RG Kar Medical College Incident: కోల్ కతా ఆర్జీ కార్ ఆస్పత్రి ట్రైనీ వైద్యురాలి ఘటన తర్వాత.. బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం

కోల్ కతా లోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలి పై హత్యాచారం చోటు చేసుకున్న తర్వాత.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పై తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోతుంది. మహిళా వైద్యుల భద్రత కోసం రాతిరేర్ సతి(రాత్రి సహచరుడు) పేరుతో వీలైనంతవరకు మహిళా వైద్యులకు రాత్రి విధులు కేటాయించకుండా చూడాలని ప్రభుత్వం సర్కులర్ విడుదల చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 18, 2024 5:48 pm

RG Kar Medical College Incident

Follow us on

RG Kar Medical College Incident: ట్రైనీ వైద్యురాలి హత్యాచారం కేసులో ఇప్పటికే సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. కోల్ కతా హైకోర్టు తీర్పు మేరకు మూడు వారాల్లో విచారణ పూర్తి చేయాలని వేగంగా అడుగులు వేస్తోంది. మరోవైపు ఈ కేసులో విచారణ పూర్తి చేసి, త్వరగా తీర్పు చెప్పాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేస్తున్నారు. ఆమె రాజకీయ ప్రాబల్యం కోసం పశ్చిమ బెంగాల్ లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉండగానే పశ్చిమబెంగాల్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని వైద్య కళాశాలలలు, ఆసుపత్రులలో మహిళా వైద్యులకు రాత్రి విధులు కేటాయించకుండా చూడాలని నిర్ణయించింది.

మహిళా వైద్యుల భద్రత కోసం రాతిరేర్ సతి(రాత్రి సహచరుడు) పేరుతో వీలైనంతవరకు మహిళా వైద్యులకు రాత్రి విధులు కేటాయించకుండా చూడాలని ప్రభుత్వం సర్కులర్ విడుదల చేసింది. దీనిని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అలపన్ బందోపాధ్యాయ విడుదల చేశారు. ” అన్ని వైద్య కళాశాలలు, ఆసుపత్రుల వద్ద మహిళా – స్నేహపూర్వక భద్రత సిబ్బందిని మొహరింపజేస్తాం. మహిళ వైద్యులకు ప్రత్యేకమైన మరుగుదొడ్లను నిర్మిస్తాం. రెస్ట్ రూములు కూడా ఏర్పాటు చేస్తాం. వారికోసం భద్రత జోన్లు నిర్మిస్తాం. మరుగుదొడ్లు మినహా మిగతావన్నీ సిసిటీవీ కవరేజ్ లో ఉంటాయి. మహిళల భద్రత కోసం ప్రత్యేక రూపొందిస్తాం. దీని ద్వారా వైద్యులను, స్థానిక పోలీస్ స్టేషన్లో కనెక్ట్ చేస్తాం. మహిళ వైద్యులు మొత్తం యాప్ ను కచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలని” బందోపాధ్యాయ ప్రకటించారు.

కోల్ కతా అర్జీ కార్ ఆస్పత్రి ఘటన తర్వాత వైద్య కళాశాలలు, ఆస్పత్రుల వద్ద పోలీసులతో నిత్యం రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో రాత్రి విధులు నిర్వహించాల్సి వస్తే.. నలుగురు ఐదుగురు మహిళ వైద్యులకు కలిపి ఈ విధులను అప్పగించేలా ప్రభుత్వం విధివిధానాలను రూపొందించింది. ఈ మార్గదర్శకాలను కేవలం ప్రభుత్వ ఆసుపత్రులే కాకుండా, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లు కూడా అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. “ఈ విధానాన్ని కోల్ కతా తో పాటు జిల్లాల్లో కూడా అనుసరించాలి. భద్రత సిబ్బందిని నియమించే విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయదు. విధి నిర్వహణలో స్త్రీ – పురుష నిష్పత్తిని సమతౌల్యంగా ఉండేలా చూస్తామని” ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అలపన్ బందోపాధ్యాయ పేర్కొన్నారు.

కోల్ కతా లోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో ఆగస్టు 9న మహిళా వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండో సంవత్సరం చదువుతోంది. అదే ఆస్పత్రిలో చెస్ట్ విభాగంలో హౌస్ స్టాఫ్ గా పనిచేస్తోంది. ఆసుపత్రిలోని అత్యవసర భవనంలోని నాలుగవ అంతస్తులో ఆగస్టు 9 మధ్యాహ్నం సమయంలో ఆమె మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.. అంతేకాదు ఈ ఘటనకు పాల్పడిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.