆర్థికసాయం అందించేందుకు ఏడాదికి రూ.15 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తున్నారు. పంట పండించినా, పండించకపోయినా.. వ్యవసాయ భూమిగా రికార్డుల్లో ఉంటే చాలు.. రైతుబంధు నిధులు చెల్లిస్తున్నారు. భూపరిమితిపై కూడా ఎలాంటి ఆంక్షలూ లేకుండా ఎకరానికి రూ.10 వేల చొప్పున నగదు బదిలీ చేస్తున్నారు. ఇప్పుడా ఆర్థికసాయాన్ని మరో 50 శాతం పెంచితే.. బడ్జెట్‌ కూడా 50 శాతం పెరుగుతుంది. అంటే.. 15 వేల కోట్ల కేటాయింపు కాస్తా రూ.22,500 కోట్లకు పెరుగుతుంది.

గతంలో ఉచిత ఎరువుల పథకం

2017 ఏప్రిల్‌ 13న రైతులతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులందరికీ 2018 ఆర్థిక సంవత్సరం నుంచి 24 లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఉచితంగా అందిస్తామన్నారు. కానీ, ఇంతవరకూ రాష్ట్రంలోని ఏ ఒక్క రైతుకూ ఉచిత ఎరువులు అందలేదు. అయితే ఈసారి ప్రకటించే మేనిఫెస్టోలో ఈ అంశాన్నే కీలకంగా ప్రస్తావించనున్నట్టు సమాచారం. ఈ పథకంలో భాగంగా ఎకరానికి 2 బస్తాల చొప్పున యూరియా రైతులకు అందించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.

పింఛన్ పెంచే అవకాశం

ఖమ్మంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సభలో పింఛన్‌ రూ.4వేలు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో దీనిపై స్పందించిన బీఆర్‌ఎస్‌ వెంటనే.. దివ్యాంగులకు ప్రస్తుతం అందిస్తున్న రూ.3,016 పింఛన్‌కు అదనంగా మరో రూ.1000 కలిపి నెలకు రూ.4,116లను పింఛన్‌గా అందిస్తామని ప్రకటించింది. ఇదే క్రమంలో ఆసరా పింఛన్లను కూడా పెంచి ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆసరా పింఛన్ల కింద అందిస్తున్న రూ.2,016కు మరో వెయ్యి జోడించి.. రూ.3,016అందించాలని నిర్ణయించినట్టు సమాచారం. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.1,01,116 నగదు సాయాన్ని 20-30 శాతం మేర పెంచి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. వీటితో పాటు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలని కూడా అధిష్టానం సూచించినట్టు సమాచారం. అలాగే.. ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాలను కలిపి అర్హులైన అందరికీ ఆరోగ్య భరోసా పేరుతో రూ.10 లక్షలతో ‘హెల్త్‌కార్డు’ను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద బీఆర్‌ఎస్‌ రూ.5లక్షలను అందిస్తుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగమైన చేయూత పథకంలో ‘రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా’ కింద రూ.10లక్షలను అందించనున్నట్టు తెలిపింది. దీంతో బీఆర్‌ఎస్‌ కూడా ‘హెల్త్‌కార్డు’ పేరుతో ఒక పథకాన్ని తీసుకువచ్చి.. సాయం మొత్తాన్ని పెంచాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వీటికి తోడు నిరుద్యోగ భృతిని మరోసారి మేనిఫెస్టోలో ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. వాస్తవానికి నిరుద్యోగ భృతి ఇస్తామని గతంలోనే ప్రకటించినా.. ఆర్థిక సమస్యల నేపథ్యంలో దాన్ని అమలుచేయలేదు. దీంతో ఈసారి ఆ పథకం అమలులో కొన్ని మార్పులు చేసి ప్రకటించి, ఎన్నికల్లో ఆ అంశాన్ని ప్రధానంగా యువతలోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. అలాగే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల వారీగా ఆర్థిక సాయాన్ని ఏడాదికింత చొప్పున ఇవ్వాలా, లేక నెలల వారీగా ఇవ్వాలా అన్నదానిపై చర్చ నడుస్తున్నట్టు సమాచారం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version