Gautam Adani: ఏపీలో రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. అందులో ఒక స్థానం అదానీ సంస్థల అధినేత గౌతం అదానీకి కానీ..ఆయన భార్య ప్రీతి అదానీకి కానీ కేటాయిస్తారన్న ప్రచారం సాగింది. అయితే ఇందుకు వైసీపీ ఒక షరతు పెట్టినట్టు తెలుస్తోంది. పార్టీ సభ్యత్వం స్వీకరిస్తేనే రాజ్యసభ సీటు కేటాయిస్తామన్న షరతుకు అదానీ సంస్థ అధినేత తిరస్కరించినట్టు సమాచారం. అయితే గతంలో రిలయన్స్ దిగ్గజాల కోటాలో పరిమళ నత్వానికి రాజ్యసభ స్థానం కేటాయించారు. అప్పట్లో నత్వాని పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ కండువాతోనే నామినేషన్ దాఖలు చేశారు. నియామక పత్రాలు అందుకున్నారు. అదానీ విషయంలో కూడా అలాగే చేయాలని వైసీపీ అధిష్టానం భావించింది. కానీ రాజకీయ పార్టీల తరుపున రాజ్యసభ స్థానం వద్దని అదాని తిరస్కరించారు.
తమకు ఏ పార్టీతో సంబంధం లేదని కూడా అదానీ సంస్థ తరుపున ప్రత్యేక ప్రకటన సైతం జారీచేశారు. దీంతో ఏపీలో పారిశ్రామికవేత్త కోటా రాజ్యసభ సీటు విషయంలో ఖాళీ ఉండిపోయింది. ఇప్పటికే జగన్ మూడు రాజ్యసభ్య స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం. ఆ ఒక్క సీటు మాత్రం ఖాళీగా ఉంచారు. పారిశ్రామికతవేత్తల కోటలో మైహోమ్ సంస్థల అధినేత నాగేశ్వరరావుకు కేటాయిస్తారన్న ప్రచారం సాగుతోంది. కానీ అక్కడ కూడా స్పష్టత లేదు. మరోవైపు ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారన్న ప్రచారమూ ఉంది. కేంద్ర పెద్దల అవసరం ఇప్పుడు జగన్ కు కీలకం. అందుకే వారి ప్రాపకానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. అటు కేసుల అవసరంతో పాటు రాజకీయ అవసరాలున్నాయి. అందుకే జగన్ బీజేపీ పెద్దల విషయంలో అచీతూచీ వ్యవహరిస్తున్నారు.
బీజేపీ కోసమేనా..
అయితే ఏపీ నుంచి ఒక రాజ్యసభ స్థానాన్ని మంత్రి సురేష్ ప్రభుకు కేటాయిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ, టీడీపీ అలయెన్స్ ఉన్నప్పుడు అప్పట్లో రాజ్యసభ స్థానాన్ని అప్పటి రైల్వేమంత్రి సురేష్ ప్రభుకు కేటాయించారు. అప్పట్లో రెండు పార్టీల మధ్య సన్నిహితం ఉండేది. సర్దుబాటులో బీజేపీ అడగడం, టీడీపీ ఒప్పుకోవడం చకచక జరిగిపోయింది. అయితే ప్రస్తుతం సురేష్ ప్రభు పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానాన్ని రెన్యూవల్ చేయడం అనివార్యంగా మారింది. దీంతో బీజేపీ అడగకుండానే వైసీపీ ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. కానీ దీనిపై రెండు పార్టీల్లో స్పష్టత లేదు. బీజేపీ అడుగుతుందని వైసీపీ… వైసీపీ ఇస్తేనే ఆలోచిద్దామని బీజేపీ…ఇలా ఇరు పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం సంఖ్యాబలం బట్టి ఎదో రాష్ట్రం నుంచి సర్దుబాటు చేసుకునే వెసులబాటు బీజేపీకి ఉంది. అయితే రాజ్యసభలో సీట్ల సంఖ్య పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే వైసీపీ ఏపీ నుంచి సీటు కేటాయిస్తే తీసుకోవాలని భావిస్తోంది. అయితే ఇదే అదునుగా వైసీపీ నేతలు గొంతెమ్మ కోరికలు కోరుతారని బీజేపీ భయపడుతోంది. మరోవైపు వైసీపీ అవినీతి మరక అంటుందని ఆందోళన చెందుతోంది. ఒక వేళ రాజ్యసభ సీటు తీసుకుంటే బీజేపీ, వైసీపీ ఒకటేనన్న భావన నెలకొంటుందని.. విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి ఉంటుందని భావిస్తోంది. అందుకే కొద్దిరోజులు గుంభనంగా వ్యవహరించాలని బీజేపీ నిర్ణయించినట్టు సమాచారం.
కసరత్తు షురూ..
మరోవైపు వైసీపీ అధిష్టానం ఒక సీటును రిజర్వ్ లో ఉంచి ..మిగతా మూడు సీట్ల భర్తీని ఒక కొలిక్కి తెచ్చింది. అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లుగా ప్రచారం నడుస్తోంది. విజయసాయిరెడ్డిని మరోసారి రాజ్యసభకు పంపించనున్నారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావును ఎంపిక చేయనున్నారు. నాలుగో అభ్యర్థి కూడా ఖరారవగానే అందరి పేర్లను ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మరోవైపు వైసీపీలో సైతం రాజ్యసభ స్థానాల ఎంపిక పెద్ద దుమారాన్నే దారితీస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కాకుండా కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యమిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. బీద మస్తాన్ రావు గత సర్వత్రిక ఎన్నికల తరువాత టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. క్రుపారాణి సైతం గత ఎన్నిక ముందే చేరారు. పార్టీ ప్రారంభం నుంచే జెండా మోసిన నాయకులకు కాదని ఇలా కొత్తగా చేరిన వారికి పదవులు కేటాయించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.
Also Read:India Weather Report 2022: దేశ చరిత్రలోనే ఇదో అసాధారణ వాతావరణం.. ఏం జరుగుతోంది?
Recommended Videos: