బుస‌లు కొడుతున్న తాలిబ‌న్లు

ప్రపంచంలో జ‌ర‌గ‌బోతున్న ప్ర‌ధానమైన మార్పుల్లో ఒక‌టి ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి అమెరికా సేన‌లు వెళ్లిపోవ‌డం. తాలిబ‌న్ల‌ను ఎదుర్కొనేందుకు, ఆఫ్ఘ‌న్లో శాంతి నెల‌కొలిపేందుకు అంటూ.. జార్జ్ బుష్ హ‌యాంలో 20 సంవ‌త్స‌రాల క్రితం ఆ దేశంలోకి ప్ర‌వేశించిన‌ అమెరిక‌న్ బ‌ల‌గాలు.. ఇప్పుడు వెన‌క్కి వెళ్లిపోతున్నాయి. ద‌శ‌ల వారీగా బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డానికి కొత్త అధ్య‌క్షుడు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఆగ‌స్టు నాటికి పూర్తిగా అమెరికా సేన‌లు స్వ‌దేశానికి వెళ్లిపోనున్నాయి. దీంతో.. ఏం జ‌ర‌గ‌బోతోంది? ఈ ప్ర‌భావం భార‌త్ పై ఎలా ఉండ‌బోతోంది? అస‌లు […]

Written By: Bhaskar, Updated On : July 21, 2021 1:27 pm
Follow us on

ప్రపంచంలో జ‌ర‌గ‌బోతున్న ప్ర‌ధానమైన మార్పుల్లో ఒక‌టి ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి అమెరికా సేన‌లు వెళ్లిపోవ‌డం. తాలిబ‌న్ల‌ను ఎదుర్కొనేందుకు, ఆఫ్ఘ‌న్లో శాంతి నెల‌కొలిపేందుకు అంటూ.. జార్జ్ బుష్ హ‌యాంలో 20 సంవ‌త్స‌రాల క్రితం ఆ దేశంలోకి ప్ర‌వేశించిన‌ అమెరిక‌న్ బ‌ల‌గాలు.. ఇప్పుడు వెన‌క్కి వెళ్లిపోతున్నాయి. ద‌శ‌ల వారీగా బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డానికి కొత్త అధ్య‌క్షుడు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఆగ‌స్టు నాటికి పూర్తిగా అమెరికా సేన‌లు స్వ‌దేశానికి వెళ్లిపోనున్నాయి. దీంతో.. ఏం జ‌ర‌గ‌బోతోంది? ఈ ప్ర‌భావం భార‌త్ పై ఎలా ఉండ‌బోతోంది? అస‌లు ఈ తాలిబ‌న్లు ఎవ‌రు? అన్న‌ది చూద్దాం.

వాస్త‌వానికి తాలిబ‌న్లు తొలిద‌శ‌లో ప్ర‌జ‌ల సంక్షేమం కాంక్షించే విప్ల‌వ‌కారుల మాదిరిగా వ్య‌వ‌హ‌రించేవారు. 1990వ ద‌శ‌కంలో ఆఫ్గాన్ పై ఆధిప‌త్యం చెలాయించిన సోవియ‌ట్ యూనియ‌న్ సేన‌లు వెళ్లిపోయిన త‌ర్వాత‌.. ఆ దేశ ఉత్త‌ర ప్రాంతంలోని ఆదివాసీల హ‌క్కుల కోసం తాలిబ‌న్లు ఉద్య‌మించారు. అవినీతి నిర్మూల‌న‌కు ప్ర‌య‌త్నించారు. ఆయా ప్రాంతాల్లో ర‌వాణా సౌక‌ర్యాలు మొద‌లు.. ప్ర‌జ‌లు సంక్షేమం కోసం ప‌నిచేసేవారు. అయితే.. కాల క్ర‌మంలో వీరి ఉద్య‌మాన్ని మ‌తం హైజాక్ చేసింది.

మ‌త ఛాంద‌స వాదులు ఇందులోకి ప్ర‌వేశించి, ల‌క్ష్యాన్నే మార్చేశారు. క్ర‌మంగా.. మ‌త విధానాల‌ను అమ‌లు చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇందులో భాగంగా మ‌హిళ‌లు ఖ‌చ్చితంగా బుర‌ఖాలు ధ‌రించాల‌ని, అమ్మాయిలు చ‌దువుకోవ‌ద్ద‌ని, స్త్రీలు అస‌లు ఇళ్లు దాటి బ‌య‌ట‌కు రావొద్ద‌నే ఆంక్ష‌లు విధించ‌డం మొద‌లు పెట్టారు. ఈ ప‌రిస్థితి మ‌రింత శృతిమించింది. వారు విధించిన రూల్స్ అతిక్ర‌మించిన వారికి బ‌హిరంగంగా మ‌ర‌ణ‌శిక్ష‌లు విధించ‌డం మొద‌లు పెట్టారు. మొత్తంగా ఆఫ్గానిస్తాన్ లో ఒక అరాచ‌క విధానం మొద‌లైంది.

