HomeతెలంగాణMP Raghunandan Rao Threatening Calls: మెదక్‌ ఎంపీకి ఆగని బెదిరింపులు.. అగంతకులను గుర్తించిన పోలీసులు?

MP Raghunandan Rao Threatening Calls: మెదక్‌ ఎంపీకి ఆగని బెదిరింపులు.. అగంతకులను గుర్తించిన పోలీసులు?

MP Raghunandan Rao Threatening Calls: తెలంగాణకు చెందిన ఓ ఎంపీకి మూడు నెలలుగా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. అంతకు ముందు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కూడా ఇలాగే బెదిరింపు కాల్స్‌ వచ్చేవి. ఫోన్‌ చేసిన అగంతకులు ఇద్దరికీ చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడ రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్‌ తగ్గాయి. మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావుకు పెరిగాయి మూడు నెలల్లో ఆరుసార్లు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. గతంలో రాజాసింగ్‌కు ఫోన్‌ చేసిన అగంతకులను పోలీసులు పట్టుకోలేదు. ఆయనకు దుబాయ్‌ నుంచి కాల్స్‌ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కానీ, ఎవరినీ పట్టుకోలేదు. ఇక మెదక్‌ ఎంపీకి వస్తున్న బెదిరింపు కాల్స్‌ మధ్యప్రదేశ్‌ నుంచి వస్తున్నట్లు మాత్రం గుర్తించారు. కానీ, ఇప్పటి వరకు ఎవరినీ పట్టుకోలేదు. దీంతో అగంతకులు రెచ్చిపోతున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోనే ఉన్నామని, సాయంత్రం వరకు చంపేస్తామని హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరినీ పట్టుకోలేదు. తెలంగాణ పోలీసులు లేదా కేంద్ర నిఘా సంస్థలు దుండగులను గుర్తించడంలో విఫలమవుతున్నాయి. అత్యాధునిక సాంకేతికత, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లు అందుబాటులో ఉన్నా దుండగులను గుర్తించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

Also Read: రచ్చ రంబోలా.. నాని ప్యారడైజ్ తో ఏదో చేసేలా ఉన్నాడే..!

బెదిరింపుల నేపథ్యం..
రఘునందన్‌ రావు గత జూన్‌ నుంచి ఆరు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. వీటిలో కొన్ని మావోయిస్టుల పేరుతో వచ్చాయి. ఈ కాల్స్‌లో దుండగులు ఆయనను సాయంత్రం లోగా చంపేస్తామని, హైదరాబాద్‌లోనే ఉన్నామని బెదిరించారు. కొన్ని సందర్భాల్లో, ఆంధ్రప్రదేశ్‌ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు ఐదు బృందాలు ఆయనను లక్ష్యంగా చేసుకున్నాయని కూడా చెప్పారు. ఈ బెదిరింపులు ఛత్తీస్‌గఢ్‌లోని ఆపరేషన్‌ కాగర్‌కు ప్రతీకారంగా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే, ఈ కాల్స్‌ వెనుక నిజమైన ఉద్దేశం లేదా గుర్తింపు ఇంతవరకు స్పష్టంగా తెలియలేదు.

పోలీసుల వైఫల్యం ఎందుకు?
తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, అత్యాధునిక సాంకేతికతను పోలీసులకు అందుబాటులోకి తెచ్చినప్పటికీ, ఈ కేసులో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. కాల్స్‌ మధ్యప్రదేశ్‌ నుంచి వస్తున్నట్లు గుర్తించినప్పటికీ, దుండగులను ట్రేస్‌ చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. కాల్స్‌ ఇంటర్నెట్‌ ఆధారిత సేవల ద్వారా వస్తున్నాయని, దీనివల్ల దుండగుల వివరాలను గుర్తించడం కష్టమవుతోందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్‌ పోలీసుల మధ్య సమన్వయం సరిగా లేదని తెలుస్తోంది. కొందరు ఈ వైఫల్యం వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చని, దుండగులను కావాలనే పట్టుకోవడం లేదని అనుమానిస్తున్నారు.

ఎంపీకి అదనపు భద్రత..
బెదిరింపుల నేపథ్యంలో రఘునందన్‌ రావుకు పోలీసులు భద్రతను కల్పించారు. సాయుధ సిబ్బంది, ఎస్కార్ట్‌ వాహనం అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ, వరుస బెదిరింపులు ఆయన అనుయాయులు, పార్టీ కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనలు రాజకీయ నాయకుల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా, ఒక ఎంపీకి వస్తున్న బెదిరింపులను నియంత్రించలేనప్పుడు సామాన్య పౌరుల భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version