Kinjarapu Atchannaidu: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు కి త్వరలోనే పెద్ద షాక్ తగలననిందని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధ్యక్ష పీఠం నుంచి తప్పించడానికి తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్ష పీఠం రేసులో సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మార్పు ఇంచుమించు ఖాయమన్న టాక్ నడుస్తోంది. అచ్చెనాయుడు తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పార్టీలోనే ఓవర్గం తప్పించాలని చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.
అచ్చెనాయుడు పార్టీ అధ్యక్షుడిగా గత మూడు సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. 2020 అక్టోబర్ లో పార్టీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. సీనియర్ నేత ఎర్రన్న సోదరుడు కావడం, వాగ్దాటి ఉండడం, బీసీ నేత కావడం, దూకుడుగా ముందుకెళ్తారని పేరు ఉండడం తదితర కారణాలతో చంద్రబాబు ఆయన్ను ఎంపిక చేశారు. కానీ చంద్రబాబు ఆశించినంతగా ఆయన పని చేయలేకపోతున్నారని పార్టీలో టాక్ నడుస్తోంది. పైగా పార్టీలో వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. అంతర్గతంగా నాయకత్వంపై కొన్ని వ్యాఖ్యలు కూడా అచ్చెనాయుడు మార్పునకు కారణం. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన వైఖరిపై ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. అందుకే మార్పు అనివార్యమని నాయకత్వం ఇప్పటికే అచ్చెనాయుడుకే సంకేతాలు పంపినట్లు సమాచారం.
వాస్తవానికి తిరుపతి ఉప ఎన్నికల సమయంలో అచ్చెనాయుడు వ్యాఖ్యలు పెను దుమారానికి దారితీశాయి. ఓ కార్యకర్తలతో మాట్లాడుతూ పార్టీ లేదు.. బొక్కా లేదు అన్న కామెంట్ లోకేష్ ను ఉద్దేశించి చేసిన దేనిని ప్రచారం జరిగింది. అయినా సరే చంద్రబాబు ఆ వివాదాన్ని సర్దుబాటు చేశారు. మొన్నటికి మొన్న లోకేష్ పాదయాత్ర సమయంలో జన సమీకరణ చేయాలని అచ్చెనాయుడు ఫోన్ సంభాషణ కూడా లీక్ అయ్యింది. అది ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు నాయకత్వం భావిస్తోంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని మార్పు తప్పనిసరిగా చేయాలని పార్టీలో ఒక వర్గం గట్టిగానే డిమాండ్ చేస్తుంది.
అచ్చెనాయుడును తప్పిస్తే పార్టీ అధ్యక్ష బాధ్యతల రేసులో యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ ఉన్నట్లు తెలుస్తోంది. యనమల రామకృష్ణుడు సీనియర్ నేత కావడంతో చంద్రబాబు ఆయనవైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అదే సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నిమ్మల రామానాయుడు సైతం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈయనకు సైతం చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయని బయట ప్రచారం జరుగుతోంది. అయితే లోకేష్ మదిలో పయ్యావుల కేశవ్ ఉన్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. అందుకే ఆ మధ్యన చంద్రబాబు జైల్లో ఉండగా ప్రత్యేకంగా కేశవ్ ను పిలిపించుకుని మాట్లాడడం విశేషం. ఇలా ఎలా చూసుకున్నా ఏపీ టిడిపి అధ్యక్ష బాధ్యతలనుంచి కింజరాపు అచ్చెనాయుడును తొలగించడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఎన్నికల ముంగిట టిడిపి నాయకత్వం అంత సాహసం చేస్తుందా? లేదా? అన్నది తెలియాలి.