Gautam Adani: మొన్న ఎన్డిటీవీలో పాగా వేశాడు. నిన్న అల్ట్రాటెక్ సిమెంట్ లో అడుగు పెట్టాడు. నేడు వందల ఏళ్ల వ్యాపార సామ్రాజ్యం టాటా కంపెనీని దాటేశాడు. ఇక మునుముందు ఎలన్ మస్క్ కే గురిపెడతాడేమో.. అలా ఉంది మరి అదాని సంపాదన. అత్యంత విలువైన వ్యాపార గ్రూపుల్లో అదాని కంపెనీ టాటా గ్రూపును వెనక్కి నెట్టేసింది. 22.25 లక్షల కోట్లకు అదానీ కేట్ క్యాప్ చేరుకుంది. హల్సీమ్ నుంచి కొనుగోలు చేసిన ఎసిసి, అంబుజా సిమెంట్స్ సహా అదాని గ్రూప్ పరిధిలోని తొమ్మిది లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటల్లైజేషన్ శుక్రవారం నాటికి 22.25 లక్షల కోట్లకు చేరుకుంది. కాగా టాటా గ్రూప్ లోని 27 లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 20. 81 లక్షల కోట్లుగా నమోదయింది. దీంతో ఈ గ్రూప్ రెండో స్థానానికి జారుకుంది. 17.07 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో స్థానంలో కొనసాగుతోంది. కోవిడ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించింది. పైగా మాంద్యం భయాలు, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల నెలకొన్న అనిచ్చిత పరిస్థితుల వల్ల ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, రూపర్డ్ మర్దోక్, బిల్ గేట్స్ వంటి వారు తమ సంపదలో సుమారు 6 లక్షల కోట్ల వరకు కోల్పోయారు. కానీ ఇదే సమయంలో అదానీ సంపాదన 10 లక్షల కోట్లకు పెరిగింది. ఎసిసి, అంబుజా సిమెంట్స్ కొనుగోలు ప్రక్రియ పూర్తి కావడంతో అదాని గ్రూప్ తిరుగులేని శక్తిగా అవతరించింది. వాస్తవానికి ఈ రెండు కంపెనీలను మినహాయించినా గ్రూప్ మార్కెట్ క్యాప్ ఈ ఏడాదిలో పది లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఇదే సమయంలో టాటా గ్రూప్ 2.57 లక్షల కోట్ల మార్కెట్ సంపదను కోల్పోయింది. టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ లో సగానికి పైగా వాటా కలిగిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్లు ఈ ఏడాది 17 శాతానికి పైగా క్షీణించాయి. దేశంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో మాత్రం 16.91 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ తో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ విలువ 11 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. అదాని గ్రూపులో అత్యంత విలువైన కంపెనీ అదాని ట్రాన్స్మిషన్. దీన్ని మార్కెట్ క్యాప్ 4.57 లక్షల కోట్లకు చేరుకుంది.

అది వాపా లేక బలుపా
ఈ ఏడాది షేర్ మార్కెట్లో అదాని గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా ఎగబాకాయి. ముఖ్యంగా అదాని పవర్ షేర్ 3.9 రెట్లు, అదాని ట్రాన్స్మిషన్ 2.4 రెట్లు వృద్ధి చెందాయి. మరో నాలుగు కంపెనీలు కూడా రెట్టింపయ్యాయి. అదాని గ్రూపులోనే విల్మర్ అనే కంపెనీ మార్కెట్లో లిస్ట్ అయింది. గ్రూపు విస్తరణ, ప్రణాళికలపై భారీ అంచనాలతోనే అదాని గ్రూప్ షేర్ల విలువ పెరుగుతోందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అదా నీ టోటల్ గ్యాస్ ప్రైస్ టు ఎర్నింగ్ నిష్పత్తి 700 రెట్లకు పైగా స్థాయిలో ఉండగా, అదాని ఎంటర్ప్రైజెస్, అదాని ట్రాన్స్మిషన్ 400 రెట్లకు పైగా అధిక స్థాయిలో ట్రేడ్ అవుతుండడం వ్యాపార వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టిసిఎస్ పీఈ రేషియో 30 రెట్ల లోపే ఉంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏసీసీ, అంబుజా సిమెంట్స్ మినహాయించి అదా నీ గ్రూపులోని మిగతా ఏడు కంపెనీల మొత్తం ఆదాయం 2.02 లక్షల కోట్లు. దీనిపై వచ్చిన నికర లాభం 13, 423 కోట్లుగా ఉంది. టాటా గ్రూపు లిస్టెడ్ కంపెనీలు మొత్తం 8.6 లక్షల కోట్ల ఆదాయంపై 74,523 కోట్ల లాభాన్ని ప్రకటించాయి. అదే సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ 7.4 లక్షల కోట్ల ఆదాయంపై 60,705 కోట్ల లాభం గడించింది. ఈ ప్రకారం చూసుకుంటే టాటా కంపెనీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మెరుగైన లాభాలు సాధించినట్లు లెక్క.
బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో రెండో స్థానానికి గౌతమ్ అదాని

ప్రపంచ శ్రీమంతుల జాబితాలో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ను వెనక్కి నెట్టి గౌతమ్ అదాని రెండో స్థానానికి చేరుకున్నాడు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ రియల్ టైం ఇండెక్స్ ప్రకారం సెప్టెంబర్ 17 నాటికి అదానీ గ్రూప్ అధిపతి వ్యక్తిగత ఆస్తి 11.76 లక్షల కోట్లకు చేరుకుంది. కాగా అమెజాన్ చీఫ్ సంపాదన కూడా అదే స్థాయిలో నమోదయింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అదాని నెట్ వర్త్ 7,030 కోట్ల డాలర్ల మేర పుంజుకోగా.. అమెజాన్ చీఫ్ 4,550 కోట్ల డాలర్ల సంపదను కోల్పోయారు. ఇక ఇదే సమయంలో విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ 26,400 కోట్ల డాలర్ల ఆస్తితో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఇక భారత దేశంలో రెండవ అతిపెద్ద ధనవంతుడైన ముఖేష్ అంబానీ 8,870 కోట్ల డాలర్ల నెట్ వర్త్ తో బ్లూమ్ బర్గ్ ప్రపంచ బిలియనీర్స్ ఇండెక్స్ లో పదవ స్థానంలో కొనసాగుతున్నారు. అయితే 2014 నుంచి గౌతమ్ అదానికి సంబంధించిన సంపాదన అంతకంతకు పెరుగుతోంది. ఇదే సమయంలో కంపెనీ పవర్, పోర్ట్, సిమెంట్, లాజిస్టిక్స్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడంతో గణనీయమైన లాభాలు గడిస్తోంది. మరీ ముఖ్యంగా కోవిడ్ సమయంలోనూ అదానికి చెందిన కంపెనీలు మామూలు సమయాల్లో కంటే ఎక్కువ వృద్ధి సాధించడం గమనార్హం.