
BJP- TDP And Janasena: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమయం ఉంది. అయినా అధికార వైసీపీని గద్దె దించేందుకు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జగన్‌ను ఓడించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇందులో జనసేన కీలకంగా మారబోతోంది. ఈ క్రమంలో టీడీపీ – జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ టార్గెట్‌గా బీజేపీ ఢిల్లీ నుంచే పావులు కదుపుతోంది.
బీజేతో పొత్తు నామ్‌కే వస్తే..
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన నాలుగేళ్లుగా బీజేపీ – జనసేన పొత్తు కొనసాగుతోంది. కానీ అది నామ్ కే వాస్తేగా ఉంది. రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు లేవు. ఇక పొత్తుపై టీడీపీ– జనసేన నుంచి అధికారిక క్లారిటీ లేదు. పవన్ తమతోనే ఉన్నారని, ఉంటారని బీజేపీ ముఖ్య నేతలు ప్రకటనలు చేస్తున్నారు. పవన్ సైతం తాము బీజేపీతో ఉన్నామని చెబుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం 2014 తరహాలోనే మూడు పార్టీలు కలవాలని కోరుకుంటున్నారు. కానీ, టీడీపీతో కలవటానికి బీజేపీ సిద్దంగా లేదు. జనసేన టీడీపీకి దగ్గరవుతున్న క్రమంలో ఢిల్లీ కేంద్రంగా బీజేపీ కొత్త స్కెచ్ అమలు చేస్తోంది. ఇది ఏపీ రాజకీయాల్లో పొత్తులపై ప్రభావం చేసే అవకాశం కనిపిస్తోంది.
జనసేనతో పొత్తుకు టీడీపీ ఆసక్తి..
వైసీపీ ముక్త ఆధ్రప్రదేశ్‌ను లక్ష్యంగా పెట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఈమేరకు ఏడాదికాలంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. మరోవైపు యాత్ర చేసేందుకు వాహనం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో ఒంటగిగా వెళ్తే జగన్‌ను ఓడించడం సాధ్యం కాదని గుర్తించిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ జనసే, బీజేపీతో కలిసి పనిచేయాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో జనసేనతో పొత్తు ఖాయంగానే కనిపిస్తోంది. కానీ, టీడీపీ నేతల్లో మాత్రం ఇంకా కొంత క్లారిటీ లోపిస్తోంది. మరోవైపు పవన్ కల్యాణ్ తమకు బీజేపీతో పొత్తు కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు గేమ్ మొదలు పెట్టారు. పవన్ తమతోనే ఉన్నారంటూ పదే పదే చెబుతున్నారు. పవనే తాను బీజేపీతో కొనసాగేదీ లేనిది చెప్పాల్సిన పరిస్థితి కల్పించారు.
ప్రయోజనం లేని పొత్తు..
బీజేపీతో పొత్తు కారణంగా ఇప్పటి వరకు రెండు పార్టీలకు కలిసి వచ్చిన అంశాలు లేవు. కలిసి పని చేసిన కార్యక్రమాలూ లేవు. అటు పవన్ ఇంకా పార్టీని ఎన్నికల దిశగా సిద్దం చేయటంపైన ఫోకస్ పెట్టలేదు. ఇదే సమయంలో బీజేపీ ముఖ్య నాయకత్వం పవన్ అడుగులను గమనిస్తోంది. జనసేనానితో పొత్తుపై ఎక్కడా వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం లేదు. ఇదే సమయంలో జనసేనాని కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. బీజేపీతో పొత్తు కారణంగా జనసేనలో చేరాల్సిన కన్నా లక్ష్మీనారాయణను కూడా పవన్ వదులుకున్నారు. మరోవైపు పొత్తు ఉన్నా లేకపోయినా టీడీపీలో చేరటం రాజకీయంగా తనకు కలిసి వస్తుందని కన్నా భావించారు. గతంలో టీడీపీ నుంచి వచ్చిన ఆఫర్‌ను ఇప్పుడు సద్వినియోగం చేసుకుంటున్నారు. జనసేన నాయకత్వం కన్నాను టీడీపీకి దగ్గరయ్యేలా చేసింది. ఇదే సమయంలో అటు టీడీపీ– వైసీపీ ఎన్నికలకు సిద్ధమవుతుండగా జనసేన నుంచి ఎటువంటి కార్యాచరణ లేకపోవటంపై సీనియర్లు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. మరోవైపు పొత్తులపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వెనుక వ్యూహం కూడా అంతుచిక్కటం లేదు.

టీడీపీ లక్ష్యంగా బీజేపీ కొత్త స్కెచ్
ఏపీలో ఎన్నికల పొత్తుల వేళ.. బీజేపీ కొత్త గేమ్ మొదలు పెట్టింది. టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటున్న బీజేపీ నేతలు.. అటు టీడీపీతో కలిసేందుకు సిద్ధమవుతున్న పవన్‌పైనా పరోక్షంగా ఒత్తిడి పెంచుతున్నారు. జనసేనాని తనంతటగా తాను నిర్ణయం తీసుకొనే పరిస్థితి కల్పిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర నేతలతో ఎలా ఉన్నా.. ప్రధాని మోదీ– అమిత్‌షాతో సత్సంబంధాలు ఉండాలని పవన్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ–బీజేపీతో కలిసి ముందుకెళ్లాలనేది పవన్ ఆలోచన. దీని కోసమే వేచి చూస్తన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేందుకు నో చెబుతోంది. టీడీపీతో లేకుండా బీజేపీతో కొనసాగడం పవన్‌కు నచ్చడం లేదు. కానీ ఈ విషయాన్ని ఓపెన్‌గా చెప్పలేని పరిస్థితిలో జనసేనాని ఉన్నారు. ఇదే ఇప్పుడు బీజేపీ ఢిల్లీ పెద్దలకు అస్త్రంగా మారుతోంది.