ఏపీ రాజధానిగా చంద్రబాబు ప్రకటించిన అమరావతిని కాదని.. కొత్తగా అధికారం చేపట్టిన జగన్ మూడు పరిపాలనా రాజధానులను ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన వందకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై అప్పటి నుంచి విచారణ నడుస్తూనే ఉంది. ఇందులో స్టే ఉత్తర్వులు కాకుండా కేవలం రాజధాని తరలింపునకు సంబంధించిన పిటిషన్లను ముందుగా విచారిస్తున్న హైకోర్టు ధర్మాసనం.. ఇవాళ్టి నుంచి తుది విచారణకు సిద్ధమవుతోంది. దీంతో ఈ మూడు రాజధానుల వ్యవహారం తుది అంకానికి చేరుతోంది.
Also Read: జగన్ ఎత్తులకు చంద్రబాబు పైఎత్తులు
ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటుచేస్తూ జగన్ తెచ్చిన బిల్లుకు ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం లభించింది. ప్రభుత్వం ఆమోదించిన రెండు బిల్లులను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించేందుకు రెండు రకాలుగా హైకోర్టు ధర్మాసనం విభజించింది. స్టే ఉత్తర్వులను పక్కనబెట్టి రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. గత నెలలో సాగిన విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. దీంతో ఇవాళ్టి నుంచి రాజధాని పిటిషన్లపై హైకోర్టు తుది విచారణ ప్రారంభం కానుంది.
ఇక నుంచి ఈ పిటిషన్లపై రోజువారీగా విచారించనున్నారు. ఇవాళ ప్రధాన వాజ్యాలతో పాటు కొన్ని అనుబంధ పిటిషన్లపై విచారణ కొనసాగనుంది. హైబ్రిడ్ పద్ధతిలో విచారించనున్నారు. రెండువారాల పాటు రోజువారీ విచారణ చేపట్టేందుకు హైకోర్టు ధర్మాసనం కూడా సిద్ధం కావడంతో ఇక ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అమరావతిలో నిర్మాణాలు, వాటి కోసం చేసిన ఖర్చు వివరాలు ఇప్పటికే హైకోర్టుకు చేరాయి. వీటిపై విచారణ కూడా కీలకం కానుంది.
Also Read: ఫైర్ బ్రాండ్ రోజా ఎందుకు మౌనం పాటిస్తున్నట్లు..?
జగన్ ప్రభుత్వం విశాఖలో నిర్మించాలనుకుంటున్న గెస్ట్‌హౌస్ కమ్ సీఎం క్యాంపు కార్యాలయంపైనా ఇప్పటికే వాదనలు పూర్తికాగా.. ఆ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు కూడా ఇవాళో రేపో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ సీఎం గెస్ట్‌హౌస్‌లు ఏర్పాటు చేసే అంశంపైనా హైకోర్టు స్పష్టత ఇచ్చే అవకాశముంది. విశాఖకు రాజధాని తరలింపు ఆలస్యమైతే అక్కడే గెస్ట్‌హౌస్ నిర్మించుకుని పాలన సాగించేందుకు వైసీపీ సర్కారు సిద్ధమవుతున్న నేపథ్యంలో హైకోర్టు ఈ అంశంపై ఇచ్చే తీర్పు కీలకంగా మారింది. ఒకవేళ హైకోర్టు నుంచి అనుమతి లభిస్తే సీఎం జగన్ త్వరలోనే విశాఖకు మకాం మార్చడం ఖాయమని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్