Central Cabinet: కేంద్ర క్యాబినెట్లో ఆ ఇద్దరూ టిడిపి ఎంపీలు

శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. ఆయనకు క్యాబినెట్ హోదా పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో ఆయన తండ్రి ఎర్రం నాయుడు కేంద్ర మంత్రిగా వ్యవహరించారు.

Written By: Neelambaram, Updated On : June 9, 2024 8:34 am

Central Cabinet

Follow us on

Central Cabinet: మరికొద్ది గంటల్లో ఈ దేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈసారి బిజెపి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దక్కించుకోలేదు. దీంతో మిత్రుల మద్దతు అనివార్యంగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మద్దతు కీలకం. ఈ నేపథ్యంలో టిడిపి కేంద్ర క్యాబినెట్లో చేరనుంది. ఆ పార్టీకి రెండు మంత్రి పదవులు లభించనున్నట్లు సమాచారం. అటు జనసేనతో పాటు బిజెపికి మంత్రి పదవులు సర్దుబాటు చేయాల్సి ఉన్నందున.. టిడిపికి రెండు మంత్రి పదవులతో సరి పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని పదవులు విస్తరణలో ఇస్తారని సమాచారం.

శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. ఆయనకు క్యాబినెట్ హోదా పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో ఆయన తండ్రి ఎర్రం నాయుడు కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వర్తించారు. అదే శాఖను ఇప్పుడు రామ్మోహన్ నాయుడుకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచిమూడోసారి గెలిచారు రామ్మోహన్ నాయుడు. మంచి వాగ్దాటి కలిగిన యువనేత. టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్ కు అత్యంత ఇష్టుడు. పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో కలిసి వచ్చింది. ఆయనకు కేంద్రమంత్రి పదవి వచ్చిందని సంకేతాలు వచ్చాయి. దీంతో శ్రీకాకుళం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఢిల్లీ వెళ్లాయి.

గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. ఆయన తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు. గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఆస్థానంలో చంద్రశేఖర్ వచ్చారు. ఈయన అమెరికాలో బడా పారిశ్రామికవేత్త. ఎన్నికల అఫిడవిట్లో వేలకోట్ల ఆస్తులు ఉన్నట్లు పొందుపరిచారు. నిజాయితీగా తనకున్న ఆస్తులను వెల్లడించడంతో జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. పెమ్మసానికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తెస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆయన పేరును సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. అయితే చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి ఇస్తారని సమాచారం.

జనసేనకు ఒక మంత్రి పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఆ పార్టీ రెండు లోక్సభ సీట్లను గెలుచుకుంది. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి హ్యట్రిక్ కొట్టారు. అందుకే ఆయనకు సహాయం మంత్రి పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక బిజెపి నుంచి దగ్గుబాటి పురందేశ్వరికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అనకాపల్లి నుంచి గెలిచిన పార్టీ ఎంపీ సీఎం రమేష్ సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు. మరి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారో.. మరికొద్ది గంటల్లో తేలనుంది.