
Preeti Case: వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి. పోలీస్ శాఖ కూడా సరైన సమయంలో స్పందించలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జనాల్లో ఆగ్రహం మరింత కట్టలు తెంచుకోకముందే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది.. ఇక నుంచి ర్యాగింగ్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. విద్యార్థులను ర్యాగింగ్ చేసినట్లు రుజువైతే ర్యాగింగ్ చేసిన సదరు విద్యార్థి మెడికల్ సీటును రద్దు చేసే యోచనలో ఉంది. ఈ విషయంపై వివిధ రంగాల నిపుణులతో చర్చలు జరుపుతోంది.
ఏదో ఒక రూపంలో..
ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ర్యాగింగ్‌ను నిరోధించలేకపోతున్నారు. ఏదో రూపంలో సీనియర్ల నుంచి జూనియర్ మెడికోలు ర్యాగింగ్‌ను ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రిన్సిపాళ్లు, హెచ్‌వోడీలు హెచ్చరించినప్పటికీ సీనియర్లలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఇలాంటి వారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటే తప్ప మార్పురాదని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల గాంధీ మెడికల్ కాలేజీలో జూనియర్లను ర్యాగింగ్ చేసిన కొంత మంది సీనియర్లను మూడు నెలలపాటు సస్పెండ్ చేశారు. అయితే ఇలాంటి చిన్నచిన్న శిక్షలు చాలా తక్కువన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ర్యాగింగ్ చేస్తే సీటు పోతుందన్న భయం వారిలో ఉంటే తప్ప మార్పురాదని కొందరు సీనియర్ అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు.
త్వరలో కీలక నిర్ణయం?
మెడికోల పని వేళలపై వైద్యశాఖ దృష్టిసారించింది. గంటల కొద్ది డ్యూటీల విషయంలో పునరాలోచన చేస్తోంది. ఈ విషయంపై లోతుగా సమీక్షించుకోవాల్సిన అవసరంఉందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా హౌజ్‌సర్జన్లు, పీజీలు, సీనియర్ రెసిడెంట్స్‌కు 36 నుంచి 48 గంటల వరకు ఏకధాటిగా డ్యూటీలు పడుతున్నాయి. దీంతో కొందరు విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కంటి నిండా నిద్రలేకపోవడం, నీట్‌పీజీకి ప్రిపేరవుతుండటం, పెళ్లయిన వారు కుటుంబ బాధ్యతలు చూసుకోవాల్సిరావడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. దీనికితోడు ర్యాగింగ్ ఒకటి. ఇక డాక్టర్ ప్రీతి ఆత్మహత్య ఘటనతో వైద్యశాఖ తీవ్ర విమర్శలపాలైంది. వ్యవస్థలోని నిర్లక్ష్యం వల్లే ప్రీతి చనిపోయిందన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా నెలకొంది. దీంతో డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకు సర్కారు సిద్ధమైంది. అందుకే పీజీలు, ఎస్‌ఆర్, హౌజ్‌సర్జన్ల డ్యూటీ విషయంలో త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

పని వేళలు తగ్గించాలి
ఏకధాటిగా ఉండే డ్యూటీ వేళలను తగ్గించడమో లేదా మరో విధంగా మార్చడమో చేయాలన్న యోచనలో వైద్య విద్య ఉన్నతాధికారులున్నారు. అలాగే వైద్యవిద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు అన్నిచోట్లా గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల ఇలాంటివి ఉన్నాయి. అయితే వీటిని మరింత బలోపేతం చేయనున్నారు. హెచ్‌వోడీలకు ఫిర్యాదు చేయలేని పక్షంలో గ్రీవెన్స్ సెల్స్‌కు ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సో మొత్తానికి ప్రీతి ఆత్మ హత్య తర్వాత ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించే అవకాశాలు పంపిస్తున్నాయి.. కేవలం వైద్య కోర్సులు మాత్రమే కాకుండా మిగతా వాటికీ కొత్తవిధానాలు వర్తింపజేస్తే బాగుంటుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.