
ఏపీ సీఎం జగన్ సొంత బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో కొద్దిరోజుల నుంచి సీబీఐ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలు కీలక వ్యక్తుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన సీబీఐ.. తాజాగా వివేకా హత్యకు వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసింది.
కొద్దిరోజుల క్రితం ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ను కొద్దిరోజుల క్రితం అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా అతడి సోదరుడు కిరణ్ యాదవ్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది.
మొదట వైఎస్ వివేకాను హత్యకు వాడిన ఆయుధాలపై సునీల్ యాదవ్ సీబీఐతో రెండు వాగుల్లో వేసినట్టు తెలిపారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు రెండు రోజుల పాటు ఆ వాగుల్లో సీబీఐ మున్సిపల్ సహాయంతో గాలించారు. అనంతరం ఆయుధాలపై మరోసారి విచారించారు. అనంతరం ఏకకాలంలో నలుగురు అనుమానితుల ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది. వారి ఇళ్లలోని ఆయుధాలను స్వాధీనంచేసుకున్నారు.
ఇక సునీల్ యాదవ్ బ్యాంక్ పాస్ బుక్ స్వాధీనం చేసుకున్న సీబీఐ.. అతడి అకౌంట్ లో జరిగిన లావాదేవీల గురించి ఆరాతీస్తోంది. ఇక సునీల్ సోదరుడు కిరణ్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. సీబీఐ తమ ఇళ్లంతా చిందరవందర చేసిందని.. వేధింపులు చేస్తోందని.. అందుకే హైకోర్టుకు ఎక్కామని తెలిపారు. వివేకానందరెడ్డిని చంపింది ఎవరో అందరికీ తెలుసు అని.. అసలు నిందితులను వదిలి తమను వేధిస్తున్నాయని అతడు వాపోయాడు.
మొత్తంగా వైఎస్ వివేకా హత్య కేసులో ప్రస్తుతం ఆయుధాల కోసం సీబీఐ వేట సాగిస్తోంది. వాటి కోసం గాలిస్తూ కీలక ఆధారాల సేకరణ దిశగా అడుగులు వేస్తోంది.