Chandrababu: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నది. వైసిపి నియోజకవర్గాల ఇన్చార్జ్ లను మార్చుతూ సరికొత్త రాజకీయ ఎత్తుగడలకు శ్రీకారం చుడుతోంది. టికెట్ దక్కని వారు పార్టీని తిడుతూ ఉంటే.. టికెట్ పొందినవారు జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. టిడిపి జనసేన కూటమి కొన్ని స్థానాల్లో అభ్యర్థులను అంతర్గతంగా ప్రకటించింది. త్వరలో ఈ కూటమిలోకి బిజెపి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. కేటాయింపు కొలిక్కి వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఎన్నికల నేపథ్యంలో ఏపీలో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా మహీ వీ రాఘవ్ అనే దర్శకుడు యాత్ర_2 అనే సినిమాను తీశాడు. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేసేందుకు వైసిపి నాయకులు కిందా మీదా పడుతున్నారు. ఇక రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా కూడా జగన్ కు అనుకూలంగా తీసిందే. ఈ సినిమా ప్రస్తుతం కోర్టు కేసుల వల్ల విడుదలకు నోచుకోలేదు.
వైసిపి తీరు ఇలా ఉంటే టిడిపి కి అనుకూలంగా రాజధాని ఫైల్స్ అనే సినిమాను కొందరు తీశారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రధాన అంశంగా.. ఆ రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఈ సినిమాను చిత్రీకరించినట్టు విడుదలైన ట్రైలర్ ఆధారంగా తెలుస్తోంది. ఇది ఇలా ఉండగానే చంద్రబాబు జీవితం, ఆయన పరిపాలన, దూరదృష్టి వంటి కీలక అంశాలపై సీనియర్ జర్నలిస్టు పూల విక్రం “మహాస్వాప్నికుడు” అనే పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ గౌడ ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి అయిన ఖర్చు మొత్తం 50 లక్షల ను ప్రభాస ఆంధ్రుడు వెంకట్ కోడూరి భరించారు. త్వరలో ఏపీలో ఎన్నికలు నేపథ్యంలో ఈ పుస్తకాన్ని రూపొందించడం విశేషం. ఇటీవల చంద్రబాబు నాయుడు జీవితంపై విజనరీ అనే పుస్తకాన్ని కూడా రూపొందించారు. ఆ పుస్తకాన్ని కూడా టిడిపి నాయకులు అతిరథ మహారధుల సమక్షంలో ఆవిష్కరించారు.
మహా స్వాప్నికుడు పుస్తకంలో చంద్రబాబు రాజకీయ జీవిత చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆయన హయాంలో చేపట్టిన పథకాల గురించి వివరించారు. సామాన్య కుటుంబంలో పుట్టిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేదాకా.. ఆయన జీవితంలోని పలు అంశాలను ఈ పుస్తకాల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. అంతేకాదు వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని విషయంలో జరిగిన పరిణామాలు.. మూడు రాజధానుల ప్రస్తావన.. ఇక విషయాలను ఇందులో ప్రముఖంగా పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నాయుడుని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రత్యర్థి పార్టీల నాయకులు జరిపిన వివరాలపై ఒక అధ్యాయమే ఉందని విక్రమ్ ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం చర్చనీయాంశంగా మారింది. టిడిపి నాయకులు ఈ పుస్తకాన్ని భారీగా ప్రమోట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.