Chenab Bridge మేఘాలపై తేలిపోనన్నది అంటూ పాట పాడుకోవచ్చు.. నిజంగానే అక్కడికి వెళితే ఈ పాటను మనం అన్వయించుకోవచ్చు. హిమాలయాల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన అయిన ‘చీనాబ్ వంతెన’ అద్భుతమైన ఫోటోలను ఇండియన్ రైల్వే షేర్ చేసింది. అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రపంచంలోనే ఇంతటి సుందరమైన ఎత్తైన బ్రిడ్జి ఇంకోటి లేదు అన్నట్టుగా ఆ ఫొటోలు కనువిందు చేస్తున్నాయి.

ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL)ప్రాజెక్ట్‌లో భాగమైన చీనాబ్ వంతెన యొక్క కొన్ని అద్భుత ఫోటోలను ఇండియన్ రైల్వేస్ ట్విట్టర్‌లో పంచుకుంది. ఆగస్ట్ 14న రియాసి జిల్లాలోని కౌరీ ప్రాంతంలో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన ఒక మైలురాయిని సాధించింది. వంతెన ఓవర్‌ఆర్చ్ డెక్ గోల్డెన్ జాయింట్‌తో పూర్తయింది. 272 కి.మీ యుఎస్‌బిఆర్‌ఎల్ ప్రాజెక్ట్‌లో 161 కిమీ పనులు దశలవారీగా ప్రారంభించబడ్డాయి. మొదటి దశ 118-కిమీ ఖాజీగుండ్-బారాముల్లా సెక్షన్ అక్టోబర్ 2009లో ప్రారంభించారు. ఆ తర్వాత 18-కిమీల బనిహాల్-ఖాజీగుండ్ జూన్ 2013లో.. 25-కిమీ ఉధంపూర్-కత్రా జూలై 2014లో ప్రారంభించబడింది.
భారతీయ రైల్వేలు పంచుకున్న ఫోటోలు చూస్తే.. మేఘాల సముద్రం మీదుగా వంతెన అద్భుతంగా ఆవిష్కృతమైంది. మేఘాలపై తేలినట్టే కనిపిస్తోంది. ఓ హాలీవుడ్ సినిమాలో చూసినట్టుగా కనువిందు చేస్తోంది. మరొక ఫోటో సూర్యుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తుండగా కింద మేఘాలు.. వాటిపైన బ్రిడ్జి ఆహ్లాదపరుస్తుంది. అన్ని ఫోటోలు ప్రకాశవంతమైన సూర్యకాంతిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ట్విట్టర్ వినియోగదారులు ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్నారు. కశ్మీర్ లో పరుచుకున్న అందాలకు.. అభివృద్ధి జోడిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ చిత్రం స్పష్టం చేస్తుందని కొనియాడుతున్నారు. “ఇది గొప్ప విజయం,” మరొక నెటిజన్ అన్నారు.
1,315 మీటర్ల పొడవున్న చీనాబ్ వంతెన ఒక ఇంజనీరింగ్ అద్భుతం. దీనిని నిర్మించిన బృందానికి అనేక సవాళ్లను విసిరింది. ఇంజనీర్లు దాని పూర్తి సమయంలో కఠినమైన భూభాగంలో.. మంచుతో కూడిన వాతావరణ పరిస్థితులను అధిగమించి దీన్ని అతికష్టంపై నిర్మించారు.
చీనాబ్ బ్రిడ్జి ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. ఇది సముద్ర మట్టం నుండి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉండడం విశేషం. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. వంతెన నిర్మాణ వివరాల కోసం అధునాతన ‘టెక్లా’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారు. అంతేకాకుండా స్ట్రక్చరల్ స్టీల్ మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు అనుకూలంగా ఉంటుందని పేర్కొంది.
A sight of the breathtakingly beautiful Chenab Bridge. pic.twitter.com/qpmaUlApCt
— Ministry of Railways (@RailMinIndia) September 13, 2022