
Megastar Chiranjeevi: హైదరాబాద్ శివారులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి చిత్రం కోసం నిర్మించిన సెట్ అగ్నికి ఆహుతి అయ్యింది. గత ఏడాది విడుదలైన ఆచార్య మూవీ కోసం నిర్మించిన సెట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య పాద ఘట్టం అనే టెంపుల్ సిటీ ప్రధానంగా సాగుతుంది. పాద ఘట్టం అనే ఒక ఊహాజనిత టెంపుల్ సిటీని ఆర్ట్ డైరెక్టర్ రూపొందించారు. దీని కోసం భారీగా ఖర్చు చేశారు. కోకాపేటలో ఈ సెట్ నిర్మించడం జరిగింది. షూటింగ్ అనంతరం సెట్ కూల్చివేయకుండా అలానే వదిలేశారు.
సోమవారం రాత్రి సెట్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోనళకు గురయ్యారు. పోలీసులకు, ఫైర్ డిపార్ట్మెంట్ కి సమాచారం ఇచ్చారు. వట్టినాగులపల్లి ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. సెట్ దాదాపు కాలిపోయిందని సమాచారం. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎవరైనా బాధితులు ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నగర శివార్లలో సినిమా సెట్స్ నిర్మించి వదిలేయడం ప్రమాదకరమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక పాత సినిమా సెట్ కావడంతో ఎవరికీ నష్టం లేదని చెప్పొచ్చు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచార్య చిత్రంలో రామ్ చరణ్-చిరంజీవి నటించారు. భారీ బడ్జెట్ తో ఈ మల్టీస్టారర్ తెరకెక్కింది. 2022 సమ్మర్ కానుకగా విడుదలైన ఆచార్య ప్రేక్షకులను నిరాశ పరిచింది. అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కొరటాల నుండి ఇలాంటి చిత్రం ఊహించలేదని ఆడియన్స్ పెదవి విరిచారు. ఆచార్య భారీగా నష్టాలు మిగిల్చింది.

చిరంజీవి-రామ్ చరణ్ రెమ్యూనరేషన్ వదులుకోవడంతో పాటు కోట్ల రూపాయలు నష్టపోయారు. ఆర్థిక విషయాల్లో తలదూర్చిన కొరటాల సైతం సమస్యలు ఎదుర్కొన్నారు. అటు హీరోలకు ఇటు దర్శకుడికి ఆచార్య చేదు అనుభవాలు మిగిల్చింది. ఆచార్య ఫెయిల్యూర్ నుండి చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆయన నటించిన గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ తో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.