Tirumala Leopard: తిరుమల నడకదారిలో బాలుడిపై చిరుత దాడి కలకలం రేపింది. నిత్యం భక్తులు ఉండే ఈ మార్గంలో జంతువు మనుషులపై దాడి చేయడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. బాలుడిపై చిరుత దాడిచేసిన సమయంలో అక్కడున్న దుకాణదారులు, ఇతర భక్తులు పెద్దగా అరవడంతో చిరుత పారిపోయింది. దీంతో స్వల్పగాయాలతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. లేకుంటే బాలుడి ప్రాణం దక్కే అవకాశం లేదని అక్కడున్న వాళ్లంతా అనుకున్నారు. అయితే ఆ బాలుడిపై దాడి చేసిన చిరుతను అటవీ అధికారులుపట్టుకున్నారు. దానిని బోనులో బంధించి జూ కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు షాకింగ్ నిజం బయటపెట్టారు.
తిరుమల కొండ పరిసర ప్రాంతాల్లో సంచరించే ఈ చిరుత వయసు ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమేనన్నారు. ఇటీవల ఈ చిరుత తల్లి నుంచి వేరుగా ఉంటోంది. అయతే ఆహారాన్ని సేకరించే క్రమంలో పిల్లి అనుకొని బాలుడిపై దాడి చేసిందని అన్నారు. వాస్తవానికి ఈ చిరుత చాలా మంచిదని అసలు దానికి దాడి చేయడమే తెలియదని అన్నారు.త్వరలో ఈ చిరుతను దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేస్తామని చెప్పారు.
తిరుమల కాలినడకలో దాడి ఘటన తెలుసుకున్న తరువాత అధికారులు సంఘటనా ప్రదేశంలో బోను ఏర్పాటు చేశారు. రాత్రి 10.45 గంటలకు చిరుత బోనులోకి వచ్చి చిక్కింది. వాస్తవానికి చిరుత పిల్లిని తినడానికి వచ్చిందని, పిల్లి అనుకొని బాలుడి మెడను కొరికిందని అన్నారు. ప్రస్తుతం ఈ చిరుత ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చిరుత దాడిలో గాయపడ్డ బాలుడు టీటీడీ పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన హెల్త్ కు ఎలాంటి సమస్య లేదని వైద్యులు తేల్చారు.
ఈ సందర్బంగా బాలుడిని పరామర్శించేందుకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారావు ఆసుపత్రికి వచ్చారు. శ్రీవారి దయతో బాలుడికి పునర్జన్మ లభించిందని అననారు. అయితే కాలినడకన ప్రాంతంలో జంతువుల నుంచి ప్రమాదం లేకుండా కంచె లేదా ఇతర రక్షణ ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తామని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.