Ram Gopal Varma: చంద్రబాబు, పవన్ భేటీ పై ఆర్జీవీ బాధ చెప్పనలవికానిది. రాజకీయ భేటీ పై సినిమా దర్శకుడికి ఇంత బాధ ఎందుకనే సందేహం కలగక మానదు. ఇదంతా జగన్ కోసం, జగన్ కళ్లలో ఆనందం కోసమని చెప్పక తప్పదు. ఆయన కొటేష్లు, ఈక్వేషన్లు చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. ఆర్జీవీ పరాన్నజీవిగా మారి, జగన్ మెప్పు కోసం తహతహలాడుతున్నారని వినికిడి. దీంతో సమయం, సందర్భం, అవసరం లేకున్నా పవన్ పై అవాకులు, చవాకులు పేలుతున్నారనేది పలువురి అభిప్రాయం.

చంద్రబాబుతో, పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత ఆర్జీవీ విమర్శలు గుప్పించారు. కాపులకు రిప్ అంటూ.. కమ్మలకు కంగ్రాట్యులేషన్ అంటూ పోస్ట్ చేశారు. చంద్రబాబు పాదాల దగ్గర కాపులను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. రెండు రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటే సంబంధిత కులాలను తాకట్టు పెట్టడమనే అర్థమా ?. ఆర్జీవీ విమర్శకు అర్థం ఉందా ? . జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకున్నారు. మరి రెడ్డి కులాన్ని, కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్టులకు, టీఆర్ఎస్ కు తాకట్టు పెట్టినట్టేనా ?. వారి పాదాల వద్ద రెడ్లను ఉంచినట్టేనా ?. పవన్ పై విమర్శి చేసేవారు గతాన్ని ఓ సారి తవ్విచూసుకోవాలి. రాజకీయ విమర్శ అర్థవంతంగా ఉండాలి. అంతేకాని అర్థం లేకుండా విమర్శిస్తే విలువ ఉండదు. ఆర్జీవీ విమర్శ అలాంటిదే. విలువ లేని, విశ్వసనీయ లేని విమర్శే.
చంద్రబాబు, పవన్ భేటీ పై ఆర్జీవికి ఎందుకు అంత ఆసక్తో చాలా మందికి అర్థం కాకపోవచ్చు. నిశితంగా పరిశీలిస్తే ఆర్జీవీ బాధంతా జగన్ కళ్లలో ఆనందం కోసమే అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే జగన్ వైభోగం పై సినిమా నిర్మించేందుకు ఆర్జీవీ ఒప్పందం కుదుర్చుకున్నారు. వరుస ప్లాపులతో నిర్మాతల పాలిట శనిలా మారిన ఆర్జీవికి .. సినిమా ఫైనాన్సింగ్ చేస్తున్నదీ వైసీపీ నేతలే. దీంతో స్వామి భక్తి చాటుకునేందుకు పవన్ పై విమర్శలు చేస్తున్నారు.

ఏపీలో ఏం జరిగినా రామ్ గోపాల్ వర్మ స్పందించడు. ప్రతిపక్షాల నుంచి సూదిమొనంత తప్పు దొరికినా ఆగమేఘాలపై స్పందిస్తాడు. ఆయన ఇంట్రెస్ట్ చూస్తే ప్రజాప్రయోజనాల కోసమో ఆయన తపన అన్నట్టు ఉంటుంది. తీరా చూస్తే స్వామిభక్తిని చాటుకోవడం తప్ప మరొకటి కాదని అర్థమైపోతుంది.