
YCP Government: వైసీపీ సర్కారు తప్పుమీద తప్పుచేస్తోంది. తప్పు అని తెలిసినా ఆ పార్టీ నేతలు అదే పంథాను కొనసాగిస్తున్నారు. చివరకు న్యాయస్థానంలో నడుస్తున్న కేసులపై కూడా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా అమరావతి రాజధాని ఇష్యూలో కూడా చాలారకాలుగా మాట్లాడేశారు. అవి కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండడంతో దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. ముఖ్యంగా విశాఖలో 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును సక్సెస్ చేసుకునేందుకు చెప్పిన మాటలు ప్రతిబంధకలుగా మారాయి. విశాఖే రాజధాని అని సీఎం జగన్, మూడు రాజధానులన్న ముచ్చటే లేదని.. అది టెక్నికల్ గ్యాప్ అంటూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన వ్యాఖ్యానించడంతో పరిస్థితి అడ్డం తిరిగింది. ఇటు ప్రజల్లో చర్చనీయాంశంగా మారడంతో పాటు అటు కోర్టు కూడా కలుగుజేసుకునే అవకాశముండడంతో అధికార పార్టీ నేతలు కలరవపడుతున్నారు. అయితే ఈ విషయంలో కోర్టుకు ఏం సమాధానం చెప్పాలో కసరత్తు చేస్తున్నారు.
అయితే వైసీపీ సర్కారు మాత్రం తన మనసులో ఉన్న మాటను బయటపెట్టేసింది. విశాఖ ఏకైక రాజధాని అని స్పష్టత వచ్చింది. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ఉద్దేశించి సీఎం, మంత్రి బుగ్గన వ్యాఖ్యలతో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. పారిశ్రామికవేత్తలు రాజధాని విషయంలో అడుగుతున్న ప్రశ్నలకు నివృత్తి చేసే క్రమంలో విశాఖే ఏకైక రాజధాని అంటూ తేల్చేయ్యడం కొత్త వివాదాలకు దారి తీస్తోంది. ప్రస్తుతం అమరావతి రాజధాని కేసు సుప్రీం కోర్టులో ఉంది. విచారణ కొనసాగుతోంది. కోర్టు పరిధిలో ఉన్న కేసు విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. కానీ సీఎం నుంచి మంత్రులు దాకా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మూడు రాజధానులని కొందరు.. లేదు విశాఖ రాజధాని అని మరికొందరు ప్రకటనలు చేస్తున్నారు.

కేసు విచారణలో ఉన్న సమయంలో సీఎంతో పాటు మంత్రులు నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ సుప్రీం కోర్టుకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ పై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ తో పాటు అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ కు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో సుప్రీంకోర్టులో ఈ నెల 23న జరిగే తదుపరి విచారణలో ప్రభుత్వం ఏం చెప్పబోతోందన్నది కీలకంగా మారింది. అంతటా ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వీలున్నంత వేగంగా కోర్టు విచారణ జరపాలని ఇప్పటికే ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి రెండు లేఖలు రాశారు. అయితే కోర్టు పరిధిలో ఉన్న అంశంపై బాధ్యత కలిగిన సీఎం, మంత్రులు మాట్లాడకూదని తెలియదా అంటూ కోర్టు ప్రశ్నించే అవకాశముందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికైతే రాజధాని ఇష్యూను వైసీపీ ప్రభుత్వం మరింత జఠిలం చేసుకుంటోంది.