
ఇప్పటివరకు ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వంపై ఒక్కసారిగా ఎదురుదాడి మొదలైంది. తొలిసారి వ్యవసాయ చట్టాల రూపంలో అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది. వ్యవసాయ చట్టాలపై వెనకడుగు వేయకతప్పని అనివార్య పరిస్థితి తలెత్తుతోంది. అన్నదాతల ఆందోళన కేంద్ర సర్కారు మెడలు వంచే తీవ్రతను సంతరించుకుంటోంది. ‘చేతులెత్తి మొక్కుతున్నా చర్చలకు రండి’ అంటూ ప్రధాని పిలుపునివ్వడంలోనే బీజేపీ నిస్సహాయత వెల్లడైంది.
Also Read: దేశ ప్రజలకు అలర్ట్.. జనవరి 1 నుంచి మారనున్న నిబంధనలు ఇవే..?
గతంలో ఎంతటి ప్రజావ్యతిరేక నిర్ణయాలకైనా తీసుకొని మొండిగా ముందుకెళ్లేది మోడీ సర్కార్. ప్రతిపక్షాల అనైక్యత, బలహీనత కేంద్రానికి వెన్నుదన్నుగా నిలిచేవి. కానీ… తాజాగా వ్యవసాయ చట్టాలపై ప్రతికూలత రోజురోజుకూ ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. కొన్ని ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పలేకపోవడంతో చట్టాల్లోని డొల్లతనం అర్థమవుతోంది. నిజంగానే కేంద్ర సర్కారు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పాకులాడుతుందేమోననే అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ పరిస్థితులు వికటించినప్పుడు రైతు పూర్తిగా మునిగిపోయే ప్రమాదమూ ఉంది.
Also Read: కేంద్రం వర్సెస్ రైతు సంఘాలు
నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్ణయాలను మొండిగా అమలు చేస్తున్నారు. నోట్ల రద్దు, పౌరసత్వ సవరణ చట్టం అమలు, విద్యుత్ సంస్కరణలు, పాకిస్తాన్‌పై సర్జికల్ దాడులు, దేశవ్యాప్త లాక్ డౌన్ వంటి నిర్ణయాలన్నీ విపక్షాలతో సంబంధం లేకుండా అమలు చేశారు. ప్రజలు తమపై భారం పడినా కేంద్రం నిర్ణయంలోని సదుద్దేశాన్నే పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతిపక్షాలు రాజకీయం చేద్దామని చూసినా ప్రజల నుంచి మద్దతు లభించలేదు. ఇది కేంద్ర ప్రభుత్వానికి అదనపు బలంగా పరిణమించింది. తామేం చేసినా ప్రజలు సహకరిస్తారనే గుడ్డి నమ్మకానికి కేంద్రం వచ్చేసింది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
అయితే.. ఆ విధంగానే వ్యవసాయ చట్టాలు రూపుదిద్దారు. దేశంలోని అధిక రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. లోక్ సభలో స్పష్టమైన మెజార్టీ ఉంది. రాజ్యసభలోనూ ఓటింగ్ లేకుండా చాణక్యం ప్రదర్శించారు. కానీ.. ప్రత్యక్షంగా బాధితులైన రైతులే రోడ్డెక్కి అవరోధాలను అధిగమించి ఆందోళనకు దిగారు. ప్రతిపక్షాలు రైతులకు మద్దతుగా రంగంలోకి దిగాయి. రాష్ట్రాలన్నీ క్రమేపీ కదులుతున్నాయి. ఈ వాతావరణాన్ని కేంద్రం ఊహించలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి దడ పుట్టిస్తున్న అంశమిదే. 20 సంవత్సరాలుగా ఈ చట్టాలపై ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయంటూ కేంద్రం చెబుతోంది. తాము ఆ నిర్ణయాన్ని అమలు చేశామంటోంది. అన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయంటే ఎంతటి క్లిష్టత దాగి ఉందో అర్థమవుతోంది. పైపెచ్చు అన్ని పార్టీలు, ప్రభుత్వాలు ఈ చట్టాల రూపకల్పనపై చర్చించాయంటున్నారు. అదే నిజమైతే వాటన్నిటిని కలుపుకుని పోవడానికి ముందస్తుగా చర్చలు జరపడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.