ఇదే స‌మ‌యంలో.. 2001 సెప్టెంబ‌ర్ 11న అమెరికాలోని వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ పై అల్ ఖైదా ఉగ్ర‌వాదులు దాడిచేసిన సంగ‌తి తెలిసిందే. అగ్ర‌రాజ్యం పైనే దాడి జ‌ర‌గ‌డంతో ప్ర‌పంచం మొత్తం నివ్వెర‌పోయింది. దీంతో.. అమెరికా ఉగ్ర‌వాద నిర్మూల‌న‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఓ వైపు ఉగ్ర‌వాదుల‌ను ఏరివేసేందుకు.. మ‌రోవైపు ప్ర‌పంచం ముందు త‌న బ‌లం చేజార‌లేద‌ని నిరూపించుకునేందుకు సిద్ధప‌డింది. ఇందులో భాగంగానే.. అల్ ఖైదాకు, తాలిబ‌న్ల‌కు ప్ర‌ధాన స్థావ‌రంగా ఉన్న ఆఫ్ఘ‌నిస్తాన్ కు బ‌ల‌గాల‌ను త‌ర‌లించింది.

ఇప్ప‌టికి రెండు ద‌శాబ్దాలు గ‌డిచాయి. మ‌రి, ఉగ్ర‌వాద నిర్మూల‌న ఎంత వ‌ర‌కు జ‌రిగిందని అంటే.. ఏమీ లేద‌నే చెప్పాలి. కానీ.. ఈ కాలంలో అమెరికాకు చాలా న‌ష్టం జ‌రిగింది. ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కుపైగా ఖ‌ర్చ‌య్యింద‌ని అంచ‌నా. అంతేకాదు.. వేలాది మంది అమెరిక‌న్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయిన‌ప్ప‌టికీ.. తాలిబ‌న్ల‌ను ఏమీ చేయ‌లేక‌పోయారు. 398 జిల్లాలు ఉన్న ఆఫ్గ‌నిస్తాన్ లో దాదాపు 200 జిల్లాలు తాలిబ‌న్ల ఆధిప‌త్యంలోనే ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో తాలిబ‌న్ల‌కు – ఆఫ్ఘనిస్తాన్ సైనికుల‌కు మ‌ధ్య పోరు కొన‌సాగుతూనే ఉంది. 20 సంవ‌త్స‌రాలుగా ప్ర‌య‌త్నించినా.. ఏమీ చేయ‌లేక‌పోవ‌డంతో త‌మ బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని అమెరికా నిర్ణ‌యించుకుంది. గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలోనే అమెరికా-తాలిబ‌న్ల మ‌ధ్య ఈమేర‌కు ఒప్పందం కుదిరింది.

అయితే.. పూర్తి మ‌తం ప్రాతిప‌దిక‌న యుద్ధం ప్ర‌క‌టించే తాలిబ‌న్లు భార‌త్ ను ప్ర‌త్య‌ర్థిగానే చూస్తున్నారు. ప‌క్క‌నున్న పాకిస్తాన్ వారికి పూర్తిగా అండ‌దండ‌లు అందిస్తోంది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో.. అమెరిక‌న్ సేన‌లు పూర్తిగా వైదొలిగితే.. తాలిబ‌న్ల అరాచ‌కాలు మ‌ళ్లీ పాత స్థితికి వ‌చ్చేస్తాయ‌నే ఆందోళ‌న స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే.. భార‌త్ మాత్రం ఆఫ్ఘ‌నిస్తాన్ ప్ర‌భుత్వంతో ఫ్రెండ్షిప్ కొన‌సాగిస్తోంది. ఆ దేశంలో పార్ల‌మెంట్ నిర్మించ‌డం నుంచి.. ఎన్నో విధాలుగా స‌హ‌కారం అందిస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. ఉగ్ర‌వాద మూక‌లు భార‌త్ వ్య‌తిరేకంగానే పోరాడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌త్ మ‌రింత‌ అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సి వ‌స్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.