Google Pay
Google Pay : ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తుంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, అందుటో ఇంటర్నెట్ కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫాంలు మార్కెట్ ను ఏలేస్తున్నాయి. చిన్న వీధి వ్యాపారుల నుంచి బడా బిజినెస్ మ్యాన్ ల వరకు డిజిటల్ పేమెంట్లు నిర్వహిస్తున్నారు. వాటిలో ఫోన్ పే మార్కెట్ ను ఏలేస్తుంది. దాని తర్వాత గూగుల్ పే ఉంది. మొదట్లో హల్ చల్ చేసిన పేటీఎం మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం గూగుల్ పే (Google Pay) వాడే వాళ్లకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఇప్పటి వరకు డిజిటల్ చెల్లింపులు అన్నీ కూడా ఉచితంగానే కొనసాగేవి. గూగుల్ పే కూడా పలు రకాల బిల్స్ చెల్లింపుల సమయంలో ఛార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఫోన్ పే కూడా రీఛార్జ్ సహా పలు రకాల పేమెంట్లకు ఛార్జీలను వసూలు చేస్తుంది. ఈ క్రమంలో గూగుల్ పే కూడా అదే బాటలోకి వచ్చింది. ఇప్పుడు జీ పేలో కరెంట్ లేదా గ్యాస్ బిల్, ఇతర చెల్లింపులు చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఈ ఛార్జీలు వర్తించనున్నాయి. ఈ క్రమంలో మీరు చేసే చెల్లింపులకు 0.5శాతం నుంచి 1శాతం వరకు ఛార్జీలను వసూలు చేస్తుంది. ఇది కాకుండా జీఎస్టీ అదనంగా చెల్లించాలి.
ఈ క్రమంలోనే జీ పే వినియోగదారులు ఇటివల క్రెడిట్ కార్డు ఉపయోగించి కరెంట్ బిల్లు చెల్లించిన క్రమంలో రూ. 15 కన్వినెన్స్ ఫీజు(Convenience fee) చెల్లించాల్సి వచ్చిందని ఓ వ్యక్తి పేర్కొన్నారు. ఈ రికవరీని గూగుల్ పే ప్రాసెసింగ్ ఫీజుగా పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఇందులో జీఎస్టీ కూడా ఉంది. ఇది తెలిసిన వినియోగదారులు ఏకంగా రూ.15 ఛార్జ్ ఏంటని బిత్తర పోతున్నారు. మొదట ఉచితంగా వాడుకోవచ్చని ప్రకటించిన ఈ సంస్థ క్రమంగా ప్రజలకు అలవాటుగా మారిన తర్వాత ఫీజులు వసూలు చేస్తుందని పలువురు యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే గూగుల్ పే ఈ ఛార్జీలకు సంబంధించి ముందస్తుగా ఎలాంటి సమాచారం అందించలేదు. మనీ ట్రాన్స్ ఫర్, మెట్రో కార్డ్ రీఛార్జీ, బీమా ప్రీమియం, రైల్వే టిక్కెట్స్, విమాన టిక్కెట్స్ బుకింగ్స్ వంటి ఇతర సర్వీసులకు గూగుల్ పే, UPI ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఈ ఛార్జీలను చెల్లించకుండా తప్పించుకోవాలంటే ఆయా సంస్థల అధికారిక వెబ్ సైట్ల ద్వారా పేమెంట్స్ చేస్తే కస్టమర్లు తప్పించుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు జియో, ఐడియా, ఎయిర్‌టెల్ వంటి రీఛార్జ్ కోసం వినియోగదారులు ఆయా కంపెనీల వెబ్ సైట్స్ లేదా యాప్స్ నుంచి పేమెంట్స్ చేసుకుంటే ఎక్స్ ట్రా ఛార్జీలు పడకుండా ఉంటాయి.