Telugu Daily News Papers : ఆ మధ్య తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు చాలా వరకు పత్రికలు 1, 3, 5, 7 పేజీలలో మాస్టర్ హెడ్లతో వార్తలను ప్రచురించాయి. వాస్తవానికి జర్నలిజం ప్రమాణాల ప్రకారం ఒక పత్రికకు ఒకటే ఫస్ట్ పేజీ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో అడ్డగోలుగా యాడ్స్ రావడంతో.. ఫస్ట్ పేజీ టారిఫ్ కోసం యాజమాన్యాలు నానా గడ్డీ కరిచాయి. ఏకంగా పేజీలకు పేజీలు ఫస్ట్ పేజీలను ప్రచురించాయి. మాస్టర్ హెడ్ తో కూడిన ఫస్ట్ పేజీ పత్రికకు తలకాయతో సమానం. కానీ ఆ తలకాయను యాడ్స్ బిస్కెట్స్ కోసం యాజమాన్యాలు అడ్డగోలుగా తాకట్టు పెడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే మాస్టర్ హెడ్ ను కిందికి దించుతున్నాయి. పైగా ప్రింట్ ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. అధికారంలో ఉన్న పెద్దలు సన్నిహితులు కావడంతో పత్రికా యజమానులు ఎలాంటి పనులు చేసినా సాగిపోతోంది. ఇటీవల ఓ పత్రిక దాదాపు 7 దాకా ఫస్ట్ పేజీలను ముద్రించింది. అందులో వార్తలు ఉన్నాయా అంటే.. పెద్దగా లేవు. అందులో మొత్తం జాకెట్, మినీ జాకెట్ యాడ్స్ ఉన్నాయి. పైగా కార్పొరేట్ కంపెనీలవి కావడంతో.. ఆ పత్రిక యాజమాన్యం జర్నలిజం ప్రమాణాలను నిస్సిగ్గుగా తాకట్టు పెట్టింది. అడ్డగోలుగా ఫస్ట్ పేజీలను ప్రచురించి భారీగా డబ్బులు దండుకుంది.
ప్రింట్ మీడియాలో జాకెట్ యాడ్ కు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మాస్టర్ హెడ్ కింద ప్రచురితమైన ప్రకటనకు విలువ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి ప్రకటనలను కంపెనీలు లేదా సంస్థలు మాస్టర్ హెడ్ కింద ఇవ్వడానికి ఇష్టాన్ని చూపిస్తాయి. ఎందుకంటే ఒక పాఠకుడు పేపర్ తీయగానే మాస్టర్ హెడ్ కనిపిస్తుంది. దీంతో అతని దృష్టి మొత్తం మాస్టర్ హెడ్ కింద ఉంటుంది. అందువల్లే కంపెనీలు ఫస్ట్ పేజీలో యాడ్స్ ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తుంటాయి.. అయితే దీనిని క్యాష్ చేసుకోవడానికి యాజమాన్యాలు ఎన్నో రకాలుగా ఎత్తులు వేస్తున్నాయి. జర్నలిజం ప్రమాణాల ప్రకారం ఒక పత్రిక ఒకటి కంటే ఎక్కువ ఫస్ట్ పేజీలను ప్రింట్ చేయకూడదు. అయితే ఆదాయాన్ని పెంచుకోవడంపై ఆసక్తి ఉన్న యాజమాన్యాలు వాటిని పట్టించుకోవడం లేదు. నిబంధనలను ఇలా తుంగలో తొక్కుతున్న యాజమాన్యాలు.. ఉదయం లేస్తే మాత్రం నీతులను తెగ చెబుతుంటాయి. తమ పత్రికల్లో తాటికాయ పరిమాణంలో అక్షరాలతో ప్రచురిస్తుంటాయి. ఇక యాడ్స్ కోసం రకరకాల కుప్పిగంతులు వేస్తున్న యాజమాన్యాలు.. ఉద్యోగులకు వేతనాల పెంపు విషయంలో మాత్రం ఆస్థాయి చొరవ చూపడం లేదు. తెలుగు నాట ఒక పత్రిక మినహా మీద యాజమాన్యాలు వేజ్ బోర్డ్ అమలు చేయడం లేదు. ఆ వేజ్ బోర్డు అమలు చేస్తున్న ఆ పత్రిక కూడా ఇప్పుడు కొత్త కొత్త సంస్థలను ఏర్పాటు చేసి.. పాత్రికేయులను కాంట్రాక్టు ఉద్యోగులుగా మార్చి.. హింసకు గురిచేస్తుంది. శ్రమ దోపిడికి పాల్పడుతూ.. తెలుగు నాట విలువల సూక్తులు చెబుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే పత్రికా యాజమాన్యాల ధన దాహం అంతా ఇంతా కాదు. ఇలాంటప్పుడే “పత్రికలు పెట్టుబడిదారుల విష పుత్రికలు” అనే శ్రీ శ్రీ మాటలు గుర్తుకొస్తుంటాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Actions of telugu dailies to go to any lengths for ads
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com