https://oktelugu.com/

Afghanistan : క్రికెట్ కుప్ప కూలుతుందా?

గ‌తంలో ఆఫ్ఘ‌నిస్తాన్ క్రికెట్ జ‌ట్టు గురించి ఎవ్వ‌రూ ప‌ట్టించుకునేవారు కాదు. అదో అనామ‌క జ‌ట్టుకింద లెక్క‌గ‌ట్టేవారు. కానీ.. ఇప్పుడు లెక్క వేరే. ప్ర‌పంచ అగ్ర‌శ్రేణి జ‌ట్లు కూడా లెక్క‌లోకి తీసుకోవాల్సిందే. ప్ర‌ధానంగా టీ20 ఫార్మాట్ లో ఆ జ‌ట్టు న‌మ్మ‌శ‌క్యం కాని విజ‌యాలు న‌మోదు చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌రుస‌గా 12 విజ‌యాలు సాధించిన ఏకైక జ‌ట్టు ఆఫ్ఘ‌నిస్తాన్ మాత్ర‌మే అంటే.. ఆ జ‌ట్టు ఆట‌తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు టీ20లో […]

Written By: , Updated On : August 21, 2021 / 10:34 AM IST
Follow us on

గ‌తంలో ఆఫ్ఘ‌నిస్తాన్ క్రికెట్ జ‌ట్టు గురించి ఎవ్వ‌రూ ప‌ట్టించుకునేవారు కాదు. అదో అనామ‌క జ‌ట్టుకింద లెక్క‌గ‌ట్టేవారు. కానీ.. ఇప్పుడు లెక్క వేరే. ప్ర‌పంచ అగ్ర‌శ్రేణి జ‌ట్లు కూడా లెక్క‌లోకి తీసుకోవాల్సిందే. ప్ర‌ధానంగా టీ20 ఫార్మాట్ లో ఆ జ‌ట్టు న‌మ్మ‌శ‌క్యం కాని విజ‌యాలు న‌మోదు చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌రుస‌గా 12 విజ‌యాలు సాధించిన ఏకైక జ‌ట్టు ఆఫ్ఘ‌నిస్తాన్ మాత్ర‌మే అంటే.. ఆ జ‌ట్టు ఆట‌తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు టీ20లో హ‌య్యెస్ట్ స్కోరు (278) కూడా వాళ్ల‌దే. టీ20 ర్యాంకింగ్స్ లో శ్రీలంక‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్ వంటి జ‌ట్లక‌న్నా పైన ఉంది ఆఫ్ఘాన్‌. అద్భుత‌మైన ప్ర‌తిభ‌తో ఇలా దూసుకెళ్తున్న ఆఫ్ఘాన్ జ‌ట్టుకు ఇప్పుడు.. తాలిబ‌న్ల రూపంలో అతి పెద్ద అడ్డంకి ఎదుర‌వుతోంది.

అఫ్ఘాన్ మాజీ క్రికెట‌ర్ అబ్దుల్లా మ‌జారీతో క‌లిసి రాజ‌ధాని కాబూల్ లో ఉన్న అఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) కార్యాల‌యాన్ని తాలిబ‌న్లు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని అన్ని క్రికెట్ మైదానాల‌నూ త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో.. ఆఫ్ఘ‌న్ క్రికెట్ భ‌విష్య‌త్ ఎలా ఉంటుందో అర్థంకాకుండా ఉంది. అంత‌ర్జాతీయ క్రికెట్లో వేగంగా ఎదుగుతున్న ఆఫ్ఘ‌న్ కు ఇది శ‌రాఘాత‌మే. క్రికెట్ ను తాలిబ‌న్లు త‌మ చేతుల్లోకి తీసుకోవ‌డం ఒకెత్త‌యితే.. అక్క‌డ ఉన్న క్రికెటర్లు భ‌యంతో కొట్టుమిట్టాడుతున్నారు.

ప్ర‌స్తుతం ఆఫ్ఘ‌న్ స్టార్ ఆట‌గాళ్లు ర‌షీద్ ఖాన్‌, ముజిబుర్‌రెహ‌మాన్‌, మ‌హ్మ‌ద్ న‌బీ ఇంగ్లండ్ లో ఉన్నారు. అక్క‌డ ‘100 టోర్నీ’ ఆడుతున్నారు. మిగిలిన క్రికెటర్లు, వీళ్ల కుటుంబ సభ్యులు అందరూ ఆఫ్ఘన్ లోనే ఉన్నారు. దీంతో.. ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని వీళ్లంతా భ‌యం గుప్పిట బ‌తుకుతున్నారు. రషీద్ చేసిన ట్వీట్లు వారిలో అభద్రతను వెల్లడిస్తున్నాయి. ‘‘నా దేశం దారుణ పరిస్థితుల్లో ఉంది. పిల్లలు, మహిళలు సహా వేలాది మంది అమాయక ప్రజలు నిత్యం బలవుతున్నారు. ఇళ్లు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. ఆఫ్ఘ‌న్ల‌ను చంపొద్దు’’ రషీద్ ఆవేద‌న‌, ఆందోళ‌న‌ వ్య‌క్తం చేశాడు.

త్వ‌ర‌లో టీ20 ప్ర‌పంచ క‌ప్ ప్రారంభం కానుంది. వ‌చ్చే నెల‌లో పాకిస్తాన్ తో ఆఫ్గాన్ మూడు వ‌న్డేలు ఆడాల్సి ఉంది. వ‌ర‌ల్డ్‌క‌ప్ త‌ర్వాత ఆస్ట్రేలియా టూర్ వెళ్లాల్సి ఉంది. దేశంలో ఇలాంటి ప‌రిస్థితులు ఉంటే.. ఆఫ్గ‌న్ ఆట‌గాళ్లు క్రికెట్ పై ఎలా దృష్టి పెట్ట‌గ‌ల‌ర‌న్న‌ది ప్ర‌శ్న‌. ఇప్పుడిప్పుడే కుదుట‌ప‌డుతున్న ఏసీబీ క్రికెట్ మొత్తం కుప్ప కూలిపోతుందా? అనే ఆందోళ‌న క్రికెట్ ప్ర‌పంచంలో నెల‌కొంది.

ఆఫ్ఘ‌న్ క్రికెట్ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే.. దానికి భార‌త్ స‌హ‌కారం ఎంతో ఉంది. ఐసీసీ అనుబంధ స‌భ్య‌త్వం సంపాదించ‌డం.. ఆ త‌ర్వాత పూర్తిస్థాయి మెంబ‌ర్ షిప్‌, టెస్టు హోదా ద‌క్కించుకోవ‌డంలో బీసీసీఐ కృషి చాలా ఉంది. ఆఫ్గాన్ లో మూడు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియాలు నిర్మించేందుకు నిధులు అందిస్తోంది బీసీసీఐ. 2019లో ల‌ఖ‌న‌వూలోని క్రికెట్ స్టేడియాన్ని ఆఫ్ఘ‌న్ కు కేటాయించింది భార‌త్‌. ఇలా ఎన్నో విధాలుగా స‌హ‌కారం అందించి, ఆఫ్ఘ‌న్ క్రికెట్ ను అభివృద్ధి చేస్తే.. ఇవాళ తాలిబ‌న్ల రాక‌తో మొత్తం తుడిచిపెట్టుకుపోయే ప‌రిస్థితి ఉంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.