KCR BRS: ‘బీఆర్‌ఎస్.. కేంద్రంలో బీజేపీని గద్దె దించే పార్టీ.. బీఆర్‌ఎస్ ప్రకటనతో ప్రధాని నరేంద్ర మోదీలో వణుకు మొదలైంది. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలతో తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులపై దాడులు చేయిస్తున్నారు’ ఇదీ కొన్ని రోజులుగా బీఆర్‌ఎస్ గురించి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు. మల్లారెడ్డి లాంటి ఇంకొందరైతే కాబోయే ప్రధాని కేసీఆర్ అని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. కేసీఆర్ కూడా జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌కు గుర్తింపు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీలో హంగు ఆర్భాటాలతో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించారు. ఇంత చేసినా.. బీఆర్‌ఎస్‌కు జాతీయ పార్టీ లక్షణాలు ఉన్నట్లు కనిపించడం లేదు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు మినహా నేషనల్ లీడర్స్ కనిపించడం లేదు.

అధినేత అందుబాటులో ఉన్నా..
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ పార్టీ కార్యాలయంలో రోజంతా నేతలకు అందుబాటులో ఉంటున్నారు. అయితే ఆయనను కలిసిన వారంతా తెలంగాణ బీఆర్‌ఎస్ నేతలే. ఒక్కో ఎమ్మెల్యే కనీసం వంద మందిని తీసుకుని ఢిల్లీ వెళ్లి కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఢిల్లీ బీఆర్‌ఎస్ కార్యాలయంలో .. తెలంగాణ నేతలు తప్ప ఎవరూ కనిపించడం లేదు. ఓ రైతు నేతను.. బీఆర్‌ఎస్ రైతు విభాగానికి అధ్యక్షునిగా నియమించారు. ఆయన తప్ప ఎవరూ బీఆర్‌ఎస్ ఆఫీసులో తెలంగాణేతలు కనిపించలేదు. కనీసం కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా ఇతర రాష్ట్రాల ప్రజలను, ప్రముఖుల్ని రప్పించుకోలేకపోవడం బీఆర్‌ఎస్ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. జాతీయ పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా.. తనకు ఇతర రాష్ట్రాల నుంచి మద్దతు లభిస్తోందని చెప్పుకోవడానికైనా మద్దతుదారులను పిలిపించుకోవాల్సి ఉంది. కానీ అలాంటిపని చేయలేకపోయారు.
సంప్రదిస్తున్నా.. స్పందించని నేతలు..
బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి ఉత్తరాది రాష్ట్రాల నుంచి అఖిలేష్ యాదవ్ మాత్రమే వచ్చారు. కానీ ఒక్క నేత కానీ.. పార్టీలో చేరుతామని ఆసక్తి చూపేవారు కానీ కనిపించలేదు. చిన్నాచితకా పార్టీలతో కేసీఆర్ నేరుగా సంప్రదింపులు జరిపినా ఎవరూ బీఆర్‌ఎస్‌తో దోస్తీకి ఆసక్తి చూపడం లేదు. దీంతో తెలంగాణ నుంచి వచ్చే వారితోనే అభినందనలు అందుకుంటున్నారు. ఏపీ, మహారాష్ట్ర నుంచి కూడా నేతల్ని కేసీఆర్ ఆకర్షించలేకపోవడం బీఆర్‌ఎస్ నేతలకు ఇబ్బందికరంగా మారింది. కనీసం శుభాకాంక్షలు చెప్పడానికి కూడా ఆయా రాష్ట్రాల నుంచి ఎవరూ రాలేదు. ఏపీ నుంచి చాలా మందిని పిలిచారు కానీ ఒక్కరూ రాలేదు. మహారాష్ట్రలో కొన్నిపార్టీలు విలీనమవుతాయన్నారు కానీ.. వారెవరూ రావడం లేదు. కర్ణాటకలో జేడీఎస్ మిత్రపక్షంగా మారింది కానీ.. సీట్లు ఇవ్వని రాజకీయం కోరుకుంటోంది.

దూరంగా ఎర్రజెండా పార్టీలు..
మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలతో కేసీఆర్‌కు దగ్గరైన వామపక్ష పార్టీలు కూడా ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉండడం గమనార్హం. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అయినా వస్తాడని కేసీఆర్ భావించారు. కార్యాలయం ప్రారంభం రోజు ఆయన రాలేదు. మూడు రోజులు అయినా కార్యాలయం వైపు కన్నెత్తి చూసేందుకు కూడా ఆయన ఆసక్తి చూపడం లేదు. ఇక జాతీయ నేతలు కారాయలయ ప్రారంభోత్ససవానికి రావడానికి కేసీఆర్ తెలంగాణ ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాలు పంపినా.. తమిళనాడు, బీహార్, బెంగాల్, ఏపీకి పంపించారు. కానీ అవి ఖాళీగా తిరిగి ఢిల్లీ చేరుకున్నాయి.
కేసీఆర్ ఇప్పుడే ఢిల్లీలో రాజకీయం ప్రారంభించారు. ఆయన ఎప్పుడూ తెలంగాణ నేతలతోనే పనులు చక్కబెడితే.. ఆయన పార్టీని టీఆర్‌ఎస్ అనే అనుకుంటారు. ఇతర రాష్ట్రాల వారినీ ఆకర్షిచకపపోతే.. బీఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీగానే మిగిలిపోతోంది.