తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో సుమారు 7,600 పైచిలుకు కేసులు నమోదైనట్టు సమాచారం. వారం కిందటి వరకు 4 నుంచి 5 వేలు మాత్రమే నమోదైన కేసులు ఇప్పుడు ఏడు వేలు దాటిపోవడం కొవిడ్ ఉధృతిని తెలియజేస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లోనూ.. రాష్ట్రంలో టీకాల కొరత, కరోనా టెస్టు కిట్ల కొరత వేధిస్తోంది. గురువారం పలు జిల్లాల్లో, మండలాల్లో వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోయింది. మిగిలిన ప్రాంతాలకు తక్కువగా సరఫరా చేసినట్టు తెలుస్తోంది. వ్యాక్సిన్ కోసం కేంద్రానికి రెండు నుంచి మూడు రోజులు తిరగాల్సి వస్తోందని జనం గగ్గోలుపెడుతన్నారు.
ఇటు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్కపోవడంతో వైద్యం ఆలస్యమవుతోంది. దీంతో.. రోడ్ల మీదనే బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. కరీంనగర్ నుంచి అంబులెన్స్ లో హైదరాబాద్ వచ్చిన ఓ బాధితుడికి ఏ ఆసుపత్రిలోనూ బెడ్ దొరకలేదు. దీంతో.. అంబులెన్స్ లోనే ప్రాణం కోల్పోయిన దుస్థితి.
మెదక్ జిల్లా తూప్రాన్ మునిసిపాలిటీ పరిధిలోని పోతరాజుపల్లికి చెందిన పల్లపు శ్యామల మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. టెస్టు చేయడంతో పాజిటివ్ వచ్చిందని తెలియగానే తుదిశ్వాస విడిచింది.
ఇక, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మృతిచెంది ఉన్నాడు. గురువారం ఉదయం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైద్యులు పరీక్షిస్తే కొవిడ్ పాజిటివ్ అని తేలింది. పరీక్షల కోసం వచ్చి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మరో ఘటనలో వనపర్తి జిల్లా వీపనగండ్ల పీహెచ్ సీలో కరోనా పరీక్ష చేయించుకున్న నర్సింహా అనే వ్యక్తి.. ఫలితం వచ్చేలోపే ప్రాణాలు కోల్పోయాడు.
అయితే.. వీరంతా వైద్యం సకాలంలో అందకనే ప్రాణాలు కోల్పోయారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం కారణంగానే.. అన్యాయంగా ప్రాణాలు పోతున్నాయని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.