Adasso Kapesa: అమె ఓ మహిళ.. ఈశాన్య రాష్ట్రంలో పుట్టింది. అభివృద్ధికి దూరంగా ఉండే ఈ రాష్ట్రంలోనే చదువుకుంది. ఉన్నత చదువులతో ఎస్పీజీకి ఎంపికైంది. మహిళా ఆఫీసర్‌గా ఎదిగి ఇప్పుడు ఏకంగా ప్రధాని సెక్యూరిటీలో మహిళా ఆఫీసర్‌గా విధుల్లో చేరింది. ఎంతో మంది మహిళకు స్ఫూర్తిగా నిలిచిన ఈ మహిళా ఆఫీసర్‌ఫేరు ఆదాసో కపేసా. భారతదేశ ప్రధానమంత్రి భద్రత కోసం అత్యంత కట్టుదిట్టమైన బాధ్యతలు నిర్వహించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ)లో తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించింది. మణిపుర్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి ఈ ఉన్నత స్థానానికి చేరుకున్న ఆమె ప్రయాణం, నిరంతర కృషి, సమర్థత, అసాధారణ ధైర్యానికి నిదర్శనం.
Also Read: రచ్చ రంబోలా.. నాని ప్యారడైజ్ తో ఏదో చేసేలా ఉన్నాడే..!
మణిపుర్ నుంచి ఎస్పీజీ వరకు..
మణిపుర్‌లోని సేనాపతి జిల్లాలో ఉన్న చిన్న గ్రామం కైబీ. ఈ గ్రామానికి చెందిన అదాసో కపేసా, సశస్త్ర సీమా బల్(ఎస్‌ఎస్‌బీ)లో ఇన్‌స్పెక్టర్(జనరల్ డ్యూటీ)గా తన వృత్తిని ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్‌లో 55వ బెటాలియన్‌లో సేవలు అందించిన ఆమె, తన అసాధారణ పనితీరుతో ఎస్పీజీలో డిప్యూటేషన్‌కు ఎంపికయ్యారు. ఎస్పీజీలో చేరడం అంటే కేవలం శారీరక సామర్థ్యం మాత్రమే కాదు, యుద్ధ మెలకువలు, వ్యూహాత్మక నిఘా, హై–సెక్యూరిటీ ప్రొటోకాల్ నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యం వంటి అనేక కఠిన పరీక్షలను ఆమె దాటాల్సి ఉంటుంది. ఈ కఠినమైన శిక్షణలో ఆమె తన సమర్థతను నిరూపించుకుని, దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక భద్రతా బృందంలో స్థానం సంపాదించారు.
ఎస్పీజీలో చరిత్రాత్మక మైలురాయి..
1985లో భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య తర్వాత ఏర్పాటైన ఎస్పీజీ, దేశంలో అత్యంత శక్తివంతమైన, కట్టుదిట్టమైన భద్రతా బలగంగా పేరుగాంచింది. ఈ బృందంలో ఇప్పటివరకు పురుషులు మాత్రమే ఆధిపత్యం వహించారు. అయితే, అదాసో కపేసా ఈ సంప్రదాయాన్ని ఛేదించి, తొలి మహిళా కమాండోగా చరిత్ర సృష్టించారు. ఆమె ఈ స్థానాన్ని సాధించడం కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, భారత భద్రతా బలగాల్లో లింగ సమానత్వం వైపు ఒక ముఖ్యమైన అడుగు. ప్రధానమంత్రి మోదీ బ్రిటన్ పర్యటనలో ఆమె నిర్వహించిన విధులు, ఈ ఘనతను మరింత స్పష్టం చేశాయి.
ఎస్పీజీ ప్రత్యేకతలు..
ఎస్పీజీ అనేది సాధారణ భద్రతా బలగం కాదు. ప్రధానమంత్రి, కొన్ని సందర్భాల్లో మాజీ ప్రధానమంత్రులు, వారి కుటుంబాల భద్రతను నిర్వహించే ఈ బృందం, శారీరక శిక్షణతోపాటు మానసిక స్థైర్యం, వ్యూహాత్మక ఆలోచన, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన వంటి ఉన్నత ప్రమాణాలను డిమాండ్ చేస్తుంది. అదాసో కపేసా ఈ అన్ని సవాళ్లను అధిగమించి, ఈ బృందంలో స్థానం సంపాదించడం ఆమె సామర్థ్యానికి నిదర్శనం. ఈమే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరింత మంది మహిళలు ఇందులోకి వచ్చే ప్రయత్నం చేయవచ్చు.