Afghanistan: అప్ఘనిస్తాన్ లో విమానం హైజాక్.. కలకలం

తాలిబన్లు అధికారంలోకి వచ్చాక అప్ఘనిస్తాన్ (Afghanistan)లో జనాలు భిక్కుభిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతున్నారు. కాబూల్ విమానాశ్రయానికి పోటెత్తి దొరికిన విమానంలో విదేశాలకు తరలుతున్నారు. ఈ క్రమంలోనే వివిధ దేశాలకు చెందిన విమానాలు కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి తమ దేశస్థులను తరలించే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఓ ఉక్రెయిన్ విమానం అప్ఘనిస్తాన్ కు వచ్చింది. అందులో అప్ఘనిస్తాన్ లో చిక్కుకుపోయిన ఉక్రేనియన్లను తరలించడానికి ఆ దేశ విమానం రెడీ అయ్యింది. అయితే […]

Written By: NARESH, Updated On : August 24, 2021 2:57 pm
Follow us on

తాలిబన్లు అధికారంలోకి వచ్చాక అప్ఘనిస్తాన్ (Afghanistan)లో జనాలు భిక్కుభిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతున్నారు. కాబూల్ విమానాశ్రయానికి పోటెత్తి దొరికిన విమానంలో విదేశాలకు తరలుతున్నారు. ఈ క్రమంలోనే వివిధ దేశాలకు చెందిన విమానాలు కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి తమ దేశస్థులను తరలించే పనిలో బిజీగా ఉన్నాయి.

ఈ క్రమంలోనే మంగళవారం ఓ ఉక్రెయిన్ విమానం అప్ఘనిస్తాన్ కు వచ్చింది. అందులో అప్ఘనిస్తాన్ లో చిక్కుకుపోయిన ఉక్రేనియన్లను తరలించడానికి ఆ దేశ విమానం రెడీ అయ్యింది. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆ విమానాన్ని హైజాక్ చేశారు. విమానాన్ని ఇరాన్ తరలించారు. దీంతో కాబూల్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రస్తుతం తాత్కాలికంగా ఆపేశారు.

ఇక ఉక్రెయిన్ విమానంలో ఉక్రెయిన్ దేశస్తులు లేరు. అందులో గుర్తు తెలియని ప్రయాణికుల బృందం ఉన్నట్టు ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్ జెనీ యెనిన్ తెలిపారు.

ఆదివారం కూడా ఒక విమానాన్ని ఉక్రెయిన్ లో ఎవరో హైజాక్ చేశారు. ఇప్పుడు మరో విమానం కాబూల్ నుంచి ఎత్తుకుపోయారు. నాలుగు సార్లు తమ దేశస్థులను తీసుకెళ్లాలని అనుకున్న ఉక్రెయిన్ దేశానికి ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

అయితే ఉక్రెయిన్ విమానాన్ని ఎవరు హైజాక్ చేశారన్నది మాత్రం తెలియడం లేదు. ఎయిర్ పోర్ట్ పూర్తిగా అమెరికా, నాటో దళాల కంట్రోల్ లోనే ఉంది. అక్కడ ఏ విమానం ఎగరాలన్న.. ఏది ల్యాండ్ కావాలన్న అమెరికా సైన్యం అనుమతి తప్పనిసరి. అక్కడ 6వేల మంది అమెరికన్ సైనికులు మోహరించి ఉన్నారు. ఎయిర్ ట్రాఫిక్ మొత్తం తమ కంట్రోల్ లోనే సైన్యం ఉంచుకుంది. దీంతో అమెరికా ఫెయిల్యూర్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

భారత్ సహా పలు దేశాలు విమానాల ద్వారా అప్ఘనిస్తాన్ నుంచి తమ పౌరులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. ఇప్పుడు అమెరికా సైన్యం 31లోపు వెళ్లిపోతే పరిస్థితులు మరింత దిగజారడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పుడు ఉక్రెయిన్ విమానం హైజాక్ తో మొత్తం ప్రయాణాలే బంద్ అయిపోయాయి. హైజాక్ చేసింది ఉగ్రవాదులా.? మామూలు ప్రయాణికులా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం విమాన సర్వీసులను కాబూల్ ఎయిర్ పోర్టులో నిలిపివేయడంతో అన్ని దేశాల పౌరులకు శరాఘాతంగా మారింది.