AP Politics : సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత.. అది మనిషి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అనేక వ్యవస్థలు, చివరికి దేశాలపై కూడా దాని ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఇటీవల మాల్దీవుల మంత్రులు ఏవో వ్యాఖ్యలు చేశారని #Ban Maldives అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ ఎంతటి ప్రభావాన్ని చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయులు ఆన్ లైన్ లో ఆ యాష్ ట్యాగ్ ట్రెండ్ ద్వారా ఏకంగా మాల్దీవుల ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. ఆర్థికంగా దివాలా తీయించారు. ఈ చిన్న ఉదాహరణ చాలు సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు. అలాంటి సోషల్ మీడియా దెబ్బకు ఏపీకి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చదువుతుంటే విస్మయం అనిపిస్తున్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.
“నాకు ఇంటి పట్టా వచ్చింది. అమ్మ ఒడి అందుతోంది. ఇంకా చాలా పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోందని” ఏపీకి చెందిన గీతాంజలి అనే అమ్మాయి సోషల్ మీడియాలో ఇటీవల ఒక వీడియో పోస్ట్ చేసింది. తనే లబ్ధిదారు కావడంతో ఆ విషయాన్ని చాలా ఉత్సాహంగా చెప్పింది. అయితే దీనిని వైసిపి తనకు అనుకూలంగా ప్రచారం చేసుకోగా.. ఓ పార్టీ వ్యతిరేకంగా కామెంట్లు చేయడం మొదలుపెట్టింది. ఓ పార్టీ అనుకూల నెటిజన్లు ఆమెపై వ్యతిరేకంగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఆ కామెంట్లు తన వ్యక్తిగత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడంతో గీతాంజలి ఆత్మ న్యూనతకు గురైంది. తట్టుకోలేక రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి తరలించారు. రెండు రోజులపాటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొంది సోమవారం మృతి చెందింది.. దీంతో సోషల్ మీడియాలో #justice For Geetanjali, #WeStandWithGeetanjali అనే యాష్ ట్యాగ్ లతో వైసిపి అనుకూల నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఆమెకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన గీతాంజలి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. తెనాలి ప్రాంతంలో ఆమె తన కుటుంబంతో నివసిస్తోంది. ఆమెది పేద కుటుంబం. పైగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గతంలో ఆమె కుటుంబం ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేదట. ఇటీవల ప్రభుత్వం ఒక ఇంటి పట్టాను మంజూరు చేసింది. ఆ ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో అక్కడి అధికార పార్టీ నాయకులు ఆమెకు పట్టా అందించారు. ఇంటి పట్టా అందుకున్న తర్వాత గీతాంజలి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా గీతాంజలి మీడియాతో మాట్లాడింది.. తన ఇంటి కలను వైసిపి ప్రభుత్వం నిజం చేసిందని హర్షం వ్యక్తం చేసింది. తన పిల్లలకు అమ్మ ఒడి అందుతోందనిగర్వంగా చెప్పింది. ఇతర పథకాలు కూడా వర్తిస్తున్నాయని చెప్పింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొట్టింది. వైసిపి అనుకూల సోషల్ మీడియా విభాగాలు ఈ వీడియోను తెగ ప్రచారం చేశాయి. ఈ వీడియోకి వ్యతిరేకంగా ఓ పార్టీ అనుకూల నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. గీతాంజలి కి ప్రతికూలంగా వ్యాఖ్యలు చేశారు.
అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ గీతాంజలి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది. ఓ వర్గం పార్టీ నాయకులు, అనుకూల నెటిజన్ల కామెంట్ల వల్లే గీతాంజలి మృతి చెందిందని వైసిపి మద్దతుదారులు అంటున్నారు. గీతాంజలి మరణం వల్ల ఆమె పిల్లలు తల్లి ప్రేమకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆమె మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతున్నారు. కారణాలు ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో వేధింపుల వల్ల గృహిణి అర్ధాంతరంగా ప్రాణం కోల్పోయింది. కేవలం గీతాంజలి మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో వేధింపులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఆకతాయిలు మార్ఫింగ్ వీడియోలు రూపొందించి పోస్ట్ చేస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు.. సోషల్ మీడియా పై నిఘా లేకపోవడంతో ఇష్టానుసారంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.. దీని నివారణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఉపయోగం లేకుండా పోతున్నది.