Janasena party : జనసేనలోకి నేతల రాక మొదలైంది. ఒక్కరొక్కరూ పార్టీలోకి ప్రవాహంలా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న యాగ ఫలమో.. లేక జనసేనపై నమ్మకమో తెలియదు కానీ.. జనసేనలోకి ప్రముఖుల రాక షురూ అయ్యింది. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత జనసేన పార్టీలో చేరారు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ద్వారా తెలుగు చిత్ర సీమలో అనేక విజయవంతమైన సినిమాలను అందించిన నిర్మాత భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ (బీవీఎస్ఎన్ ప్రసాద్) సోమవారం జనసేన పార్టీలో చేరారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రసాద్ ధర్మ పరిరక్షణ నిమిత్తం పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న యాగ క్రతువులో పాలు పంచుకున్నారు. యాగశాలలో ప్రతిష్ఠించిన దేవతామూర్తులకు నమస్కరించుకున్న అనంతరం కార్యాలయంలోనే ఉన్న పవన్ కళ్యాణ్ తో కాసేపు ముచ్చటించారు.
పార్టీలో చేరాలనే తన నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ ఎదుట వ్యక్తపరిచారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతించిన పవన్ కళ్యాణ్ ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీ పురోభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా బీవీఎన్ఎస్ ప్రసాద్.. పవన్ కళ్యాణ్ తో చెప్పారు.