PM Modi: సరిగ్గా రెండు సంవత్సరాలు క్రితం మహమ్మద్ ప్రవక్త పై బిజెపి నాయకురాలు నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆ సమయంలో ఖతార్ దేశ పర్యటనకు అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెళ్లారు. నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఖతార్ దౌత్య అధికారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిణామం కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇబ్బందిని కలగజేసింది. దీంతో ఖతార్ తో భారత్ దౌత్య సంబంధాలు దెబ్బతిన్నట్టేనని అందరూ అనుకున్నారు. దీంతో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కొంతమేర ఈ వివాదాన్ని పరిష్కరించారు. ఈ సమస్య ఇలా ఉండగానే గూఢచార్యానికి పాల్పడ్డారని ఖతార్ దేశం భారత నావిక దళ మాజీ అధికారులను అరెస్టు చేసింది. జైల్లో పెట్టింది. ఖతార్ దేశంతో ఏర్పడిన వివాదాల నేపథ్యంలో వీరు బయటకు రావడం అనుమానమేనని అప్పట్లో అందరూ అనుకున్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారందరి అనుమానాలను పటా పంచలు చేశారు. ఖతార్ మెడలు వంచి నావికాదళ మాజీ అధికారులను విడుదల చేయించారు.
గూడచర్యం ఆరోపణలతో ఖతార్ ప్రభుత్వం భారతదేశానికి చెందిన నావికాదళ మాజీ అధికారులను అరెస్టు చేసి జైల్లో పెట్టింది. వారు అక్కడ జైల్లో ఉండబట్టి 18 నెలలు అవుతుంది. అప్పట్లో వారికి మరణ దండన విధించగా.. న్యాయస్థానం జైలు శిక్షగా మార్చింది. అయితే వీరిని బయటకు తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శతవిధాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించి జైల్లో ఉన్న భారత నావిక దళ మాజీ అధికారులను ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది. విడుదలైన వారిలో ఈ ఏడుగురు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈ అరెస్టయిన వారంతా దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరు తమ దేశానికి వ్యతిరేకంగా గూడచర్యం నెరిపారని ఖతార్ ఆరోపించింది. వారందరినీ అరెస్టు చేసింది.. అరెస్టు చేసిన వారిలో 8 మంది భారత నావికాదళంలో పనిచేసిన వారే. అప్పట్లో వారిని అరెస్ట్ చేసినప్పుడు ఖతార్ కోర్టు మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కోర్టు దానిని జైలు శిక్షగా మార్చింది.. అప్పట్లో ఖతార్ ప్రభుత్వంతో ఏర్పడిన దౌత్య వివాదం అనంతరం ఈ విషయం వెలుగులోకి రావడంతో భారత ప్రభుత్వం సంప్రదింపులు మొదలుపెట్టింది. అవి సఫలీకృతం కావడంతో వారంతా ఖతార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పటికే ఏడుగురు ఢిల్లీ చేరుకున్నారు. మరొక వ్యక్తి కూడా మార్గమధ్యంలో ఉన్నారు. ” ఖతార్ ప్రభుత్వం భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నాం. జైలు శిక్ష అనుభవిస్తున్న 8 మందిలో ఇప్పటికే ఏడుగురు న్యూ ఢిల్లీ చేరుకున్నారు” అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
వాస్తవానికి భారత నౌకాదళ మాజీ సిబ్బంది దహ్ర గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్నారు. వారిలో కెప్టెన్లు సౌరభ్ వశిష్ట్, నవ తేజ్ గిల్, కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, పాకాల సుగుణాకర్, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్ పాల్, సెయిలర్ నాగేష్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ విశాఖపట్నం జిల్లాకు చెందిన వ్యక్తి. వీరంతా గూఢచర్యం జరుపుతున్నారని ఖతార్ ప్రాథమిక కోర్టు రెండు, మూడు సార్లు మాత్రమే విచారణ జరిపింది. మరణశిక్ష ఖరారు చేసింది. అయితే దీనిని రద్దు చేసేందుకు భారత్ దౌత్య పరంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీనికోసం అప్పీలు చేసుకోవడానికి అక్కడి కోర్టు అనుమతించింది. అయితే విచారణ జరిపిన న్యాయస్థానం 2023 డిసెంబర్ 28న మరణశిక్షను జైలు శిక్షగా మార్చింది. అంతేకాదు దీనిని అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల గడువు ఇచ్చింది. దీంతో ఆ దేశంలో ఉన్న అన్ని న్యాయ మార్గాలను మన విదేశాంగ శాఖ వినియోగించుకుంది. ఫలితంగా ఖతార్ న్యాయస్థానం దిగివచ్చి భారత పౌరులను విడుదల చేసింది.
విడుదల ప్రక్రియలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరంతరం చొరవ చూపారని.. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని భారత మాజీ నావిక దళ అధికారులు అభిప్రాయపడ్డారు. సోమవారం వారు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. “ఎట్టకేలకు స్వదేశానికి మేము చేరుకున్నాం. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఆయన వ్యక్తిగత జోక్యం లేకుంటే మేము బయటికి వచ్చేవాళ్లం కాదు. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ కి కూడా మేము కృతజ్ఞతలు చెబుతున్నామని” నావికాదళ మాజీ అధికారులు పేర్కొన్నారు.
గల్ఫ్ దేశమైన ఖతార్ కు భారతదేశానికి మధ్య అనేక రక్షణ ఒప్పందాలు ఉన్నాయి. ఈ దేశంలో లక్షల సంఖ్యలో భారతీయులు వివిధ రంగాలలో పనిచేస్తున్నారు.. ఖతార్ దేశం నుంచి భారత్ భారీ ఎత్తున లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ను దిగుమతి చేసుకుంటున్నది. అదే సమయంలో ఖతార్ రాజధాని దోహాకు వివిధ రూపాల్లో ఎగుమతులు చేస్తోంది. ఖతార్ ఉగ్రవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్టు వంటి దేశాలు పలు రకాల ఆంక్షలు విధించాయి. రవాణా మార్గాలను దిగ్బంధించాయి. ఇంతటి కష్టకాలంలోనూ ఖతార్ కు భారత్ నిర్మాణ సామగ్రి, ఇతర ఆహార పదార్థాల సరఫరాలో ఎటువంటి వివక్ష చూపించలేదు. భారత్ తమపై చూపిస్తున్న సానుకూల ధోరణికి మెచ్చి ఖతార్ భారత మాజీ నావికాదళ అధికారులను విడుదల చేసినట్టు తెలుస్తోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: 8 convicted navy veterans set free by qatar praise pm modi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com