Tamilisai : తెలంగాణకు కేంద్రం కొత్త గవర్నర్‌ను నియమించింది. ప్రస్తుత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి సోమవారం(మార్చి 18న) రాజీనామా చేశారు. ఆమె రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. వెంటనే తెలంగాణ ఇన్‌చార్జి గవర్నర్‌గా ప్రస్తుత ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా కూడా ఆయననే నియమించారు.
ఆయనా తమిళుడే..
నిన్నటి వరకు తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై తమిళనాడుకు చెందిన నేత. బీజేపీలో 2008 నుంచి క్రియాశీలకంగా పనిచేశారు. 2019, సెప్టెంబర్‌లో తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆమె మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నారు. దీంతో గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఇక తెలంగాణకు ఇన్‌చార్జి గవర్నర్‌గా నియమితులైన రాధాకృష్ణన్ కూడా తమిళనాడుకు చెందిన నేతనే. ఆయన కూడా బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. 1998, 1999లో రెండుసార్లు కోయంబత్తూర్ నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. 2004, 2014, 2019 సాధారణ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
2023లో గవర్నర్‌గా..
ఇక కేంద్రం 2023, ఫిబ్రవరి 12న రాధాకృష్ణన్‌ను జార్ఖండ్ గవర్నర్‌గా నియమించింది. తాజాగా తెలంగాణ, పుదుచ్చేరికి ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై లోక్‌సభ ఎన్నికల్లో చెన్నై సెంట్రల్ లేదా తుత్తూకూడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.