Viral Video: ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో టీం ఇండియా తొలి విజయం నమోదు చేసింది.. ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 199 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా చెలరేగి బౌలింగ్ చేశాడు. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్లో కీలకమైన మూడు వికెట్లు తనే పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కనీసం ప్రతిఘటించే సాహసం కూడా చేయలేకపోయింది. ఫలితంగా అంతటి భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆ జట్టు 199 పరుగులకు ఆల్ అవుట్ అవ్వాల్సి వచ్చింది.
ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా.. ఆదిలోనే తడబాటుకు గురి అయింది. ఖాతా ప్రారంభించకుండానే ఓపెనర్ ఇషాంత్ కిషన్ అవుట్ అయ్యాడు. తర్వాత అతడినే కెప్టెన్ రోహిత్ శర్మ అనుసరించాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అయ్యర్ కూడా తుస్సుమనిపించాడు. మొత్తంగా మూడు పరుగులకు కీలకమైన మూడు వికెట్లను భారత్ కోల్పోయింది. హజిల్ వుడ్ ధాటికి భారత బ్యాటర్లు బంతిని ముట్టుకుందాం అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
కీలక మైన ముగ్గురు బ్యాటర్లు అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ నిదానంగా ఆడటం ప్రారంభించారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ప్రారంభంలోనే రెండు వికెట్లు తీసిన హాజిల్ వుడ్ కు ఏడో ఓవర్ వేసే బాధ్యతను ఆ జట్టు కెప్టెన్ అప్పగించాడు. అప్పటికి హాజిల్ వుడ్ ఒక బంతి వేశాడు. రెండవ బంతి వేయగానే విరాట్ కోహ్లీ దానిని తప్పుగా అర్థం చేసుకొని బ్యాట్ అడ్డంగా ఊపాడు. బ్యాట్ చివరి ఎడ్జ్ కు బంతి తగలడంతో అది అమాంతం గాల్లో లేచింది. ఇంకేముంది నాలుగో వికెట్ కూడా భారత్ కోల్పోయినట్టే అని అందరూ అనుకున్నారు. చెన్నై చేపాక్ స్టేడియం కూడా ఒక్కసారిగా నిశ్శబ్దంలో కూరుకుపోయింది. కోహ్లీ కూడా మైదానాన్ని వీడేందుకు మానసికంగా సిద్ధమయ్యాడు. గాల్లో లేచిన ఆ బంతిని అందుకునేందుకు షాన్ మార్ష్ వేగంగా పరిగెత్తుకొచ్చాడు. ఎదురుగా వికెట్ కీపర్ కెమెరున్ గ్రీన్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే సులువుగా దక్కే క్యాచ్ ను అతి జాగ్రత్త వల్ల మార్ష్ నేలపాలు చేశాడు. ఫలితంగా విరాట్ కోహ్లీ బతికిపోయాడు.
షాన్ మార్ష్ జార విడిచిన ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఇది డెబ్బై లక్షలమంది వ్యూస్ సొంతం చేసుకుంది. ” మార్ష్ జార విడిచింది క్యాచ్ ను కాదు మ్యాచ్ ను.. ఆస్ట్రేలియా ఓటమిని ఈ క్యాచ్ శాసించింది.” ఆ నెటిజన్ కామెంట్ చేయగా.. “విరాట్ కోహ్లీ క్యాచ్ జార విడిచావు కాబట్టి.. ఐపీఎల్ సిరీస్ లో నీకు అవకాశం లభిస్తుంది” అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.