Actor Vishal: తెలుగు నాట ఇటీవల ఓ వార్త చక్కెర్లు కొట్టింది. సోషల్ మీడియాలో తెగ హడావుడి చేసింది. తమిళ హీరో విశాల్ ఏపీ రాజకీయాల్లో అరంగేట్రం చేస్తారని తెగ టాక్ నడిచింది. అదీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబుపై కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారన్నది దీని సారాంశం. దీనిపై వైసీపీ సోషల్ మీడియా విభాగంగా తెగ ట్రోల్ చేసింది. చంద్రబాబును ఓడించడానికి విశాల్ ను బరిలో దింపుతున్నట్టు.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు చుక్కలు కనిపించడం ఖాయమని కూడా వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానించాయి. విశాల్ తమిళ సినిమారంగంలో రాణిస్తున్న యువ కథానాయకుడు అక్కడి తమిళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నడిగర్ సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో బీజగా ఉన్నారు. అటువంటి వ్యక్తి ఏపీ రాజకీయాల్లో ఎందుకు వస్తాడన్నది ప్రశ్న. అందునా విపక్ష నేత, సీనియర్ నాయకుడు చంద్రబాబుపై ఎందుకు పోటీ దిగుతారన్నది అందరి అనుమానం. విశాల్ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు. ఆయన తండ్రి పేరు జీకే రెడ్డి, సినిమా నిర్మాత, ఆపై పారిశ్రామికవేత్త. కుప్పం ప్రాంతంలో గ్రానైట్ పరిశ్రమలున్నాయి. అటు రెడ్డి సామాజికవర్గం కావడం, సినిమా హీరో కావడంతో చంద్రబాబుపై పోటీకి దిగితే మంచి ఫలితముంటుందని వైసీపీ నేతలు భావించారు. అందుకే కుప్పం అభ్యర్థి విశాల్ అంటూ తెగ ప్రచారం చేయించడం ప్రారంభించారు. గత కొన్నిరోజులుగా తెలుగురాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా ఇదే హాట్ టాపిక్ గా మారింది. అటు తమిళ సినీ రంగం వారు కూడా ఈ వార్తపై ఆరాతీయడం ప్రారంభించారు.

అవకాశమే లేదు..
అయితే దీనిపై హీరో విశాల్ స్పందించారు. సంచలన ప్రకటన చేశారు. ఏపీ రాజకీయాల్లోకి తాను వస్తున్నట్టు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. అది నా ప్రమేయం లేకుండా వచ్చిన వార్తగా చెప్పుకొచ్చారు. తాను సినిమా రంగంలో బీజీగా ఉన్నానని..రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదన్నారు. చంద్రబాబుపై పోటీ అంటూ ప్రచారం చేస్తున్నారని.. అందులో ఏమాత్రం నిజం లేదన్నారు. వైసీపీ నేతలెవరూ తనను సంప్రదించలేదని.. అదంతా ఊహాగానమేనంటూ కొట్టి పారేశారు.
Also Read: Janasena:‘కియా’ భూస్కాంను తవ్వి తీస్తున్న జనసేన..
ఈ వార్త ఎలా వచ్చిందో తెలియదని.. ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని అభిమానులకు, తెలుగు, తమిళ ప్రజలకు విన్నవించారు. తన వ్యక్తిగత ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. దీంతో చంద్రబాబుపై విశాల్ పోటీకి దిగుతారన్న వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి. వైసీపీ నేతలంతా సమన్వయంగా పనిచేస్తే రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలను గెలుపొందడం అంత కష్టమేమీ కాదని.. కుప్పం మునిసిపాల్టీలో గెలుపొందలేదా? అని జగన్ ఇటీవల పార్టీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో పార్టీ అధినేత జగన్ చంద్రబాబు విషయంలో గట్టిగానే ఆలోచిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించి తీరుతారని వైసీపీ శ్రేణులు గంటాపథంతో చెప్పుకొస్తున్నాయి. అందులో భాగంగా తమిళ హీరో విశాల్ ను ఎంపిక చేశారని సంబరపడ్డారు. కానీ విశాల్ ప్రకటన వచ్చాక వారి ఆశలు నీరుగారిపోయాయి.

తెలుగు సినీ ప్రముఖులు లేరా?
చంద్రబాబును ఓడించాలంటే తమిళ సినీ ప్రముఖులే ఎందుకున్న ప్రశ్న ఉత్పన్నమైంది. జగన్ కు అవసరమైతే సాయం చేసే వారు తెలుగు సినిమా రంగంలో అనేక మంది ఉన్నారు. మోహన్ బాబు, నాగార్జున, పోసాని క్రిష్ణమురళి, అలీ వంటి వారు ఉండగా విశాల్ అవసరం ఎందుకొచ్చిందన్న ప్రశ్న తెలుగునాట ఉత్పన్నమైంది. నోరు తెరిస్తే చంద్రబాబును విమర్శించే మోహన్ బాబు ఉన్నారు. తెర వెనుక మంచి స్నేహితుడిగా మెలిగిన నాగార్జున ఉన్నారు. వీరిద్దరూ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారే. వీరు కుప్పంలో బరిలో దిగేందుకు పనికి రారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీరిని వదిలేసి విశాల్ ను బరిలో దించడం ఏమిటన్న టాక్ నడుస్తోంది. జగన్ తలచుకుంటే ఎవరినైనా గెలిపించగలరన్న నమ్మకం వైసీపీ శ్రేణులది. కానీ తెలుగు సినీ ప్రముఖులను వదిలి తమిళం వారిని తెరపైకి తేవడం ఏమిటన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
Also Read:J-Brand Liquor: ఆ బ్రాండ్ మద్యంలో విషపదార్థాలు.. మల్లగుల్లాలు పడుతున్న ఏపీ సర్కారు
[…] […]