Nandyala: ఆమె రవాణా శాఖ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. నెలవారి వేతనం పొందే ఒక ఉద్యోగి. కానీ ఆమె ఇల్లు, ఇంట్లో ఉండే వస్తువులు, బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తి పత్రాలు చూసి బైర్లు కమ్మడం అవినీతి నిరోధక శాఖ అధికారుల వంతు అయింది. ఓ సాధారణ ఉద్యోగి ఇంతలా అవినీతికి పాల్పడ్డారా? అని ఏసీబీ అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. తనిఖీ చేస్తే తరగని ఆస్తులను చూసి హైరానా కొడుతున్నారు. ఎందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
నంద్యాల రవాణా శాఖ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా సువర్ణ కుమారి పనిచేస్తున్నారు. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లా రవాణా శాఖ కార్యాలయాల్లో ఆమె పనిచేసే వారు. ప్రస్తుతం నంద్యాలలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఆమె ఇంటి తో పాటు కార్యాలయంలో దాడులు చేశారు. కర్నూలు ధనలక్ష్మి నగర్ లోని ఆమె ఇంట్లో సోదాలు జరిపారు. పది లక్షల నగదు తో పాటు 500 గ్రాముల బంగారు నగలు, 700 గ్రాముల వెండి, 15 బ్యాంకు ఖాతాలు, ఒక బ్యాంకు లాకర్, 9 ఇళ్ల స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లను గుర్తించారు. ఓ సాధారణ ఉద్యోగి కి ఇంత సంపాదన? అంటూ షాక్ కు గురయ్యారు.
ప్రస్తుతం ఏసీబీ సాదాలు కొనసాగుతున్నాయి. ఆమె పనిచేసిన పాత జిల్లాలతో పాటు బంధువుల ఇంట్లో సైతం ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విలువైన ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత ఆమె అక్రమ ఆర్జనను, ఆస్తుల వివరాలను వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అయితే రవాణా శాఖలో ఓ సామాన్య ఉద్యోగి ఈ స్థాయిలో ఆస్తులు కలిగి ఉండడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ పై ఏసీబీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.