
Manish Sisodia Arrested: ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ వేగంగా సాగుతోంది. సీబీఐ దూకుడుగా అడుగులు వేస్తోంది. ఎవరినీ వదలడం లేదు. అసలు లెక్క చేయడం లేదు. పైగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ వెనుకడుగు వేయడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే సీబీఐ ఇప్పుడు మరింత శక్తివంతంగా కనిపిస్తోంది. ఇక మద్యం కుంభకోణంలో ఆప్ నేత సత్యేందర్ జైన్‌ను నిరుడు జూలైలో వేరే కేసులో ఈడీ అరెస్టు చేసిన తర్వాత.. ఆప్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. జైన్ తర్వాత ఆ స్థాయి రాజకీయ అరెస్టు ఇదే అని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఢిల్లీలో రాజకీయవాతావరణం వేడెక్కింది. బలమైన ఆధారాలు, ప్రాసంగిక సాక్ష్యాలు లేకుండా ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్టు చేయడం అంత సులువు కాదు. మరి ఈ కేసులో సిసోడియాను అరెస్టు చేయడానికి సీబీఐకి బలమైన ఆధారం దొరికింది.
ఓ డిజిటల్ పరికరంలో
2022 ఆగస్టు 19న ఢిల్లీ ఎక్సైజ్ విభాగం నుంచి స్వాధీనం చేసుకున్న ఒక డిజిటల్ పరికరంలో.. నూతన మద్యం విధానానికి సంబంధించిన ముసాయిదా పత్రాల్లో ఒకటి సీబీఐకి దొరికింది. అది ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆరాతీయగా దాని మూలాలు మనీశ్ సిసోడియా ఆఫీసు కంప్యూటర్‌లో తేలాయి. 2023 జనవరిలో సీబీఐ అధికారులు ఆ కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, అప్పటికే ఆ కంప్యూటర్‌లో ఫైళ్లలో చాలావరకూ డిలీట్ అయిపోయినప్పటికీ.. సీబీఐ ఫోరెన్సిక్ బృందదం సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వాటిని రిట్రీవ్ చేసింది. వాటిలో ఒక డాక్యుమెంట్ వాట్సాప్ ద్వారా వచ్చినట్టు గుర్తించింది. దీంతో సీబీఐ.. సిసోడియాకు సెక్రటరీగా పనిచేసిన 1996 బ్యాచ్ అధికారి ఒకరికి సమన్లు జారీ చేసి ఆ ఫైల్ గురించి ఆయన్ను ప్రశ్నించింది. ఫిబ్రవరి మొదటివారంలో ఆయన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసింది.
వాంగ్మూలంలో ఏముందంటే
ఆ అధికారి ఇచ్చిన వాంగ్మూలంలో ఏముందంటే.. 2021 మార్చిలో మనీశ్ సిసోడియా ఆయన్ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి పిలిపించి, మద్యం విధానానికి సంబంధించి మంత్రుల బృందం రూపొందించిన ముసాయిదా నివేదికను ఇచ్చారు. ఆరోజు అక్కడ మరో మంత్రి సత్యేందర్ జైన్ కూడా ఉన్నారని ఆ అధికారి తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మద్యం విధానంలో అత్యంత కీలకమైన 12ుప్రాఫిట్ మార్జిన్ గురించి తొలిసారిగా ఆ ముసాయిదా నివేదికలోనే మంత్రుల బృందం పేర్కొన్నట్లు సమాచారం. అలాగే.. మనీశ్ సిసోడియా సహాయకుడు దినేశ్ అరోరా అప్రూవర్‌గా మారి ఇచ్చిన సమాచారం కూడా ఆయన అరెస్టుకు కారణమైంది. దినేశ్ అరోరా విచారణ అనంతరం.. ఈ కేసులో మనీశ్‌కు వ్యతిరేకంగా ఉన్న డాక్యుమెంటరీ, డిజిటల్ ఆధారాలన్నింటినీ సేకరించిన సీబీఐ అధికారులు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసు ఇచ్చి, ఫిబ్రవరి 19న ఆయన్ను విచారణకు పిలిచారు. కానీ, ఆయన తనకు కొంత సమయం కావాలని కోరడంతో 26వ తేదీన రావాల్సిందిగా సూచించారు.

నాకు తెలియదు
విచారణలో వారు అడిగిన ప్రశ్నలకు.. మనీశ్ సిసోడియా నుంచి ‘నాకు తెలియదు’ అనే సమాధానమే వచ్చినట్టు సమాచారం. తాము ఆధారాలతో సహా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చారని.. అంఅందుకే ఆయన్ను అరెస్టు చేయాల్సి వచ్చిందని సీబీఐ అధికారులు అంటున్నారు. ఢిల్లీ నూతన మద్యం విధానాన్ని ఎవరు రూపొందించారు? వాటిపై ఎవరు సంతకాలు పెట్టారు? ఆ విధానం తయారీకి దారి తీసిన చర్చల వివరాలు ఉన్న కీలక ఫైళ్లన్నీ కనిపించకుండా పోయాయి! అలాగే.. ఈ మద్యం విధానంలో మార్పులుచేర్పులకు సంబంధించి వివిధ ఫోన్ నంబర్ల నుంచి వాట్సా్‌పలో తమకు ఆదేశాలు వచ్చేవని ఢిల్లీ ఎక్సైజ్ విభాగానికి చెందిన ఒక అధికారి.. సీబీఐ అధికారులకు చెప్పారు. ఈ కేసులో సీబీఐ 2022 ఆగస్టు 19న ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఆరోజు, ఆ మరునాడు మనీశ్ సిసోడియా తన సిమ్‌కార్డును మూడు ఫోన్లలో ఉపయోగించినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. 2022 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఆయన 18 మొబైల్‌ఫోన్లు, నాలుగు సిమ్‌కార్డులు వాడినట్టు సమాచారం. ఒక నంబర్‌నైతే ఏకంగా ఏడు ఫోన్లలో వేసి వాడారని.. ఒకేరోజు ఒక సిమ్‌ను ఒకటికి మించి మొబైల్స్‌లో వేసి వినియోగించారని సీబీఐ వర్గాలు అంటున్నాయి. ఆ ఫోన్లన్నీ ధ్వంసమైపోయాయని, వీటిపై సిసోడియా నుంచి సంతృప్తికర సమాచారం రాలేదని సీబీఐ అధికారులు చెబుతున్నారు.