Chhattisgarh: బ్యాంకు రుణాలు ఈ రోజుల్లో అందరికీ అవసరం. బయట రుణాలు దొరకని పరస్థితిలో చిరు వ్యాపారికైనా.. బడా పారిశ్రామిక వేత్తకైనా బ్యాంకు రుణాలే ఆధారం. బ్యాంకు రుణాలపై వడ్డీ తక్కువగా ఉండడంతో చాలా మంది రుణాల కోసం పడరాని పాట్లు పడుతుంటారు. కొందరు పైరవీలు ఏస్తే.. మరికొందరు.. బ్యాంకు మేనేజర్లు, ఏజెంట్ల చుట్టూ తిరుగుతారు. వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. సబ్సిడీ రుణాలు అయితే లాబీయింగ్ మరింత ఎక్కువగా ఉంటుంది. లోను కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఓ వింత ఘటన జరిగింది. ఓ రైతు నాటు కోడి అంటే ఇష్టపడే బ్యాంకు మేనేజర్‌ను మచ్చిక చేసుకునేందుకు రూ.39 వేలు సమర్పించుకున్నాడు.
ఏం జరిగిందంటే..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బాలస్‌పూర్ జిల్లాలోని మస్తూరి పట్టణానికి చెందిన రైతు మన్హర్‌కు కోళ్ల ఫాం ఉంది. తన పొలంలో ఏర్పాటు చేసిన ఈ ఫాంను మరింత విస్తరించాలనుకున్నాడు అందుకు బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలని నిర్ణయించుకుని ఎస్‌బీఐ బ్రాంచి మేనేజర్‌ను కలిశాడు. లోక్ ఇస్తానని చెప్పిన మేనేజర్ తనకు నాటు కోడి కూర అంటే ఇష్టమని, తనకు ప్రతీ శనివారం నాటుకోడి తెచ్చి ఇవ్వాలని కోరాడు. లోన్ వస్తుందన్న ఆశతో రైతు మన్హర్ బ్యాంకు మేనేజర్ చెప్పినట్లు చేశాడు.
రెండు నెలల్లో రూ.39 వేల విలువైన కోళ్లు…
ఇలా బ్యాంకు మేనేజర్ రైతు అవసరాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. మేనేజర్ అడిగిన ప్రతీసారి రైతు నాటుకోడి తెచ్చి ఇచ్చేవాడు. ఇలా రెండు నెలలపాటు నాటుకోళ్లు తెచ్చి ఇచ్చాడు. ఇలా బ్యాంకు మేనేజర్ రైతు నుంచి రూ.39 వేల విలువైన కోళ్లు లాగించేశాడు. అంతే కాదు రైతు లోన్ నుంచి 10 శాతం కమిషన్ డిమాండ్ చేశారు. దీంతో రైతు ఫాంలోని కోళ్లు అమ్మి రూ.10 లక్షల లోన్‌కు 10 శాతం కమిషన్ కూడా ముట్టజెప్పాడు. అయినా మేనేజర్ లోన్ మంజూరు చేయలేదు. మరిన్ని నాటుకోళ్లు డిమాండ్ చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రైతు బ్యాంకు మేనేజర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆధారాలతో సహా..
బ్యాంకు మేనేజర్ కోసం కొనుగోలు చేసి తెచ్చిన నాటు కోళ్ల బిల్లులను తన వద్దే ఉంచుకున్న బాధిత రైతు ఫిర్యాదుకు వీటిని జత చేశాడు. మేనేజర్ తిన్న కోళ్లకు డబ్బులు ఇవ్వలేదని పేర్కొన్నాడు. మేనేజర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాడు. లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. బ్యాంకు మేనేజర్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశాడు.