Visakhapatnam: నిన్నటి వరకు వరదలు, తుఫానులతో ఆంధప్రదేశ్ రాష్ట్రం అతలాకుతమైంది. వీటి నుంచి తెరుచుకునేలోపు ‘జవాద్’ తుఫాను ఉత్తరాంధ్రను ముంచెత్తబోతుందనే ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం సైతం జనాలను తరలించే ఏర్పాట్లు చేసింది. తుఫానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్నిరకాలుగా సిద్ధమైంది.

అయితే తుఫాను తన దిశ మార్చుకోవడంతో ఉత్తరాంధ్రకు పెద్దగండం తప్పింది. దీంతో జగన్ సర్కారుతోపాటు ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే సముద్రుడు విశాఖలో ముందుకు రావడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. దీంతో విశాఖకు మరో ప్రమాదం పొంచి ఉందనే ప్రచారం జరుగుతుండటంతో ప్రభుత్వంతోపాటు విశాఖవాసులంతా అలర్ట్ అవుతున్నారు.
విశాఖలోని ఆర్కే బీచ్ లో సముద్రం ఈరోజు బాగా ముందుకొచ్చింది. ఈక్రమంలోనే ఆర్కే బీచ్ లోని చిల్ట్రన్స్ పార్క్ వద్ద రెండు వందల అడుగుల మేర భూమి కోతకు గురైంది. ఒక అడుగు మేర భూమి కుంగిపోయింది. పార్క్ కు సమీపంలో అక్కడక్కడ పది అడుగుల మేరకు భూమి కుంగిపోయి దృశ్యాలు కన్పిస్తున్నాయి. దీంతో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది.
సముద్రం ప్రాంతమంతా కోతకు గురవుడంతో పార్క్ లోని ప్రహారీ గోడ, కూర్చోనే బల్లలన్నీ విరిగిపోయాయి. బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు ఉన్న ప్రాంతం కోతకు గురికావడంతో ఆర్కే బీచ్ దగ్గర పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోకి పర్యాటకులను ఎవరికీ కూడా అనుమతించడం లేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సముద్రం తీరంలో ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. అయితే విశాఖలో గతంలో ఎన్నడూ లేనివిధంగా సముద్రం బాగా ముందుకొస్తుంది. పది అడుగుల లోతులో భూమి కోతకు గురవుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో విశాఖను రాజధానిగా ప్రకటించడం సైతం ఏపీకి ఏమాత్రం మంచిది కాదనే వాదనలు విన్పిస్తున్నాయి. దీనిపై సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో వేచిచూడాల్సిందే..!