సినీ విమర్శకుడు, నటుడు, దర్శకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. విజయవాడ నుంచి చిత్తూరు వెళ్తున్న క్రమంలో నెల్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే.. ఆయన మరణంపై పలువురు సందేహాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. ప్రముఖ హాస్యనటుడు 30 ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూకు హాజరైన పృథ్వి.. కత్తిమహేష్ మరణంపై స్పందించారు. కత్తి మహేష్ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పృథ్విరాజ్ వైసీపీలో చేరి, ఆ పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. ఇదే సమయంలో కత్తి మహేష్ కూడా తనతో కలిశాడని, ఇద్దరం కలిసి పలు ప్రాంతాల్లో ప్రచారం కూడా చేశామని చెప్పారు. ఈ సమయంలోనే తమ మధ్య స్నేహం బలపడిందని తెలిపాడు పృథ్వి.
అయితే.. కత్తి మహేష్ పై జరుగుతున్న ట్రోలింగ్ గురించి ఒకసారి ఆయనతో మాట్లాడినట్టు చెప్పారు. ఇంత ట్రోలింగ్, ఇన్ని వివాదాలు ఎందుకు అని ప్రశ్నిస్తే.. మనం యుద్ధం చేస్తున్నామని, యుద్ధం చేసేవాడు కత్తి పట్టుకుని ఉండాలని కత్తి మహేష్ అన్నారట. లేదంటే.. అవతలి వాళ్లు వచ్చి తల తీసుకుపోతారని చెప్పారట. అందుకే.. తాను ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటానని అన్నారట కత్తి మహేష్.
ఈ విధంగా కత్తి మహేష్ కు సంబంధించిన పలు విషయాలు పంచుకున్న పృథ్వి.. ఆయన మరణంపై సందేహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడుపుతున్న వ్యక్తికి ఎలాంటి గాయాలూ కాకపోవడం.. కత్తి మాత్రం తీవ్రంగా గాయపడి, ప్రాణాలు కోల్పోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
కత్తి మహేష్ మొత్తం మూడు పార్టీలకు వ్యతిరేకంగా ఉండేవాడని, మరి ఏమైందో ఆ భగవంతుడికే తెలియాలని తన అనుమానాన్ని వ్యక్తం చేశారు పృథ్వి. ఇప్పటి వరకు కత్తి మహేష్ ఏమీ సంపాదించుకోలేదని, ఆయన ఇప్పడిప్పుడే సెటిల్ అవుతున్న సమయంలోనే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహేష్ మరణంపై పృథ్విరాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది.